ఆదివారం 29 మార్చి 2020
Sports - Feb 09, 2020 , 22:11:59

విశ్వ విజేతగా బంగ్లాదేశ్‌..

విశ్వ విజేతగా బంగ్లాదేశ్‌..

పోచెఫ్‌స్ట్రూమ్‌: సౌతాఫ్రికాలో జరిగిన అండర్‌-19 క్రికెట్‌ వరల్డ్‌కప్‌లో భారత్‌తో జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్‌ విజయం సాధించి, విశ్వవిజేతగా నిలిచింది. 178 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన బంగ్లా.. డక్‌ వర్త్‌ లూయిస్‌ పద్దతిలో 3వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బంగ్లా ఓపెనర్‌ పర్వేజ్‌(79 బంతుల్లో 47: 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. పర్వేజ్‌.. తన్జీబ్‌ హసన్‌తో కలిసి తొలివికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. కాలు పిక్క పట్టేయడంతో పర్వేజ్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగినా.. వరుస వికెట్లు పడడంతో మళ్లీ క్రీజులోకి వచ్చాడు. బంగ్లా కెప్టెన్‌ అక్బర్‌ అలీ(76 బంతుల్లో 42: 4 ఫోర్లు, 1 సిక్స్‌) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అతడికి పర్వేజ్‌ అండగా నిలవడం, లక్ష్యం మరీ చిన్నది కావడంతో వారి విజయం తేలికైంది. బంగ్లా 50 పరుగులతో ఉన్న సమయంలో భారత బౌలర్లు పుంజుకున్నారు. ముఖ్యంగా రవి బిష్ణోయ్‌(4/30) అద్భుతంగా రాణించాడు. ఒకానొక దశలో బిష్ణోయ్‌ భారత విజయంపై ఆశలు రేపాడు. అతడి ధాటికి బంగ్లా వరుసగా 4 వికెట్లు కోల్పోయింది. మరో ఎండ్‌లో సుశాంత్‌ మిశ్రా(2-25) సైతం అద్భుతంగా రాణించాడు. కార్తీక్‌ త్యాగి వికెట్లేమి తీయనప్పటికీ బంగ్లా బ్యాట్స్‌మెన్‌ కట్టడి చేయడంలో విజయవంతమయ్యాడు. 

బంగ్లా విజయానికి మరో 15 పరుగులు అవసరమైన సమయంలో వర్షం ఆటకు ఆటంకం కల్గించింది. దీంతో, అంపైర్లు ఆటను నిలిపివేశారు. అనంతరం డక్‌ వర్త్‌ లూయిస్‌ పద్దతిలో 46 ఓవర్లలో 170 పరుగుల లక్ష్యాన్ని విధించారు అంపైర్లు. దీంతో, బంగ్లాకు కావాల్సింది 5 ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే. 7 పరుగుల లక్ష్యంతో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టిన బంగ్లా తొలి ఓవర్‌లో కెప్టెన్‌ సింగిల్‌ తీయగా, రకిబుల్‌ హసన్‌ బౌండరీ బాదాడు. అనంతరం మరో పరుగు సాధించి, స్కోరు సమం చేశాడు. తర్వాతి ఓవర్లో రకిబుల్‌ హసన్‌ సింగిల్‌ తీసి బంగ్లా విజయాన్ని ఖరారు చేశాడు. దీంతో బంగ్లాదేశ్‌ తొలిసారి అండర్‌-19 క్రికెట్‌ వరల్డ్‌కప్‌లో విజేతగా నిలిచింది. 

అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 47.2 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌట్‌ అయింది. టోర్నీ ఆసాంతం వరుస విజయాలతో తుదిపోరుకు దూసుకొచ్చిన భారత్‌.. ఫైనల్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. యువ సంచలనం యశస్వి జైస్వాల్‌(121 బంతుల్లో 88: 8 ఫోర్లు, 1 సిక్స్‌) మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అతడికి తిలక్‌ వర్మ(38) కాసేపు సహకరించాడు. తిలక్‌వర్మ ఔటయిన అనంతరం, క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ ప్రియం గార్గ్‌(7)పరుగులకే వెనుదిరిగాడు. ధృవ్‌(22) కాసేపు బంగ్లా బౌలర్లను నిలువరించాడు. మిగితా బ్యాట్స్‌మెన్‌ అంతా తక్కువ పరుగులకు పెవిలియన్‌ చేరారు. దీంతో భారత్‌.. బంగ్లా ముందు నామమాత్రపు లక్ష్యాన్ని ఉంచింది.  

కాగా, రికార్డు స్థాయిలో 5వసారి వరల్డ్‌కప్‌ గెలుచుకుందామన్న టీమిండియా ఆశలు ఆవిరయ్యాయి. వారి ఓటమికి భారత ఫీల్డింగ్‌ వైఫల్యం కూడా కలిసొచ్చింది. భారత బౌలర్లు.. తక్కువ స్కోరును కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. వారు ఎక్స్‌ట్రాల రూపంలోనే 33 పరుగులు సమర్పించుకోవడం శోచనీయం. కాగా, తొలిసారి ఫైనల్‌ చేరి, విజేతగా నిలవడం బంగ్లా గొప్పతనాన్ని చాటుతోంది.బంగ్లా కెప్టెన్‌ అక్బర్‌ అలీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. 


logo