న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్‌పై క్రమంగా కరోనా నీడలు కమ్ముకుంటున్నాయి. భారత్‌లో వైరస్ కరాళనృత్యం చేస్తుండడంతో లీగ్‌లో అలజడి రేగుతున్నది. మహమ్మారి విజృంభిస్తుండడంతో విదేశీ ఆటగాళ్లు.. ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్లేయర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ సహా ఆసీస్ ఆటగాళ్లు అండ్రూ టై, రిచర్డ్సన్, జంపా ఈ సీజన్ నుంచి తప్పుకోగా.. మరికొందరు అదే బాట పట్టాలని భావిస్తున్నారని సమాచారం. మరోవైపు భారత్ నుంచి విమానాల రాకపోకలను ఆస్ట్రేలియా నిషేధించడంతో ఆ దేశ ఆటగాళ్లలో చింత మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ స్పందించింది. మే 30న టోర్నీ ముగిశాక ఆటగాళ్లను వారి స్వదేశాలకు సురక్షితంగా చేరుస్తామని మంగళవారం హామీ ఇచ్చింది. ప్లేయర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ‘టోర్నీ పూర్తయ్యాక స్వదేశాలకు ఎలా వెళ్లాలని కొందరు ఆటగాళ్లు ఆలోచిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా గమ్యస్థానాలకు చేరేలా బీసీసీఐ అన్ని చర్యలు తీసుకుంటుంది. ఆయా దేశాల ప్రభుత్వాలను సంప్రదిస్తున్నాం. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇండ్లకు చేరుకున్నాకే టోర్నీ ముగిసినట్టు బీసీసీఐ భావిస్తుంది’ అని బీసీసీఐ సీఓఓ హేమాంగ్ అమీన్ ఆటగాళ్లను ఉద్దేశిస్తూ లేఖ విడుదల చేశారు.
వెళ్లే ఆలోచనలో వార్నర్, స్మిత్..!
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ కూడా ఐపీఎల్ నుంచి తప్పుకొని, ఆస్ట్రేలియాకు వెళ్లాలని భావించారని సమాచారం. విమానాల రాకపోకలపై తమ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకోక ముందే వారు బయలుదేరాలనుకున్నారని 9న్యూస్ వార్త సంస్థ వెల్లడించింది. అయితే విమాన రాకపోకలపై ప్రభుత్వం నిషేధం విధించడంతో వారు ఆలోచనలో పడ్డారట. మొత్తంగా 17 మంది ఆసీస్ ప్లేయర్లు ఈ సీజన్లో ఉన్నారు.
ఆటగాళ్లే ఏర్పాట్లు చేసుకోవాలి: ఆసీస్ ప్రధాని
ఐపీఎల్ కోసం ఆస్ట్రేలియా ప్లేయర్లు సొంతంగా భారత్‌కు వెళ్లారని, అందువల్ల తిరిగి వచ్చేందుకు వాళ్లే ఏర్పాట్లు చేసుకోవాలని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ చెప్పారు. ఇది దేశం తరఫున వెళ్లిన పర్యటన కాదని ఆయన చెప్పారు. మరోవైపు ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తుందని ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్ క్రిస్ లిన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ కాంట్రాక్టులో 10 శాతం మొత్తాన్ని ఆటగాళ్లందరూ చెల్లిస్తారని, ప్రయాణ ఏర్పాట్లు చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు సందేశం పంపానని అతడు వెల్లడించాడు.