పదికి పచ్చజెండా

- సీజన్ ఐపీఎల్లోరెండు కొత్త జట్లు
- ఒలింపిక్స్‌లో క్రికెట్ కోసం ఐసీసీకి మద్దతు
- దేశవాళీ క్రికెటర్లకు కొవిడ్-19 పరిహారం
- బీసీసీఐ ఏజీఎమ్‌లో కీలక నిర్ణయాలు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎమ్)కీలక నిర్ణయాలకు వేదికైంది. 2022 సీజన్లో పది జట్ల ఐపీఎల్‌కు పచ్చజెండా ఊపడం సహా ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్‌కు చోటు కల్పించేందుకు ఐసీసీతో కలిసి కృషి చేయాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌నకు ఐసీసీకి పన్ను మినహాయింపు, మహిళల టెస్టు క్రికెట్, దేశవాళీ క్రికెటర్లకు నష్ట పరిహారం, బోర్డు ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా నియామకం.. సహా ఏజీఎమ్‌లో అనేక అంశాలపై చర్చించింది.
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విస్తరణకు బీసీసీఐ ఆమోదం తెలిపింది. రెండు కొత్త జట్లకు టోర్నీలో అనుమతినిచ్చింది. 2022 సీజన్ నుంచి 10 జట్ల ఐపీఎల్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. గురువారం అహ్మదాబాద్ వేదికగా సౌరవ్ గంగూలీ అధ్యక్షతన జరిగిన బోర్డు 89వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎమ్)లో బీసీసీఐ పలు నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతానికి రెండు కొత్త జట్లకు అనుమతినిచ్చినా ఇంత త్వరగా సిద్ధం కావడం అసాధ్యం కావడంతో వచ్చే సీజన్‌ను 8 జట్లతోనే నిర్వహించనుంది. దీంతో 2022 సీజన్లోనే కొత్త జట్లు రంగప్రవేశం చేయనున్నాయి. ప్రముఖ వ్యాపార సంస్థలు అదానీ గ్రూప్, సంజీవ్ గోయెంకా గ్రూప్ (గతంలో పుణె సూపర్ జెయింట్స్ యజమాన్యం) ఐపీఎల్లో అడుగుపెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం.
ఏజీఎమ్‌లో బీసీసీఐ నిర్ణయాలు
- 2022 నుంచి పది జట్లతో ఐపీఎల్ నిర్వహణ. కొత్తగా రెండు జట్లకు అనుమతి
- విశ్వక్రీడల్లో టీ20 క్రికెట్‌ను చేర్చేలా ప్రయత్నాలు చేస్తున్న ఐసీసీకి సంపూర్ణ మద్దతు. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టేలా కృషి
- ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే అంశంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీతో బీసీసీఐ చర్చించే అవకాశం. విశ్వక్రీడల్లో క్రికెట్‌ను తిరిగి ప్రవేశపెట్టడానికి ఉన్న అవకాశాలపై అనుమానాల నివృత్తి కోసం బీసీసీఐ ప్రయ త్నం. బీసీసీఐ స్వయం ప్రతిపత్తి సంస్థగా కొనసాగుతున్న నేపథ్యంలో లీగల్ టీమ్ ఈ విషయంపై దృష్టి పెడుతుందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.
- స్వదేశంలో వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌నకు ఐసీసీకి భారత ప్రభుత్వం పన్ను రాయితీ ఇవ్వకుంటే బోర్డు తరఫునే చెల్లించాలని నిర్ణయం. ఇదే జరిగితే బీసీసీఐపై దాదాపు రూ.9 వందల కోట్ల భారం.
- కరోనా వైరస్ వల్ల దేశవాళీ క్రికెట్ జరుగకపోవడంతో ఫస్ట్‌క్లాస్ పురుషుల, మహిళా క్రికెటర్లకు నష్టపరిహారం చెల్లించేందుకు ఆమోదం
- బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా అధికారిక ఎంపిక. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బ్రిజేశ్ పటేల్ కొనసాగింపు
- ఐసీసీ బోర్డు డైరెక్టర్లుగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా కొనసాగింపు
- ఐపీఎల్ 14వ సీజన్ జరిగే సమయంలోనే ఏజ్ గ్రూప్(అండర్-23, 19, 16) టోర్నీలు నిర్వహించేందుకు తీర్మానం. వచ్చే ఏడాది భారత్‌లోనే ఐపీఎల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు
- మహిళల జట్టుకు టెస్టుల నిర్వహణపై చర్చ. వచ్చే ఏడాది భారత మహిళల టీమ్‌కు రెండు టెస్టులు నిర్వహించాలని యోచన
- గేమ్ డెవలప్మెంట్ జీఎం కేవీపీ రావును తొలిగించాలని నిర్ణయం. రాజీనామా చేయాలని ఆదేశం
- బీసీసీఐ గుర్తింపు పొందిన అంపైర్లు, స్కోరర్ల పదవీ విరమణ వయసు 55 నుంచి 60కు పెంపు
- జోన్ల వారిగా దేశవ్యాప్తంగా ఐదు కొత్త జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లను ఏర్పాటు చేయాలని నిర్ణయం. ప్రస్తుతం ఉన్న బెంగళూరు ఎన్సీఏపై ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు.
- గంగూలీ పరస్పర విరుద్ధ ప్రయోజనాలపై జరుగని చర్చ. ఫాంటసీ గేమింగ్ యాప్ మై లెవెన్‌తో గంగూలీ ఒప్పందంపై ఎలాంటి ప్రశ్నలు ఉత్పనం కాలేదు.
‘రంజీ’పై ఆశలు!
కరోనా వైరస్ ప్రభావం వల్ల రంజీ ట్రోఫీ రద్దు దాదాపు ఖాయమే అనుకున్నా బీసీసీఐ మాత్రం ఇంకా ఆశలున్నాయనేలా సంకేతాలిచ్చింది. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని జనవరి 10 నుంచి 31వ తేదీ వరకు బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది. కాగా దీని తర్వాతే విజయ్ హజారే ట్రోఫీతో పాటు వెనువెంటనే రంజీ ట్రోఫీ నిర్వహించాలన్న చర్చ ఏజీఎమ్‌లో వచ్చిందని సమాచారం. దేశవాళీలో ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ నిర్వహణకు అధ్యక్షుడు గంగూలీ సైతం సానుకూలంగా స్పందించాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అలాగే కరోనా కారణంగా దేశవాళీ క్రికెట్ జరుగకపోవడంతో పురుష, మహిళా క్రికెటర్లకు నష్ట పరిహారం ఇచ్చేందుకు బీసీసీఐ నిర్ణయించింది.