మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 13, 2020 , 00:38:02

మందన మెరిసినా..

మందన మెరిసినా..
  • ఫైనల్లో ఆసీస్‌ చేతిలో ఓడిన భారత్‌

మెల్‌బోర్న్‌: టీ20 ప్రపంచకప్‌ సన్నాహాల్లో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మెగాటోర్నీ కి ముందు ము క్కోణపు సిరీస్‌లో సత్తాచాటుదామనుకున్న  టీమ్‌ఇండియాకు ఆఖరి పోరులో ఆశాభంగం ఎదురైంది. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలోని భారత్‌ 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆసీస్‌ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యఛేదనలో కౌర్‌సేన..20 ఓవర్లలో 144 పరుగులకు కుప్పకూలింది. స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మందన(37 బంతుల్లో 66, 12ఫోర్లు) అర్ధసెంచరీ మినహా జట్టులో చెప్పుకోదగ్గ స్కోర్లు ఏమి నమోదు కాలేదు. ఆసీస్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ జెస్‌ జొనాసెన్‌(5/12)ధాటికి ఏ ఒక్కరూ నిలదొక్కుకోలేకపోయారు. మందన తనదైన ఫామ్‌ను కొనసాగిస్తూ ఆసీస్‌ బౌలర్లను ఆటాడుకుంది. 


బౌలర్‌ ఎవరన్నది లెక్కచేయని మందన తన ఇన్నింగ్స్‌లో 12 బౌండరీలతో విరుచుకుపడింది. లక్ష్యం వైపు సాఫీగా సాగుతున్న తరుణంలో 15వ ఓవర్లో స్కట్‌ బౌలింగ్‌లో నికోలా క్యారీ సూపర్‌ క్యాచ్‌తో మందన నిష్క్రమించింది. ఆ మరుసటి ఓవర్లోనే కౌర్‌(14)కూడా ఔట్‌ కావడంతో భారత్‌ గెలుపు ఆశలు సన్నగిల్లాయి. ఓవైపు సాధించాల్సిన రన్‌రేట్‌  అంతకంతకు పెరుగడంతో ఒత్తిడికిలోనై టీమ్‌ఇండియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. తొలుత బేత్‌ మూనీ(54 బంతుల్లో 71 నాటౌట్‌, 9ఫోర్లు) అర్ధసెంచరీతో ఆసీస్‌ 20 ఓవర్లలో 155/6 స్కోరు చేసింది. ఓపెనర్‌ హిలీ(4)ని తొలి ఓవర్లోనే దీప్తి ఔట్‌ చేసినా..మూనీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. భారత బౌలర్లను లక్ష్యం గా చేసుకుంటూ 9 బౌం డరీలతో చెలరేగింది. గైక్వాడ్‌ వేసిన ఆఖ రి ఓవర్లో రాచెల్‌తో కలిసి బౌండరీలు బాదిన మూనీ జట్టుకు పోరాడే స్కోరు కట్టబెట్టింది. 


సంక్షిప్త స్కోర్లు: ఆస్ట్రేలియా: 20 ఓవర్లలో 155/6(మూనీ 71 నాటౌట్‌, గార్నర్‌ 26, దీప్తిశర్మ 2/30, గైక్వాడ్‌ 2/32), భారత్‌: 20 ఓవర్లలో 144 ఆలౌట్‌(మందన 66, ఘోష్‌ 17, జొనాసెన్‌ 5/12, వాల్మెనిక్‌ 2/32).  

logo
>>>>>>