సోమవారం 30 మార్చి 2020
Sports - Mar 03, 2020 , 15:18:52

13ఏండ్ల తర్వాత రంజీ ఫైనల్‌ చేరిన బెంగాల్‌

13ఏండ్ల తర్వాత రంజీ ఫైనల్‌ చేరిన బెంగాల్‌

గతంలో రెండు పర్యాయాలు టైటిల్ సాధించిన బెంగాల్ జట్టు 2017-18 సీజన్‌లో చివరిసారి సెమీ ఫైనల్ చేరింది.

కోల్‌కతా:  రంజీ ట్రోఫీలో బెంగాల్‌ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండో సెమీ ఫైనల్లో భాగంగా కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌ 174 పరుగులతో ఘన విజయం సాధించింది. కర్ణాటకపై రికార్డు విజయం సాధించిన బెంగాల్‌ 13ఏండ్ల తర్వాత రంజీ ఫైనల్‌ చేరడం విశేషం.  గతంలో రెండు పర్యాయాలు టైటిల్ సాధించిన బెంగాల్ జట్టు 2017-18 సీజన్‌లో చివరిసారి సెమీ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. ఈడెన్ గార్డెన్ మైదానంలో  సెమీ ఫైనల్లో  కర్ణాటకను ఎదుర్కోవడానికి ఎలాంటి మార్పులు లేకుండానే బెంగాల్ బరిలో దిగింది. బెంగాల్‌ విజయంలో కీలక పాత్రపోషించిన మజుందార్‌(149 నాటౌట్‌:తొలి ఇన్నింగ్స్‌లో) 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. 

తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్‌ బౌలర్ల దెబ్బకు  122 పరుగులకే కర్ణాటక కుప్పకూలింది.  కర్ణాటక బ్యాట్స్‌మెన్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే తడబాటు కొనసాగించడంతో ఓటమి తప్పలేదు. 352 పరుగుల లక్ష్యఛేదనలో  బరిలో దిగిన కర్ణాటక 177 పరుగులకే ఆలౌటైంది.  టీమ్‌ఇండియా ఆటగాడు లోకేశ్‌ రాహుల్‌ (0: రెండు బంతుల్లో) మరోసారి విఫలం కాగా.. కరుణ్‌ నాయర్‌ (6), సమర్థ్‌ (27) విఫలమయ్యారు.  బెంగాల్‌ బౌలర్‌ ముకేశ్‌ కుమార్‌(6/61) ఆరు వికెట్లతో విజృంభించడంతో కర్ణాటక టపటపా వికెట్లు కోల్పోయింది. ఇషాన్‌ పోరెల్‌, అక్ష దీప్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టడంతో నాలుగోరోజు ఆట కేవలం రెండు గంటల్లోపే ముగిసింది. సీనియర్‌ ఆటగాడు రాహుల్‌(27) తొలి ఇన్నింగ్స్‌లోనూ పెద్దగా రాణించలేదు.

బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌: 312

కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌: 122

బెంగాల్‌  రెండో ఇన్నింగ్స్‌: 161

కర్ణాటక రెండో  ఇన్నింగ్స్‌: 177 ఆలౌట్‌logo