శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Sports - Mar 19, 2020 , 00:25:33

జూలై-సెప్టెంబర్‌లో ఐపీఎల్‌!

 జూలై-సెప్టెంబర్‌లో ఐపీఎల్‌!

ముంబై: ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాప్తి పెరుగుతున్నది. పూర్తిగా ఎప్పుడు నియంత్రణలోకి వస్తుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 15నుంచి కూడా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌ జరిగే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో బీసీసీఐతో పాటు ఫ్రాంచైజీ యాజమాన్యాలు తర్జనభర్జన పడుతూ.. విభిన్న ఆప్షన్లను ఆలోచిస్తున్నాయి. ఈ క్రమంలో జూలై -సెప్టెంబర్‌ మధ్య ఈ ఏడాది ఐపీఎల్‌ను నిర్వహించాలన్న ప్రతిపాదనలు సైతం తెరమీదకు వచ్చినట్టు సమాచారం. ఆ సమయంలో ప్రధాన విదేశీ జట్లకు మేజర్‌ సిరీస్‌లు ఎక్కువగా లేకపోవడమే ఇందుకు కారణంగా ఉంది. ఐసీసీ భవిష్యత్‌ పర్యటనల ప్రణాళిక(ఎఫ్‌టీపీ) ప్రకారం యూఏఈలో  ఈ ఏడాది సెప్టెంబర్‌లో టీ20 ఆసియాకప్‌ జరుగనుంది. 

అదే నెలలో పాకిస్థాన్‌.. ఇంగ్లండ్‌లో పర్యటించనుండగా.. ఇంగ్లండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు వంద బంతుల క్రికెట్‌ను జూన్‌ -జూలై మధ్య నిర్వహించాలని యోచిస్తున్నది. మరోవైపు జూలై 20 నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌ జట్లకు షెడ్యూల్‌ ప్రకారం ఏ పెద్ద సిరీస్‌లు లేవు. దీంతో ఇంగ్లండ్‌ మినహా మిగిలిన జట్ల ఆటగాళ్లు ఐపీఎల్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఆసియా కప్‌ కాకుండా టీ20 ప్రపంచకప్‌ కంటే ముందు ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, శ్రీలంకలో మూడు టీ20ల సిరీస్‌లను భారత్‌ ఆడాల్సి ఉంది. ఐపీఎల్‌ జూలై - సెప్టెంబర్‌లో జరిపితే ఈ సిరీస్‌లను తర్వాత నిర్వహించేలా సర్దుబాటు ఎలా చేయాలన్నది బీసీసీఐకి సవాలుగా మారే అవకాశం ఉంది. 

కొన్ని ఇక్కడ.. మరికొన్ని విదేశాల్లో..!

ఐపీఎల్‌ను ఆలస్యంగా ప్రారంభించినా కొన్ని మ్యాచ్‌లు స్వదేశంలో.. మరికొన్ని విదేశాల్లో నిర్వహించే చాన్స్‌ లేకపోలేదు. అయితే అప్పటికి కరోనా వైరస్‌ ప్రభావాన్ని బట్టి ఇక్కడే నిర్వహించాలా.. విదేశాల్లోనా అనేది తేలే అవకాశం ఉంటుంది. 


logo