సోమవారం 30 మార్చి 2020
Sports - Jan 19, 2020 , 01:09:07

సెలెక్టర్లు కావలెను: బీసీసీఐ

సెలెక్టర్లు కావలెను: బీసీసీఐ

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ నియంత్రణా మండలి (బీసీసీఐ) కొత్త సెలెక్టర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ప్రస్తుతం సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఎమ్మెస్కే ప్రసాద్‌తో పాటు సభ్యుడు గగన్‌ ఖోడా గడువు ముగియడంతో వీరి స్థానాల్లో కొత్తవారిని ఎంపిక చేసేందుకు కసరత్తులు మొదలెట్టింది. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 24 చివరి తేదీగా ప్రకటించిన బీసీసీఐ.. అభ్యర్థుల వయసుల 60 లోపు ఉండాలనే నిబంధన పెట్టింది. దీంతో పాటు జాతీయ జట్టు తరఫున కనీసం 7 టెస్టులు, 30 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు కానీ.. 10 వన్డేలు, 20 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు కానీ ఆడిన అనుభవం ఉండాలని పేర్కొంది. మొత్తం ఐదుగురు ఉన్న సెలెక్షన్‌ ప్యానల్‌లో శరణ్‌దీప్‌ సింగ్‌, దేవాంగ్‌ గాంధీ, జతిన్‌ పరంజపే.. మరో ఏడాది పాటు కొనసాగనున్నారు.

పాండ్యా ఫిట్‌నెస్‌పైనే..
హార్దిక్‌ పాండ్యా ఫిట్‌నెస్‌ అంశం ఇంకా కొలిక్కి రావడం లేదు. వెన్నెముక గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ క్రమంలో ఆదివారం న్యూజిలాండ్‌ పర్యటనకు వన్డే, టెస్టు జట్లను ప్రకటించాల్సి ఉన్నా.. హార్దిక్‌ను దృష్టిలో పెట్టుకుని వాయిదా వేశారు. 


logo