ఎవరి దారి వారిదే!

హెచ్‌సీఏలో తీవ్ర స్థాయికి విభేదాలు
- అధ్యక్ష, కార్యవర్గ సభ్యుల మధ్య లేని సఖ్యత
- ముస్తాక్ అలీ టోర్నీ జట్టు ఎంపికపై సందిగ్ధత
సంధి కాలంలో భారత జట్టు పగ్గాలు చేపట్టి అత్యుత్తమ సారథిగా మన్ననలు అందుకున్న సౌరవ్ గంగూలీ ఆ తర్వాత పాలక వర్గంలోనూ తనదైన శైలిలో దూసుకెళ్తున్నాడు. అనూహ్య పరిణామాల మధ్య బీసీసీఐ అధ్యక్ష పీఠం అధిరోహించిన దాదా.. వచ్చీరావడంతోనే తనదైన మార్క్ చూపెట్టాడు. బీసీసీఐ బాధ్యతలు చేపట్టి నెల రోజులు తిరగక ముందే బంగ్లాదేశ్‌తో గులాబీ టెస్టు ఆడేందుకు టీమ్ఇండియాను సిద్ధం చేశాడు. తక్కువ వ్యవధిలోనే బంగ్లా బోర్డును ఒప్పించడం నుంచి ఆ మ్యాచ్‌కు బంగ్లా ప్రధాని షేక్ హసీనాను ముఖ్య అతిథిగా రప్పించి అన్నీ తానై వ్యవహరించాడు. అప్పటి వరకు పింక్ బాల్‌తో ఆడేందుకు సంశయించిన భారత జట్టు.. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో దుమ్మురేపడంతో దాదా తొలి అడుగుతోనే అందరిచేత శెభాష్ అనిపించుకున్నాడు.
అచ్చం అలాగే గతేడాది హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ అజారుద్దీన్ నుంచి కూడా క్రీడాభిమానులు ఇలాంటి సంస్కరణలే ఆశించారు. సారథ్యంలో దాదా కంటే సీనియర్ అయిన అజ్జూభాయ్ దూకుడైన చర్యలతో హెచ్‌సీఏ ముఖచిత్రం మారుస్తాడని భావించారు. దశాబ్ద కాలం పాటు భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించి.. మూడు వన్డే ప్రపంచకప్‌లలో జట్టును ముందుండి నడిపించిన సేనాని.. హెచ్‌సీఏ పరిపాలనలో మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా దాదా ప్రతీ అడుగు వెనుక కార్యదర్శి జై షా ఉన్నాడనేది వాస్తవం. అదే హెచ్‌సీఏ విషయానికి వస్తే అజ్జూభాయ్కి మిగిలిన కార్యవర్గ సభ్యుల మధ్య సఖ్యత లేదనేది సుస్పష్టం. దీంతో ముస్తాక్ అలీ ట్రోఫీకి ముందు జట్టు ఎంపికపై సందిగ్ధత నెలకొంది.
ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ తీరుతెన్నులపై ప్రత్యేక కథనం....
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్‌కు ముందు వేలం నిర్వహించాల్సి ఉండటంతో.. ఈ ఏడాది దేశవాళీ సీజన్‌ను సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీతో ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఈ టోర్నీని దేశంలోని ఆరు కేంద్రాల్లో బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. జనవరి 10 నుంచి టోర్నీ ప్రారంభం కానుండంతో.. ఒకటో తేదీ కల్లా ఆయా జట్లు నిర్దేశించిన వేదికలకు చేరుకోవాల్సి ఉంది. ఈ అంశంపై బీసీసీఐ అన్ని రాష్ర్టాల సంఘాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. అంటే ఇంకా వారం రోజుల గడువు మాత్రమే ఉంది. ఎలైట్ గ్రూప్-బిలో ఉన్న హైదరాబాద్ జట్టు కోల్‌కతా వేదికగా మ్యాచ్‌లు ఆడనుంది. డిసెంబర్ 20 లోపు జట్ల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని బీసీసీఐ ఆదేశించగా.. ఇప్పటి వరకు హైదరాబాద్ జట్టు ఎంపికపై స్పష్టత రాలేదు.
మూడు రోజుల లీగ్ ఇప్పుడెందుకో?
ముస్తాక్ అలీకి ముందు ఆటగాళ్ల ప్రతిభను పరిశీలించాలనుకుంటే.. ఏదైనా టీ20 టోర్నీనో లేక వన్డే లీగో నిర్వహించాలి కానీ హెచ్‌సీఏ మాత్రం విచిత్రంగా మూడు రోజుల లీగ్‌కు శ్రీకారం చుట్టింది. గతేడాది లీగ్‌లో 19 జట్లే ఉంటే ఈ ఏడాదికి ఆ సంఖ్య 35కు పెరిగింది. మరి ఇన్ని మ్యాచ్‌లను పరిశీలించేది ఎవరు? ఆటగాళ్ల ప్రదర్శనను అంచనా వేసేది ఎవరు? జట్టును ఎంపిక చేసేది ఎవరనేది అంతుచిక్కని ప్రశ్నలే. ఈ విషయంలో అజర్‌కు, కార్యవర్గ సభ్యులకు మధ్య స్పష్టమైన భేదాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్న తీరు క్రీడాభిమానులను నిరుత్సాహపరుస్తున్నది. ఇదిలా ఉంటే హెచ్‌సీఏ పెద్దల వైఖరితో విసిగిపోయిన అంబటి రాయుడు, రవికిరణ్ లాంటి క్రికెటర్లు వేరే రాష్ర్టాలకు తరలిపోయారు. విభేదాలు ఇలాగే కొనసాగితే హెచ్‌సీఏ పరిస్థితి ఏంటన్నది ఆందోళనకరంగా మారింది.
గతమెంతో ఘనం..
ఎమ్ఎల్ జయసింహా నుంచి వీవీఎస్ లక్ష్మణ్ వరకు ఎందరో మేటి ఆటగాళ్లను భారత జట్టుకు అందించిన హైదరాబాద్ క్రికెట్ సంఘం గత రంజీ సీజన్లో అధ్వాన్నమైన ప్రదర్శన చేసింది. నానాటికి నాసిరకమైన ఆటతీరుతో గల్లీ జట్లకంటే తీసికట్టుగా మారింది. అజారుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక సమూల మార్పులు ఆశిస్తే.. ఇప్పటి వరకు ఏ ఒక్క విషయంలోనూ ముందడుగు పడలేదు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి దీపక్ వర్మను అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్‌గా అజర్ నియమిస్తే.. కార్యవర్గం అంతా ఏకమై అతడి ఎంపిక చెల్లదని కోర్టుకు వెళ్లింది. వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎమ్)లో చర్చించకుండా అజర్ నిర్ణయం తీసుకోవడాన్ని కార్యదర్శి విజయానంద్ బాహాటంగానే తప్పుబట్టారు. ఇలా ప్రతి చిన్న విషయానికి ఆఫీస్ బేరర్ల అనుమతి తప్పనిసరి అంటూ ఆంక్షలు విధిస్తూ అజర్ ముందరి కాళ్లకు బంధం వేస్తున్నారు.
చేయాలని ఉన్నా..
యువ ఆటగాళ్లకు సూచనలివ్వడంలో అజారుద్దీన్ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. గతేడాది రంజీ ట్రోఫీలో జట్టు ప్రదర్శన ఘోరంగా ఉండటంతో అజర్ స్వయంగా కోచ్ అవతారమెత్తి.. నెట్స్‌లో యువ ఆటగాళ్ల ప్రాక్టీస్‌ను దగ్గరుండి పరిశీలించాడు. హిమాలయ్ అగర్వాల్ స్టాన్స్‌ను సరిచేసేందుకు అతడి కాళ్ల కదలికలపై పలు సూచనలు చేశాడు. అజ్జూభాయ్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఉప్పల్ మైదానంలో ఒకే ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ (వెస్టిండీస్‌తో టీ20) జరిగింది. వాస్తవానికి ఆ మ్యాచ్ ముంబై వేదికగా జరుగాల్సి ఉన్నా.. సెక్యూరిటీ కారణాల వల్ల వేదిక మార్చాలని బీసీసీఐ భావించగా.. నిర్వహించేందుకు మేం సిద్ధమని అజర్ ముందుకొచ్చి మన్ననలు అందుకున్నాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ కోసం సెలెక్షన్ కమిటీతో పాటు కోచ్‌ను ఎంపిక చేశాం. అహ్మదాబాద్‌లో జరుగనున్న బీసీసీఐ ఏజీఎమ్‌లో పాల్గొని వచ్చిన అనంతరం జట్లను ఎంపిక చేస్తాం. బీసీసీఐ మార్గదర్శకాలను పాటిస్తూనే ముందుకు సాగుతున్నాం.ఎస్వోపీ గైడ్‌లైన్స్ ప్రకారమే ముస్తాక్ అలీ ఏర్పాట్లు సాగుతున్నాయి. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆటగాళ్లు హైదరాబాద్ నుంచి ఇతర రాష్ర్టాలకు తరలి వెళ్తున్నారు. ఎక్కడ ఆడినా అందరూ బీసీసీఐ పరిధిలోకే వస్తారు. హెచ్‌సీఏ అధ్యక్షుడితో విభేదాలున్నాయనేది అబద్ధం. అంశాలవారిగా వేర్వేరు అభిప్రాయాలు ఉంటాయే తప్ప.. జట్టుగా మా అందరి లక్ష్యం ఒక్కటే.
- విజయానంద్, హెచ్‌సీఏ కార్యదర్శి
తాజావార్తలు
- పార్లమెంట్ క్యాంటిన్లో నో సబ్సిడీ: ధరలు తడిసిమోపెడు
- బడ్జెట్లో సామాన్యుడు ఏం ఆశిస్తున్నాడు?
- టీసీఎస్ @ 3
- భారత్‌కు టిక్‌టాక్ గుడ్‌బై
- అటవీ అధికారులు సహకరించాలి
- మార్కెట్లో అలజడి
- బీవోబీ లాభం 1,159 కోట్లు
- 2 వేల కోట్లు సమీకరించిన జీఎమ్మార్
- మార్కెట్ నిర్మాణానికి.. ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
- ‘పల్స్ పోలియో’ను జయప్రదం చేయాలి