సోమవారం 30 నవంబర్ 2020
Sports - Oct 20, 2020 , 00:41:47

బార్క్‌లే X ఖవాజా.. ఐసీసీ చైర్మన్‌ పదవి రేసులో..

బార్క్‌లే X ఖవాజా.. ఐసీసీ చైర్మన్‌ పదవి రేసులో..

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) చైర్మన్‌ పదవి కోసం గ్రెగ్‌ బార్క్‌లే(న్యూజిలాండ్‌), తాత్కాలిక హెడ్‌ ఇమ్రాన్‌ ఖవాజా(సింగపూర్‌) పోటీలో నిలిచారు. ఐసీసీ అత్యున్నత స్థానం కోసం ఈ ఇద్దరూ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ విషయాన్ని ఐసీసీ సీనియర్‌ అధికారి ఒకరు సోమవారం వెల్లడించారు. చైర్మన్‌ పదవి కోసం ఎన్నిక జరిగితే మూడింట రెండొంతుల ఓట్లు అంటే 16 మంది బోర్డు సభ్యుల ఓట్లలో 11 దక్కించుకున్న వారు చైర్మన్‌గా ఎన్నికవుతారు. న్యూజిలాండ్‌ మాజీ డైరెక్టర్‌ అయిన బార్క్‌లేకు భారత్‌తో పాటు మరిన్ని టెస్టు దేశాల మద్దతు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం తాత్కాలిక చైర్మన్‌గా ఉన్న ఖవాజా(సింగపూర్‌)ను పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు సహా మరికొందరు బలపరిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇద్దరిలో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకుంటే ఖవాజానే తాత్కాలిక చైర్మన్‌గా కొనసాగుతారు. ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు మాజీ హెడ్‌ కాలిన్‌ గ్రేవ్స్‌ చైర్మన్‌ రేసులో ఉంటారని అంచనాలు వెలువడినా ఆయన నామినేషన్‌ వేయలేదని సమాచారం.  జూలైలో చైర్మన్‌ స్థానం నుంచి శశాంక్‌ మనోహర్‌ వైదొలిగినప్పటి నుంచి ఖవాజా తాత్కాలిక హోదాలో కొనసాగుతున్నారు.