శనివారం 28 మార్చి 2020
Sports - Feb 07, 2020 , 00:40:27

భారత్‌ X బంగ్లాదేశ్‌

 భారత్‌ X బంగ్లాదేశ్‌
  • తొలిసారి అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరిన బంగ్లా
  • రెండో సెమీస్‌లో కివీస్‌ చిత్తు

పొచెఫ్‌స్ట్రూమ్‌: అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తుచేసిన బంగ్లాదేశ్‌ తొలిసారి మెగాటోర్నీ తుదిపోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లతో కివీస్‌పై నెగ్గిన బంగ్లా.. ఆదివారం జరుగనున్న తుదిపోరులో యువ భారత్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. లక్ష్యఛేదనలో మహ్ముదుల్‌ హసన్‌ జాయ్‌ (100; 13 ఫోర్లు) సెంచరీతో చెలరేగడంతో బంగ్లా సులువుగా గెలుపొందింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 211 పరుగులు చేసింది. వీలర్‌ గ్రీనాల్‌ (75 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌. బంగ్లా బౌలర్లలో షరీఫుల్‌ ఇస్లాం 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన బంగ్లా మహ్మూదుల్‌ ఇస్లాం శతకంతో విజృంభించడంతో 44.1 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 215 పరుగులు చేసింది. తౌహిద్‌ (40), షహాదత్‌ హుసేన్‌ (40 నాటౌట్‌) రాణించారు. బంగ్లా కెప్టెన్‌ అక్బర్‌ అలీ మాట్లాడుతూ.. ‘భారత్‌ మెరుగైన ప్రత్యర్థే అయినా.. మేము ఏ మాత్రం ఆందోళనకు గురికాకుండా ముందడుగేస్తాం. ఇది మా తొలి ఫైనల్‌ అనే భావన దరిచేరనివ్వం’ అన్నాడు. మరోవైపు తొలి సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 10 వికెట్ల తేడాతో నెగ్గిన యువ భారత్‌ వరుసగా మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.


logo