మంగళవారం 26 మే 2020
Sports - May 23, 2020 , 21:40:20

బ్రాడ్‌, వోక్స్‌ తర్వాత స్టోక్స్‌..

బ్రాడ్‌, వోక్స్‌ తర్వాత స్టోక్స్‌..

లండన్‌: ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌, ప్రపంచకప్‌ హీరో బెన్‌ స్టోక్స్‌ తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో దాదాపు రెండు నెలలకు పైగా ఇండ్లకే పరిమితమైన ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే తిరిగి గ్రౌండ్‌ బాట పడుతున్నారు. పాకిస్థాన్‌తో సిరీస్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇంగ్లండ్‌ వెల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) 7 వేర్వేరు మైదానాల్లో 18 మంది ప్లేయర్ల కోసం ప్రాక్టీస్‌ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా స్టోక్స్‌ శనివారం బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. ఖాళీ మైదానంలో స్టోక్స్‌ ఐదు ఓవర్ల పాటు బౌలింగ్‌ చేశాడు. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. 

‘తిరిగి బౌలింగ్‌ చేయడం ఆనందంగా అనిపించింది. పచ్చిక మైదానంలో దిగి ఐదు ఓవర్లు బౌలింగ్‌ చేశా. స్టువర్ట్‌ బ్రాడ్‌, క్రిస్‌ వోక్స్‌ వేసిన దారిలోనే నేను పయనిస్తున్నా’ అని వ్యాఖ్య రాసుకొచ్చాడు. కాగా, అంతకుముందు శుక్రవారం బ్రాడ్‌, వోక్స్‌ బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. ఇక భారత్‌ విషయానికి వస్తే.. టీమ్‌ఇండియా తరఫున శార్దూల్‌ ఠాకూర్‌ శనివారం తొలిసారి మైదానంలో అడుగుపెట్టాడు. పాల్‌ఘర్‌లోని స్టేడియంలో బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు.  


logo