శుక్రవారం 05 మార్చి 2021
Sports - Jan 19, 2021 , 14:03:25

టీమిండియాకు 5 కోట్ల బోన‌స్

టీమిండియాకు 5 కోట్ల బోన‌స్

ముంబై:  టీమిండియా క్రికెట‌ర్ల‌పై క‌న‌క వ‌ర్షం కురిసింది. బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీని చేజిక్కించుకున్న టీమిండియా ఆట‌గాళ్ల‌కు రూ.5 కోట్ల టీమ్ బోన‌స్‌ను ప్ర‌క‌టించింది బీసీసీఐ.  భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.  బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ,  కార్య‌ద‌ర్శి జే షాలు కూడా ఈ విష‌యాన్ని తెలిపారు.  గ‌బ్బా టెస్టులో 3 వికెట్ల తేడాతో నెగ్గిన టీమిండియా.. ఆస్ట్రేలియాతో జ‌రిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో కైవ‌సం చేసుకున్న‌ది.  అసాధార‌ణ రీతిలో సిరీస్‌ను గెలిచిన భార‌త క్రికెట‌ర్ల‌కు బీసీసీఐ భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించింది.  

ఇదో అద్భుత విజ‌యం అని, ఆస్ట్రేలియాకు వెళ్లి అక్క‌డ టెస్ట్ సిరీస్‌ను గెల‌వ‌డం అపూర్వ‌మ‌ని బీసీసీఐ అధ్య‌క్షుడు గంగూలీ అన్నారు. భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో ఈ విజ‌యం ఎన్న‌టికీ మ‌రిచిపోనిద‌న్నారు. సిరీస్‌లో పాల్గొన్న భార‌త జ‌ట్టుకు 5 కోట్ల బోన‌స్ ప్ర‌క‌టిస్తున్న‌ట్లు త‌న ట్వీట్‌లో గంగూలీ తెలిపారు.  ఈ గెలుపు విలువ‌కు ఏదీ స‌మానం కాద‌న్నారు. టూర్‌లో పాల్గొన్న ప్ర‌తి ఆట‌గాడిని గంగూలీ మెచ్చుకున్నారు. ఆట‌గాళ్లకు టీమ్ బోన‌స్‌గా 5 కోట్లు ప్ర‌క‌టించామ‌ని,  భార‌త క్రికెట్‌కు ఇవి ప్ర‌త్యేక‌మైన క్ష‌ణాల‌ని, అద్భుత నైపుణ్యాన్ని, ప్ర‌తిభ‌ను భార‌త జ‌ట్టు ప్ర‌ద‌ర్శించిన కార్య‌ద‌ర్శి జే షా త‌న ట్వీట్‌లో తెలిపారు.  


VIDEOS

logo