శుక్రవారం 07 ఆగస్టు 2020
Sports - Jul 15, 2020 , 00:20:27

స్టోక్స్‌ సిగరెట్‌ బ్రేక్‌

స్టోక్స్‌ సిగరెట్‌ బ్రేక్‌

సూపర్‌ ఓవర్‌కు ముందు కాస్త విరామం తీసుకున్న ఆల్‌రౌండర్‌

క్రైస్ట్‌చర్చ్‌: క్రికెట్‌ చరిత్రలో నభూతో అనదగ్గ 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ‘సిగరెట్‌ బ్రేక్‌' తీసుకున్నాడట. న్యూజిలాండ్‌తో నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఆ పోరులో ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో.. మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. అయితే అప్పటికే రెండున్నర గంటలకు పైగా మైదానంలో వీరోచితంగా పోరాడి డ్రెస్సింగ్‌ రూమ్‌కు చేరిన స్టోక్స్‌ సూపర్‌ ఓవర్‌ ప్రారంభానికి ముందు తనలోని ఆందోళనను తగ్గించుకునేందుకు పొగ తాగాడట. వన్డే క్రికెట్‌లో ఇంగ్లండ్‌ జట్టు తొలిసారి విశ్వవిజేతగా నిలిచి నిన్నటికి (మంగళవారం) ఏడాది పూర్తైన సందర్భంగా.. ‘మోర్గాన్స్‌ మెన్‌' పుస్తకంలోని కొన్ని ముఖ్యాంశాలను రచయితలు పంచుకున్నారు.

ఆందోళనను అధిగమించేందుకు

జూలై 14, 2019.. లార్డ్స్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 241 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనలో బెన్‌ స్టోక్స్‌ (84 నాటౌట్‌) అద్వితీయ పోరాటంతో ఇంగ్లండ్‌ జట్టు కూడా సరిగ్గా అన్నే పరుగులు చేసింది. ఆ తర్వాత సూపర్‌ ఓవర్‌లోనూ ఇరు జట్లు 15 పరుగులే చేయడంతో బౌండ్రీల నిబంధన ప్రకారం ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా ప్రకటించారు. ‘స్కోర్లు సమం కావడంతో డ్రెస్సింగ్‌ రూమ్‌కు తిరిగి వస్తున్న స్టోక్స్‌ కాస్త కంగారుగా కనిపించాడు. లార్డ్స్‌ అతడికి కొత్తేమీ కాదు. కానీ కిక్కిరిసిన అభిమానుల మధ్య..  కాస్త ఆందోళన చెంది ఉం టాడు. ఆ సమయంలో కెప్టెన్‌ మోర్గాన్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ను ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంటే.. స్టోక్స్‌ మాత్రం మట్టికొట్టుకుపోయిన తన డ్రెస్‌తో కాసేపు జట్టు సమావేశంలో పాల్గొని.. అటు నుంచి సిగరెట్‌ కాల్చేందుకు వెళ్లాడు. కాసేపు తనలో తాను ఉండి స్థిమిత పడ్డాక తిరిగి మైదానంలో అడుగు పెట్టాడు’ అని ఆ పుస్తక రచయితలు  నిక్‌ హాల్ట్‌, స్టీవ్‌ జేమ్స్‌ పేర్కొన్నారు. ఆ  మ్యాచ్‌లో బెన్‌ స్టోక్స్‌.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కించుకున్న విషయం తెలిసిందే.logo