శుక్రవారం 22 జనవరి 2021
Sports - Jan 02, 2021 , 14:56:17

ఆస్ట్రేలియ‌న్ మీడియాపై బీసీసీఐ సీరియ‌స్‌

ఆస్ట్రేలియ‌న్ మీడియాపై బీసీసీఐ సీరియ‌స్‌

ముంబై: ఇండియ‌న్ క్రికెట‌ర్లు కొవిడ్‌-19 ప్రొటోకాల్‌ను ఉల్లంఘించార‌ని, దీనిపై బీసీసీఐ విచార‌ణ జ‌రుపుతోంద‌న్న‌ ఆస్ట్రేలియన్ మీడియా వార్త‌ల‌ను ఇండియ‌న్ క్రికెట్ బోర్డు ఖండించింది. అక్క‌డి మీడియాలోని ఓ వ‌ర్గం కావాల‌నే ద్వేష‌పూరిత వార్త‌ల‌ను ప్ర‌చురిస్తోంద‌ని బోర్డు మండిప‌డింది. రెండో టెస్ట్‌లో వాళ్ల టీమ్ ఓడిపోయిన త‌ర్వాత అక్క‌డి మీడియాలో ఇలాంటి వార్త‌ల‌ను ప్ర‌చురిస్తోంద‌ని విమ‌ర్శించింది. టీమ్‌లోని ప్లేయ‌ర్స్ అంద‌రికీ కొవిడ్ ప్రోటోకాల్స్ గురించి తెలుస‌ని బోర్డులోని ఓ సీనియ‌ర్ అధికారి వెల్ల‌డించారు. ఎలాంటి బ‌యో సెక్యూరిటీ ఉల్లంఘ‌న జ‌ర‌గ‌లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఆస్ట్రేలియా మీడియా కొన్నిసార్లు వాళ్ల టీమ్‌లాగే వార్త‌లు ప్ర‌చురిస్తుంద‌ని ఆ అధికారి మండిప‌డ్డారు. 

ఇండియ‌న్ క్రికెట‌ర్లు రోహిత్‌, పంత్‌, గిల్‌, సైనీ ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్క‌డ ఓ అభిమాని వాళ్ల బిల్లు చెల్లించాడ‌న్న వార్త‌తో ఈ గంద‌ర‌గోళం మొద‌లైంది. ఆ అభిమానిని పంత్ హ‌గ్ చేసుకున్నాడ‌ని, ఇది బ‌యో బ‌బుల్ ఉల్లంఘ‌నే అవుతుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ అదే అభిమాని త‌ర్వాత దీనిపై స్ప‌ష్టత ఇచ్చాడు. పంత్ త‌న‌ను హ‌గ్ చేసుకోలేద‌ని, అంత‌కుముందు అలా చెప్పినందుకు క్ష‌మించాల‌ని ట్వీట్ చేశాడు. అయితే సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ప‌త్రిక మాత్రం ఈ ఘ‌ట‌న‌పై బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా విచార‌ణ జ‌రుపుతున్న‌ట్లుగా వార్త ప్ర‌చురించింది. 


logo