సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Aug 29, 2020 , 15:38:57

ఔను..13మంది ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌: బీసీసీఐ

ఔను..13మంది ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌: బీసీసీఐ

దుబాయ్‌: రాబోయే ఐపీఎల్‌-13వ సీజన్‌ కోసం యూఏఈకి వెళ్లిన ఇద్దరు ఆటగాళ్లు, కొంతమంది సహాయ సిబ్బంది కరోనా బారినపడ్డారని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధికారిక ప్రకటన విడుదల చేసింది.  మొత్తం 13 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, అందులో ఇద్దరు ప్లేయర్లు  ఉన్నారని వెల్లడించింది.

ఆగస్టు 20 నుంచి 28 మధ్య మొత్తం 1988 RT-PCR టెస్టులు నిర్వహించినట్లు పేర్కొంది. అన్ని జట్లకు చెందిన ప్లేయర్లు, సపోర్ట్‌ స్టాఫ్‌, టీమ్‌ మేనేజ్‌మెంట్‌, బీసీసీఐ స్టాఫ్‌, ఐపీఎల్‌ ఆపరేషనల్‌ టీమ్‌, హోటల్‌, గ్రౌండ్‌ సపోర్ట్‌ స్టాఫ్‌ ఇలా అందరికీ నిరంతరం పరీక్షలు చేస్తూనే ఉన్నారు. 

'13 మందికి కరోనా సోకగా వీరిలో ఇద్దరు ఆటగాళ్లు ఉన్నారు. కరోనా బాధితులతో పాటు వీరితో దగ్గరగా కాంటాక్ట్‌ అయిన వారికి ఎలాంటి లక్షణాలు లేవు. వీరందరినీ ఇతర జట్ల నుంచి వేరు  చేసి ఐసోలేషన్‌లో ఉంచాం. వీరందరినీ ఐపీఎల్‌ మెడికల్‌ టీమ్‌ పర్యవేక్షిస్తోందని' బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.

కరోనా సోకిన ఆటగాళ్లు, సిబ్బంది లేదా వీరు ఏ జట్టుకు చెందినవారు అనే విషయాన్ని బోర్డు ప్రకటించలేదు. కరోనా బారినపడిన వారంతా చెన్నై సూపర్‌ కింగ్స్‌కు చెందినవారేనని తెలుస్తున్నది.  ఆ జట్టు పేసర్‌ దీపక్‌ చాహర్‌, యువ బ్యాట్స్‌మన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు వైరస్‌ సోకినట్లు సమాచారం. 


logo