గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Mar 14, 2020 , 00:23:56

ఐపీఎల్‌ వాయిదా

ఐపీఎల్‌ వాయిదా

సగటు క్రీడాభిమానుల అంచనాలు.. అనుమానాలను నిజం చేస్తూ.. ‘వేసవి క్రికెట్‌ పండుగ’ ఐపీఎల్‌ వాయిదా పడింది. ఒకవైపు కరోనా మహమ్మారి ప్రాణాలు హరిస్తుంటే.. జనసమూహాలను ఒక్క చోట చేర్చి లేనిపోని ఉపద్రవాన్ని కొనితెచ్చుకోవడం సరికాదని భావించిన బీసీసీఐ 13వ సీజన్‌ను ఏప్రిల్‌15 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అభిమానులను అనుమతించకపోవడం.. విదేశీ ప్లేయర్లు అందుబాటులో లేకపోవడం.. మ్యాచ్‌లు నిర్వహించేందుకు మూడు రాష్ర్టాలు నిరాకరించడం. ఇలా అనేక సమస్యలను ఎదుర్కొంటున్న బీసీసీఐ ప్రస్తుతానికైతే రెండు వారాలు వాటి నుంచి బయటపడ్డా.. ఆ తర్వాత కూడా లీగ్‌ సజావుగా సాగుతుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

  • ఏప్రిల్‌ 15వరకు పొడిగిస్తూ బీసీసీఐ నిర్ణయం
  • ప్రజారోగ్యం దృష్ట్యానే ఈ నిర్ణయమన్న బోర్డు
  • ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణకు 3 రాష్ర్టాలు నిరాకరణ

న్యూఢిల్లీ: ఊహించిందే జరిగింది. కరోనా వైరస్‌ రోజురోజుకు విస్తరిస్తుండటంతో.. ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌ను వాయిదా వేశారు. విదేశీ ఆటగాళ్లకు అనుమతి నిరాకరణ.. ఖాళీ కుర్చీల మధ్య మ్యాచ్‌లు.. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వ్యతిరేకత.. ఇలా గత రెండు రోజులుగా ఐపీఎల్‌ విషయంలో మల్లగుల్లాలు పడ్డ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) చివరకు లీగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం మార్చి 29 నుంచి సీజన్‌ ప్రాంభం కావాల్సి ఉండగా.. రెండు వారాలు పొడిగిస్తూ.. ప్రారంభ తేదీని ఏప్రిల్‌ 15గా నిర్ణయించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా.. కొవిడ్‌-19 గురించే చర్చ సాగుతున్న తరుణంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నాడు. ‘కరోనా వైరస్‌ ప్రబలుతుండటంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా వచ్చే నెల 15 వరకు ఐపీఎల్‌ను వాయిదా వేయాలని బీసీసీఐ నిర్ణయించింది’అని జై షా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.


ఐదు తటస్థ వేదికలు!

ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించాల్సి రావడంతో పాటు.. అనవసర రిస్క్‌ వద్దనే ఉద్దేశంతోనే బీసీసీఐ ఈ చర్యలకు పూనుకుంది. తాజాగా ప్రకటించిన తేదీల ప్రకారం ఏప్రిల్‌ 15న లీగ్‌ ప్రారంభమయ్యే అంశంలోనూ పూర్తి స్పష్టత కొరవడింది. ‘లీగ్‌తో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరి ఆరోగ్యం గురించి బీసీసీఐ ఆందోళన చెందుతున్నది. అభిమానులతో పాటు ఆటగాళ్లు, ఫ్రాంచైజీలందరికీ సురక్షిత క్రికెట్‌ అనుభవం దక్కేందుకు అవసరమైన అన్నీ చర్యలు తీసుకుంటున్నది’అని జై షా అన్నారు. 


ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక ససేమిరా.. 

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆటల నిర్వహణకు మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి నిరాకరించాయి. మహమ్మరి ప్రబలకుండా ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించలేమని కుండబద్దలు కొట్టాయి. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంచైజీలకు సొంతగడ్డపై మ్యాచ్‌లు ఆడే అవకాశం లేకుండాపోయింది. అయితే వాయిదా వేసిన తేదీకి ఇంకా చాలా సమయం ఉండటంతో అప్పటివరకు పరిస్థితులు అదుపులోకి వస్తాయని  బీసీసీఐ భావిస్తున్నది.


ప్రజల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యం. అందుకే ప్రస్తుతానికి ఐపీఎల్‌ను వాయిదా వేశాం. ఈ అంశంపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుం ది. కాస్త సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది’

- గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు 


భారత్‌, దక్షిణాఫ్రికా సిరీస్‌ రద్దు  


భారత్‌, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ రద్దయ్యింది. వైరస్‌ అంతకంతకు ప్రమాదకరంగా మారుతున్న క్రమంలో తాము సిరీస్‌లో కొనసాగలేమంటూ దక్షిణాఫ్రికా క్రికెటర్లు అనాసక్తి ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో సిరీస్‌లో మిగిలిన రెండు వన్డేలను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం ప్రకటనలో పేర్కొంది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశాలను అనుసరించి ఈ నిర్ణయాన్ని  తీసుకున్నామని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. అయితే భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య తిరిగి మూడు వన్డేల సిరీస్‌ను రీషెడ్యూల్‌ చేస్తామని బోర్డు తెలిపింది.శుక్రవారం లక్నోకు చేరుకున్న సఫారీ జట్టు ఢిల్లీ నుంచి తమ దేశానికి బయల్దేరి వెళ్లనుంది. 


logo