ఆదివారం 05 జూలై 2020
Sports - May 25, 2020 , 00:39:10

‘పన్ను’ పోరు

‘పన్ను’ పోరు

  • ఐసీసీ, బీసీసీఐ మధ్య మరో వివాదం  
  • ప్రపంచకప్‌ పన్ను సంబంధిత లేఖపై ఈ-మెయిల్‌ వార్‌

న్యూఢిల్లీ: చైర్మన్‌ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. భారత్‌లో జరిగిన 2016 ప్రపంచకప్‌నకు సంబంధించిన పన్ను మినహాయింపుల వివాదం ఇంకా కొనసాగుతుండగానే.. ఐసీసీ, భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మధ్య మరో పోరు మొదలైంది. 2021 టీ20, 2023 వన్డే ప్రపంచకప్‌ టోర్నీలకు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. అయితే ఈ టోర్నీలకు సంబంధించిన పన్ను మినహాయింపు లేఖను బీసీసీఐ తమకు పంపలేదని, మే 18నే ఇందుకు గడువు ముగియడంతో ఆతిథ్య ఒప్పందం రద్దు కావొచ్చంటూ ఐసీసీ న్యాయ విభాగాధిపతి, ఐబీసీ (ఐసీసీ వ్యాపార సంస్థ) కార్యదర్శి జొనాథన్‌ హాల్‌ ఈ-మెయిల్‌ ద్వారా హెచ్చరించారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం నుంచి లేఖ పంపేందుకు గడుపు పొడిగించాలని కోరినా.. హాల్‌ నిరాకరించడంతో ఆగ్రహం చెందిన బీసీసీఐ దీటుగా బదులిచ్చింది.

కరోనా సంక్షోభంతో ఆలస్యం 

2021 టీ20 ప్రపంచకప్‌నకు సంబంధించి.. పన్ను విధానంపై భారత ప్రభుత్వం నుంచి ఐసీసీకి బీసీసీఐ లేఖ పంపాల్సి ఉంది. దీనికి ఈ ఏడాది మే 18నే గడువు ముగిసింది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని బీసీసీఐ పలుమార్లు సంప్రదించింది. కరోనా  కట్టడి చర్యలతో తలమునకలైన ప్రభుత్వానికి క్రికెట్‌పై దృష్టిసారించే సమయం లేకపోయిం ది. దీంతో పన్నుకు సంబంధించిన లేఖను ఐసీసీకి బీసీసీఐ పంపలేకపోయింది. 

కలిసి పనిచేస్తున్నాం

టోర్నీలకు పన్నుల మినహాయింపు విషయంలో బీసీసీఐతో కలిసి పనిచేస్తున్నామని ఐసీసీకి చెందిన ఓ అధికారి చెప్పారు. ఒప్పందాల ప్రకారం ప్రక్రియలన్నీ సమయానికి జరగాల్సి ఉందని, ప్రపంచ టోర్నీలను విజయవంతంగా నిర్వహించేందుకు అందరం కలిసి పనిచేస్తామని ఆయన అన్నారు.

బీసీసీఐ ఆగ్రహం 

కరోనా సంక్షోభం కారణంగా పన్నులకు సంబంధించిన లేఖను సరైన సమయానికి పంపలేకపోయామని, జూన్‌ 30 వరకు గడువు ఇవ్వాలని ఐబీసీని బీసీసీఐ కోరింది. దీనికి జొనాథన్‌ నిరాకరించడంతో .. బీసీసీఐ దీటుగా బదులిచ్చింది. ‘ఐసీసీ సభ్యదేశాలకు చెందిన డైరెక్టర్లు ఐబీసీలో ఉన్నారు. గడువు పొడిగించేందుకు ఏ బోర్డుకు చెందిన డైరెక్టర్లు నిరాకరించారు? వారి సంతకాలతో కూడిన పత్రాలు ఏవైనా ఉన్నాయా? వాటిని పంపండి’అని బీసీసీఐ బదులిచ్చింది. మే 26న జరిగే ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ విషయంపై చర్చకు పట్టుబట్టాలని బీసీసీఐ ఆలోచిస్తున్నది. 


logo