మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Aug 03, 2020 , 14:59:34

తప్పు అంగీకరిస్తే క్షమిస్తాం: బీసీసీఐ

తప్పు అంగీకరిస్తే క్షమిస్తాం: బీసీసీఐ

న్యూఢిల్లీ: గతంలో తప్పుడు వయసు వివరాలు సమర్పించిన ప్లేయర్లకు బీసీసీఐ ఓ అవకాశమిచ్చింది. వయసు విషయంలో అవకతవకలకు పాల్పడినట్టు స్వచ్ఛందంగా అంగీకరిస్తే నిషేధం విధించకకుండా క్షమిస్తామని తెలిపింది. 2020-21 సీజన్ బోర్డు ఏజ్ గ్రూప్​ పోటీల్లో పాల్గొంటున్న ఆటగాళ్లకు ఈ అవకాశం ఇచ్చింది.  వయసును ధృవీకరించే పత్రాలను సెప్టెంబర్​ 15వ తేదీలోగా సమర్పించాలని గడువు విధించింది. ఒకవేళ వయసు విషయంలో తప్పుడు వివరాలు సమర్పించినట్టు గడువు ముగిశాక తేలితే రెండేండ్ల నిషేధం విధిస్తామని సోమవారం  ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

“నకిలీ ధృవపత్రాలతో గతంలో వయసు విషయంలో తప్పుడు వివరాలు సమర్పించిన ఆటగాళ్ల కోసం ఈ పథకాన్ని తెచ్చాం. స్వచ్ఛందంగా తప్పును అంగీకరిస్తే నిషేధం విధించం. వారి ఏజ్ గ్రూప్​లో ఆడేందుకు అనుమతిస్తాం. అయితే ఇందుకు వారు సరైన పుట్టిన తేదీ వివరాలను సమర్పించాలి. సంతకం చేసిన లేఖ లేదా ఈమెయిల్​ను వయసును ధృవపరిచే పత్రాలతో సెప్టెంబర్ 15వ తేదీలోగా బీసీసీ వయసు ధృవీకరణ విభాగానికి సమర్పించాలి” అని బీసీసీఐ వెల్లడించింది. వయసు విషయంలో అవకతవకలకు పాల్పడినట్టు గడువు ముగిశాక తేలితే రెండేండ్ల నిషేధం విధిస్తామని స్పష్టం చేసింది. వయసు ధృవీకరణ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని గతంలో క్రికెట్ దిగ్గజాలు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ బీసీసీఐకి సూచించిన సంగతి తెలిసిందే. 


logo