గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Aug 04, 2020 , 00:30:35

60 దాటితే అనుమతి లేదు

60 దాటితే అనుమతి లేదు

  • బీసీసీఐ ఎస్‌వోపీ మార్గదర్శకాలు 

న్యూఢిల్లీ: దేశంలో క్రికెట్‌ పునరుద్ధరణకు రంగం సిద్ధమైంది. కరోనా వైరస్‌ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలో అన్ని క్రికెట్‌ సంఘాలు ప్రామాణిక నిర్వహణ పద్ధతి (ఎస్‌వోపీ)ని కచ్చితంగా పాటించాలని బోర్డు సూచించింది. 100 పేజీలతో కూడిన ఎస్‌వోపీ మార్గదర్శకాల్లో పలు స్పష్టమైన సూచనలు చేసింది. ఇందులో 60 ఏండ్లు పైబడిన వారికి అనుమతి లేకపోవడంతో పాటు ప్రాక్టీస్‌ సెషన్లకు హాజరయ్యే వారు కచ్చితంగా అంగీకార పత్రంపై సంతకం చేయాలని పేర్కొంది. కొవిడ్‌-19 కారణంగా గత మార్చి నుంచి దేశంలో క్రికెట్‌ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు నుంచి దేశవాళీ సీజన్‌ మొదలు కావాల్సి ఉన్నా.. వైరస్‌ విజృంభణతో టోర్నీలు ఆలస్యంగా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్‌ పునరుద్ధరణ కోసం బీసీసీఐ సిద్ధం చేసిన ఎస్‌వోపీ మార్గదర్శకాలు ఇవే.

  • 60 ఏండ్ల పైబడిన సహాయక సిబ్బంది, అధికారులు, మైదాన సిబ్బందికి శిక్షణ శిబిరాల్లోకి అనుమతి లేదు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని కూడా ఇందులో చేర్చారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చేంత వరకు ఈ నిబంధన కొనసాగనుంది. 
  • శిక్షణ కోసం స్టేడియాలకు వచ్చే ప్లేయర్లు కచ్చితమైన నిబంధనలు పాటించాలి. శిక్షణ శిబిరం ప్రారంభానికి ముందు ఆటగాళ్ల గత రెండు వారాల ఆరోగ్య పరిస్థితులను మెడికల్‌ టీమ్‌ సేకరించాలి. క్రికెటర్లంతా ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు వైరస్‌ పరీక్షలు చేయించుకుని నెగిటివ్‌ వస్తేనే క్యాంప్‌లోకి అనుమతిస్తారు. స్టేడియాల్లోకి ప్రవేశించేవారు కచ్చితంగా ఎన్‌ 95 మాస్క్‌లు ధరించాలి (రెస్పిరేటర్‌ లేనివి).
  • శిక్షణా శిబిరం మొదలయ్యే సమయానికి ప్లేయర్లందరికీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌.. కరోనా వైరస్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించాలి. వైరస్‌ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలి. ప్రతి ఆటగాడు తమ సొంత వాహనాల్లోనే మైదానాలకు రావాలి. ఐసీసీ నిషేధం నేపథ్యంలో బంతిని పాలిష్‌ చేసేందుకు ఉమ్మి ఉపయోగించడానికి వీలులేదు.


తప్పు ఒప్పుకుంటే  క్షమిస్తాం: బీసీసీఐ 

వయసు విషయంలో తప్పుడు వివరాలు సమర్పించిన ప్లేయర్లకు బీసీసీఐ ఓ అవకాశమిచ్చింది. 2020--2021 సీజన్‌లో ఆడే ఆటగాళ్లు  తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చినట్లు స్వచ్ఛందంగా అంగీకరిస్తే.. నిషేధం విధించకుండా క్షమిస్తామని ప్రకటించింది. ఇందు కు సెప్టెంబర్‌-15వ తేదీని తుది గడువుగా పేర్కొంది. ‘తమకు తాముగా తప్పు ఒప్పుకుంటే నిషేధం విధించం. వారి ఏజ్‌ గ్రూప్‌లో ఆడేందుకు అనుమతిస్తాం. గడువు ముగిశాక అవకతవకలకు పాల్పడినట్లు తేలితే రెండేండ్లు బ్యాన్‌ చేస్తాం’అని బీసీసీఐ సోమవారం వెల్లడించింది. 

బిడ్‌లకు ఆహ్వానం

కిట్‌ స్పాన్సర్‌, అధికారిక జెర్సీల కోసం బీసీసీఐ సోమవారం బిడ్‌లను ఆహ్వానించింది. గత నాలుగేండ్లుగా స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న నైకీ కంపెనీ గడువు వచ్చే నెలతో ముగుస్తుండటంతో బోర్డు  టెండర్లకు సిద్ధమైంది. ‘ఇన్విటేషన్‌ టు టెండర్‌' (ఐటీటీ) ప్రక్రియ కింద కంపెనీలు స్పాన్సర్‌షిప్‌ కోసం పోటీపడవచ్చని బోర్డు పేర్కొంది. టెండర్‌ ఫీజు కింద లక్ష రూపాయలు చెల్లించి బిడ్‌లో పాల్గొనవచ్చని తెలిపింది. సోమవారం మొదలైన ఐటీటీ ప్రక్రియ ఈనెల 26 వరకు కొనసాగనుంది. అయితే ఏ దశలోనైనా, ఎలాంటి కారణాలు లేకుండా బిడ్డింగ్‌ను రద్దు చేయడం లేక నిలిపివేసే హక్కు తమకు ఉందని బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.


logo