శుక్రవారం 29 మే 2020
Sports - Mar 29, 2020 , 00:00:49

కదిలొస్తున్న క్రీడాలోకం

కదిలొస్తున్న క్రీడాలోకం

  • భారీ విరాళాలు ప్రకటిస్తున్న స్పోర్ట్స్‌ స్టార్స్‌

ప్రపంచాన్ని ఓ కుదుపు కుదుపుతున్న మహమ్మారి కరోనా వైరస్‌పై పోరాడేందుకు క్రీడాలోకం కదిలివస్తున్నది. కంటికి కనిపించని దానిపై పోరాటానికి అందరూ ముందుకు వస్తున్నారు. కొవిడ్‌-19ను సమర్థంగా ఎదుర్కొనేందుకు కావాల్సిన వాటిని సమకూర్చేందుకు భారీ విరాళాలు ఇస్తున్నారు. ఇందులో కొందరు డబ్బుల రూపంలో తమ దేశ ప్రభుత్వాలకు అండగా నిలుస్తుంటే..మరికొందరు వైద్యపరికరాల కోసం, అన్నార్థులకు అండగా ఉండేందుకు కదంకదం కలుపుతున్నారు. వైరస్‌ మహమ్మారిని పారద్రోలేందుకు హద్దులు లేవంటూ తమ సహృదయతను చాటుకుంటున్నారు. 

లండన్‌: కరోనా వైరస్‌తో క్రీడా ప్రపంచం ఒక్కసారిగా కుదేలైంది. ఈ మహమ్మారి ధాటికి  దేశాలన్ని గజగజ వణుకుతున్నాయి. ఓవైపు కరోనా కరాళనృత్యం చేస్తున్నా..ఆదుకునేందుకు తాము ఉన్నామంటూ భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌తో పాటు బీసీసీఐ చీఫ్‌  గంగూలీ, సాకర్‌ స్టార్స్‌ రొనాల్డో,  మెస్సీ, సెర్బియా టెన్నిస్‌ యోధుడు జొకోవిచ్‌ తదితరులు భారీ విరాళాలతో మిగతా క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 

మనసున్న మెస్సీ, రొనాల్డో:

 కరోనా వైరస్‌తో అతలాకుతలమవుతున్న ప్రజలను ఆదుకునేందుకు మెస్సీ, రొనాల్డో పెద్ద మనసుతో ముందుకొచ్చారు. వైరస్‌ నానాటికి శరవేగంగా వ్యాప్తిస్తున్న క్రమంలో తమవంతుగా ప్రభుత్వాలకు మద్దతుగా నిలిచేందుకు ఈ ఇద్దరు సాకర్‌ స్టార్స్‌ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా బార్సిలోనాతో పాటు అర్జెంటీనాలోని దవాఖానల్లో వైద్య సదుపాయాల కోసం మెస్సీ.. 1 మిలియన్‌ యూరోస్‌(రూ.8.36 కోట్లు) విరాళమిచ్చాడు. మరోవైపు తన ఏజెంట్‌ జార్జ్‌ మెండస్‌తో కలిసి లిస్బన్‌, పొర్టోలో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్ల(ఐసీయూ) కోసం రొనాల్డో కూడా రూ.8.36 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించాడు. టెన్నిస్‌ స్టార్స్‌ జొకోవిచ్‌, రోజర్‌ ఫెదరర్‌ ఒక్కో మిలియన్‌ యూరోల చొప్పున  సహాయం చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు. 

సచిన్‌, రైనా దాతృత్వం 

కష్టకాలంలో దేశ ప్రజలను ఆదుకోవడంలో తాము ఎవరికి తీసిపోమని సచిన్‌, రైనా నిరూపించారు. సురేశ్‌ రైనా శనివారం రూ.52 లక్షలు విరాళమిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇందులో ప్రధానమంత్రి రిలీఫ్‌ ఫండ్‌కు రూ.31 లక్షలు, యూపీ సీఎం సహాయక నిధికి రూ.21 లక్షలు ఇస్తున్నట్లు తెలిపాడు. మరోవైపు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ సైతం రూ.50 లక్షలు ఇచ్చాడు.  వీరికి తోడు పుణెకు చెందిన ఎన్జీవోతో కలిసి సీనియర్‌ క్రికెటర్‌ ధోనీ రూ.లక్ష సహా యం చేయగా, ధవన్‌..కూడా ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాళమిచ్చాడు. ఇక కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు పఠాన్‌ బ్రదర్స్‌ 4వేల మాస్క్‌లను బరోడా పోలీసులు, ఆరోగ్య శాఖకు ఇచ్చారు. వీరితో పాటు స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు రూ.10 లక్షలు, యువ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పూనియా తన ఆరు నెలల జీతం, స్ప్రింటర్‌ హిమాదాస్‌ ఒక నెల జీతం విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. 

బీసీసీఐ 51 కోట్ల విరాళం  

ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా వెలుగొందుతున్న భారత క్రికెట్‌ నియంత్రణ మండలి  (బీసీసీఐ)..కరోనా వైరస్‌పై పోరుకు భారీ విరాళం ప్రకటించింది. ప్రధానమంత్రి రిలీఫ్‌ ఫండ్‌కు రూ.51 కోట్లు విరాళమిస్తున్నట్లు బీసీసీఐ శనివారం పేర్కొంది. logo