గురువారం 16 జూలై 2020
Sports - May 30, 2020 , 20:03:03

ఖేల్‌రత్నకు రోహిత్‌ శర్మ.. అర్జునకు ముగ్గురి పేర్లు

ఖేల్‌రత్నకు రోహిత్‌ శర్మ.. అర్జునకు ముగ్గురి పేర్లు

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఖేల్‌రత్న అవార్డుకు టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ పేరును భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) నామినేట్‌ చేసింది. అలాగే అర్జున అవార్డుకు మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, పేసర్‌ ఇషాంత్‌ శర్మ పేర్లను కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖకు నామినేట్‌ చేసింది. మహిళల విభాగంలో అర్జున అవార్డు కోసం భారత మహిళల జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ దీప్తిశర్మ పేరును పంపింది. 

ఇంగ్లండ్‌ వేదికగా గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో ఐదు శతకాలతో భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ విశ్వరూపం చూపాడు. ఆ తర్వాత టెస్టుల్లోనూ ఓపెనర్‌గా అవతారమెత్తి శతకాల మోత మోగించాడు. అలాగే వన్డేల్లో మూడు ద్విశతాకాలు చేసిన ఏకైక క్రికెటర్‌గానూ రికార్డు హిట్‌మ్యాన్‌ పేరిటే ఉంది. మరోవైపు శిఖర్‌ ధవన్‌ సైతం కొన్నేండ్లుగా నిలకైడన ప్రదర్శన చేస్తున్నాడు. టెస్టుల్లో పేసర్‌ ఇషాంత్‌ శర్మ విజృంభిస్తూ.. ఎంతో కాలంగా జట్టుకు సేవలందిస్తున్నాడు. మరోవైపు భారత మహిళల జట్టు ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ మూడేండ్లుగా బ్యాట్‌తో, బంతితో రాణిస్తూ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నది. వన్డే, టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లోనూ అద్భుత ప్రదర్శన చేసింది. 


logo