బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Feb 10, 2020 , 02:45:48

భళా బంగ్లా

భళా బంగ్లా
  • తొలిసారి అండర్‌-19 ప్రపంచకప్‌ నెగ్గిన బంగ్లాదేశ్‌
  • ఫైనల్లో 3 వికెట్ల తేడాతో ఓడిన భారత్‌..
  • యశస్వి జైస్వాల్‌, రవి బిష్ణోయ్‌ శ్రమ వృథా

పోచెఫ్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా): డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో అండర్‌-19 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన యువ భారత్‌ తుదిమెట్టుపై తడబడింది. మిడిలార్డర్‌ విఫలమవడంతో మొదట తక్కువ స్కోరుకే పరిమితమైన ప్రియం గార్గ్‌ సేన.. ఆనక బౌలింగ్‌లో విజృంభించి ప్రత్యర్థిని కట్టడి చేసినా.. తుదివరకు పోరాడిన బంగ్లాదేశ్‌నే విజయం వరించింది. ఆదివారం ఇక్కడి స్నెవెస్‌ పార్క్‌లో జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ (డ/లూ) పద్ధతి ప్రకారం 3 వికెట్ల తేడాతో గెలిచి తొలిసారి కప్పు కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలి ఐసీసీ ట్రోఫీ కావడం విశేషం. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత అండర్‌-19 జట్టు నిర్ణీత ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (121 బంతుల్లో 88; 8 ఫోర్లు, ఒక సిక్స్‌) మరోసారి అదరగొట్టగా.


తెలంగాణ ఆటగాడు నంబూరి ఠాకూర్‌ తిలక్‌ వర్మ (65 బంతుల్లో 38; 3 ఫోర్లు) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో అవిషేక్‌ 3, షరీఫుల్‌, తన్జీమ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడటంతో బంగ్లా లక్ష్యాన్ని 46 ఓవర్లలో 169కి కుదించారు. కాగా..  బంగ్లాదేశ్‌ 42.1 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసింది. ఓపెనర్‌ పర్వేజ్‌ హుసేన్‌ (47; 7 ఫోర్లు), కెప్టెన్‌ అక్బర్‌ అలీ (43 నాటౌట్‌; 4 ఫోర్లు, ఒక సిక్స్‌) రాణించారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్‌ (4/30), సుశాంత్‌ మిశ్రా (2/25) పోరాటం వృథా అయింది. భారత బౌలర్లు ఎక్స్‌ట్రాల రూపంలో 33 పరుగులు సమర్పించుకోవడం ఫలితంపై ప్రభావం చూపింది. అజేయంగా నిలిచి జట్టును గెలిపించిన అక్బర్‌ అలీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌', టోర్నీ ఆసాంతం రాణించిన యశస్వి జైస్వాల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ’ అవార్డులు దక్కాయి.

  

అతనొక్కడే..

వరుస విజయాలతో జోరుమీదున్న యువ భారత్‌ ఫైనల్లో తడబడింది. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై బంగ్లా పేసర్లు కట్టుదిట్టమైన బంతులతో బెంబేలెత్తించడంతో.. 7 ఓవర్లు ముగిసే సరికి ప్రియం సేన 9/1తో నిలిచింది. దీంతో పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయిన మన కుర్రాళ్లు.. ఆచితూచి ఆడటంతో భారత రన్‌రేట్‌ ఏ దశలోనూ 4 దాటలేదు. ప్రత్యర్థి పేసర్లు అవిషేక్‌ (3/40), తన్జీమ్‌ (2/28), షరీఫుల్‌ ఇస్లాం (2/31) పరీక్ష పెడుతున్నా.. యశస్వి జైస్వాల్‌ పట్టుదలతో బ్యాటింగ్‌ కొనసాగించాడు. టోర్నీలో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న జైస్వాల్‌కు తెలంగాణ ప్లేయర్‌ తిలక్‌ వర్మ చక్కటి సహకారం అందించాడు. ఈ జోడీ ఆచితూచి ఆడటంతో నెమ్మదిగా భారత ఇన్నింగ్స్‌ గాడినపడింది. సగం ఆట (25 ఓవర్లు) ముగిసేసరికి మన జట్టు 80/1తో నిలిచింది. 


ఈ క్రమంలో యశస్వి 89 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. రెండో వికెట్‌కు 93 పరుగులు జోడించాక తిలక్‌ ఔటయ్యాడు. కెప్టెన్‌ ప్రియం గార్గ్‌ (7) ఇలా వచ్చి అలా వెళ్లాడు. ధృవ్‌ జురేల్‌ (22)తో కలిసి కాస్త దూకుడు పెంచిన జైస్వాల్‌.. భారత స్కోరును 150 దాటించాడు. ఈ దశలో షరీఫుల్‌ వరుస బంతుల్లో యశస్వి, సిద్ధేశ్‌ వీర్‌ (0)ను ఔట్‌ చేసి భారత్‌ను దెబ్బతీశాడు. కాసేపటికే ధృవ్‌ ఔట్‌కాగా.. రవి బిష్ణోయ్‌ (2), అథర్వ (3), కార్తీక్‌ (0), సుశాంత్‌ (3) పెవిలియన్‌కు క్యూ కట్టారు. యువ భారత్‌ 21 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయిం ది. భారత ఇన్నింగ్స్‌ లో 12 ఫోర్లు, ఒక సిక్స్‌ మాత్రమే నమోదయ్యా యి. యశస్వి, తిలక్‌, ధృవ్‌ మినహా తక్కినవారంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు.


దురదృష్టాన్ని జేబులో పెట్టుకొని తిరిగే బంగ్లాదేశ్‌ ఎట్టకేలకు ఐసీసీ టైటిల్‌ నెగ్గింది. అండర్‌-19 ప్రపంచకప్‌లో తుదిపోరుకు చేరిన తొలిసారే డిఫెండింగ్‌ చాంపియన్‌యువ భారత్‌కు షాకిస్తూ ట్రోఫీ ఎగురేసుకెళ్లింది. 

ఇప్పటివరకు నాలుగుసార్లుప్రపంచకప్‌ నెగ్గినా.. ఒక్కసారి కూడా ట్రోఫీని నిలబెట్టుకోలేకపోయిన యువ భారత్‌.. ఈ సారి కూడా అదే ఆనవాయితీని కొనసాగించింది. 

ఫుల్‌ ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్‌ ఒంటరి పోరాటంతో ఒక దశలో 103/1తో ఉన్న భారత జట్టు 74 పరుగుల తేడాతో తొమ్మిది వికెట్లు కోల్పోయి తక్కువ స్కోరుకే

పరిమితమైంది.

అనంతరం బౌలింగ్‌లో యువలెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ చకచకా నాలుగు వికెట్లు తీసి భారత శిబిరంలో ఆశలు రేపినా ప్రత్యర్థి కెప్టెన్‌ తుదికంటా నిలిచిట్రోఫీని లాగేసుకున్నాడు.

యశస్వి.. రోహిత్‌లా.. 


గతేడాది జరిగిన సీనియర్‌ ప్రపంచకప్‌ సెమీఫైనల్లో టీమ్‌ఇండియా ఓడిపోయాక స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ బాధపడిన తీరు క్రికెట్‌ ప్రేమికులకు ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఆ టోర్నీలో ఐదు శతకాలతో సూపర్‌ ఫామ్‌ కనబరచినా.. టైటిల్‌ చేజిక్కకపోవడంతో రోహిత్‌ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కలేదు. ఇప్పడు అండర్‌-19 ప్రపంచకప్‌లో యువ కెరటం యశస్వి జైస్వాద్‌దీ అదే పరిస్థితి. వరుసగా ఐదు అర్ధశతకాలతో టీమ్‌ఇండియా ఫైనల్‌ చేరడంలో యశస్విదే కీలకపాత్ర. సహచరులంతా వెనుదిరిగినా ఫైనల్లోనూ అతడు హాఫ్‌ సెంచరీతో కదంతొక్కాడు. అయినా, తుదిపోరులో జట్టు ఓడడంతో రోహిత్‌ శర్మలా జైస్వాల్‌ శ్రమకు కూడా సంపూర్ణ ఫలితం దక్కలేదు. 


రవి  రఫ్ఫాడించినా..ఓ మాదిరి లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు పర్వేజ్‌, తన్జీద్‌ హసన్‌ (17) ఆకట్టుకోవడంతో బంగ్లా 8.2 ఓవర్లలోనే వికెట్‌ కోల్పోకుండా 50 పరుగులు చేసింది. ఇక భారత్‌ పరాజయం ఖాయమనుకుంటున్న దశలో రవి బిష్ణోయ్‌ చెలరేగిపోయాడు. తొలి ఓవర్‌లోనే తన్జీద్‌ను వెనక్కి పంపిన రవి.. ఆ తర్వాత తనదైన లెగ్‌ స్పిన్‌తో దూసుకెళ్లాడు. ఓవర్‌కో వికెట్‌ చొప్పున మూ డు వికెట్లు పడగొటా ్టడు. రవి ధాటికి మహ్ముదుల్‌ (8), తౌహిద్‌ (0), షహాదత్‌ (1) పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో ఆ జట్టు 65/4తో కష్టాల్లో పడింది. కాసేపటికి షమీమ్‌ (7) కూడా వెనుదిరగ్గా.. గాయం కారణంగా ఓపెనర్‌ పర్వేజ్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా డ్రెస్సింగ్‌ రూమ్‌కు చేరాడు. ఇక భారత్‌ గెలుపొందడం ఖాయమనుకుంటున్న దశలో బంగ్లా కెప్టెన్‌ అక్బర్‌ ఒంటరి పోరాటం చేశాడు. టెయిలెండర్ల సాయంతో జట్టును విజయం దిశగా నడిపించాడు. అవిషేక్‌ (5) ఔటవడంతో మరోసారి క్రీజులోకి వచ్చిన పర్వేజ్‌.. కెప్టెన్‌కు చక్కటి సహకారం అందించడంతో ఆ జట్టు సునాయాసంగా లక్ష్యంవైపు సాగింది. విజయానికి 35 పరుగుల దూరంలో పర్వేజ్‌ ఔటైనా.. రకీబుల్‌ (9) అండగా అక్బర్‌ అలీ మ్యాచ్‌ను ముగించాడు. 


కల నిజమైనట్లు అనిపిస్తున్నది. గత రెండేండ్లుగా మేం పడ్డ కష్టానికి ఫలితమే ఈ విజయం. ఈ స్థాయికి చేరడంలో సపోర్టింగ్‌ స్టాఫ్‌ కృషి చాలా ఉంది. ఇక ముందు కూడా ఇదే జోరు కొనసాగించాలనుకుంటున్నాం. మ్యాచ్‌ సందర్భంగా మా బౌలర్లు కాస్త ఆవేశానికి గురైన మాట వాస్తవమే. ఫైనల్లో భారత జట్టు చక్కటి ప్రదర్శన కనబరిచింది. వారికి నా అభినందనలు.

- అక్బర్‌ అలీ, బంగ్లాదేశ్‌ కెప్టెన్‌


ఈ రోజు మాది కాదు. ఫలితం నిరాశ పరిచినా.. మా కుర్రాళ్లు చక్కటి ఆటతీరు కనబరిచారు. తక్కువ పరుగులే చేసినా.. బౌలింగ్‌లో రాణించి బంగ్లాకు గట్టి పోటీనిచ్చారు. మరో 30, 40 పరుగులు చేసుంటే ఫలితం వేరేలా ఉండేది. 

-ప్రియం గార్గ్‌, భారత కెప్టెన్‌


1ఐసీసీ ట్రోఫీ నెగ్గడం బంగ్లాదేశ్‌కు ఇదే తొలిసారి. ఓవరాల్‌గా అండర్‌-19 ప్రపంచకప్‌ నెగ్గిన ఏడో జట్టుగా బంగ్లా రికార్డుల్లోకెక్కింది.

1ఈ మెగాటోర్నీలోఅత్యధిక పరగుల జాబితాలో యశస్వి జైస్వాల్‌ (400) అగ్రస్థానంలోనిలిచాడు.

3అండర్‌-19 ప్రపంచకప్‌లోవరుసగా ఐదు అర్ధశతకాలు చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా యశస్వి రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఆస్ట్రేలియా ప్లేయర్‌ బ్రెట్‌ విలియమ్స్‌ (1988), భారత ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ (2016) ఈ ఘనత సాధించారు.

33 అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో అత్యధిక ఎక్స్‌ట్రాలు (33)సమర్పించుకున్న చెత్త రికార్డును యువ భారత్‌ సమం చేసింది. 1998 ఫైనల్లో ఇంగ్లండ్‌ 33 ఎక్స్‌ట్రాలు ఇవ్వగా.. ఈసారి యువ భారత్‌ ఆ పని చేసింది. 


స్కోరు బోర్డు

భారత్‌: యశస్వి (సి) తన్జిద్‌ (బి) షరీఫుల్‌ 88, దివ్యాన్ష్‌ (సి) మహ్ముదుల్‌ 9బి) అవిషేక్‌ 2, తిలక్‌ వర్మ (సి) షరీఫుల్‌ (బి) తన్జీమ్‌ 38, ప్రియం (సి) తన్జీద్‌ (బి) రకీబుల్‌ 7, ధృవ్‌ (రనౌట్‌) 22, సిద్ధేశ్‌ (ఎల్బీ) షరీఫుల్‌ 0, అథర్వ (బి) అవిషేక్‌ 3, రవి (రనౌట్‌) 2, సుశాంత్‌ (సి) షరీఫుల్‌ (బి) తన్జీమ్‌ 3, కార్తీక్‌ (సి) అక్బర్‌ (బి) అవిషేక్‌ 0, ఆకాశ్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 11, మొత్తం: 47.2 ఓవర్లలో 177 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-9, 2-103, 3-114, 4-156, 5-156, 6-168, 7-170, 8-170, 9-172, 10-177, బౌలింగ్‌: షరీఫుల్‌ 10-1-31-2, తన్జీమ్‌ 8.2-2-28-2, అవిషేక్‌ 9-0-40-3, షమీమ్‌ 6-0-36-0, రకీబుల్‌ 10-1-29-1, తౌహిద్‌ 4-0-12-0.

బంగ్లాదేశ్‌:పర్వేజ్‌ (సి) ఆకాశ్‌ (బి) యశస్వి 47, తన్జీద్‌ (సి) కార్తీక్‌ (బి) రవి 17, మహ్ముదుల్‌ (బి) రవి 8, తౌహిద్‌ (ఎల్బీ) రవి, షహాదత్‌ (స్టంప్డ్‌) ధృవ్‌ (బి) రవి 1, అక్బర్‌ (నాటౌట్‌) 43, షమీమ్‌ (సి) యశస్వి 7, అవిషేక్‌ (సి) కార్తీక్‌ (బి) సుశాంత్‌ 5, రకీబుల్‌ (నాటౌట్‌) 9, ఎక్స్‌ట్రాలు: 33, మొత్తం: 42.1 ఓవర్లలో 170/7. వికెట్ల పతనం: 1-50, 2-62, 3-62, 4-65, 5-85, 6-121, 7-143, బౌలింగ్‌: కార్తీక్‌ 10-2-33-0, సుశాంత్‌ 7-0-25-2, ఆకాశ్‌ 8-1-33-0, రవి 10-3-30-4, అథర్వ 4.1-0-22-0, యశస్వి 3-0-15-1.


logo