బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Oct 03, 2020 , 17:29:23

RCB vs RR: మహిపాల్‌ ఒక్కడే నిలిచాడు!

RCB vs RR: మహిపాల్‌ ఒక్కడే నిలిచాడు!

అబుదాబి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-13వ సీజన్‌లో భాగంగా  రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో   మ్యాచ్‌లో   రాజస్థాన్‌ రాయల్స్‌  సాధారణ స్కోరుకే పరిమితమైంది.   వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పేలవ బ్యాటింగ్‌తో చతికిలపడింది.  20ఏండ్ల మహిపాల్‌ లామ్రోర్‌(47: 39 బంతుల్లో 1ఫోర్‌, 3సిక్సర్లు)  ఒంటరి పోరాటం చేయడంతో రాజస్థాన్‌ 20 ఓవర్లలో   6 వికెట్లకు 154 పరుగులు చేసింది.   మహిపాల్‌ మినహా అందరూ దారుణంగా విఫలమయ్యారు.  బెంగళూరు బౌలర్ల ధాటికి బ్యాట్స్‌మెన్‌ వరుసగా  పెవిలియన్‌కు క్యూ కట్టారు.  ఆర్‌సీబీ బౌలర్లలో చాహల్‌(3/24) , ఇసురు ఉడానా(2/41)  ప్రత్యర్థిని బాగా ఇబ్బందిపెట్టారు. 

3 ఓవర్లలో 3 వికెట్లు

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ను పేలవంగా ఆరంభించింది.  ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి 31 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది.  ఇసురు ఉడానా వేసిన మూడో ఓవర్లో కెప్టెన్‌ స్మిత్(5)‌ బౌల్డయ్యాడు. నవదీప్‌ సైనీ వేసిన నాలుగో ఓవర్లో  దూకుడుగా ఆడుతున్న   ఓపెనర్‌ బట్లర్(22)‌..పడిక్కల్‌కు సునాయాస క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  స్పిన్నర్‌ చాహల్‌ వేసిన ఐదో ఓవర్లో హార్డ్‌హిట్టర్‌ సంజూ శాంసన్‌(4) రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.  పవర్‌ప్లేలో  ఆజట్టు ౩ వికెట్లకు 38 పరుగులు చేసింది. 

ఈ దశలో క్రీజులో ఉన్న రాబిన్‌ ఉతప్ప, మహిపాల్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఉతప్ప(17: 22 బంతుల్లో 1ఫోర్‌) పరుగులు సాధించేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. చాహల్‌ బౌలింగ్‌లో అతడు వెనుదిరిగాడు. మరోఎండ్‌లో సహకరించేవారు లేకున్నా మహిపాల్‌ మాత్రం బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వీలుచిక్కినప్పుడల్లా భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అర్ధశతకానికి చేరువగా వచ్చిన యువ బ్యాట్స్‌మన్‌ లామ్రోర్‌ చాహల్‌ వేసిన 17వ ఓవర్లో పడిక్కల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 

రాహుల్‌ తెవాటియా(24 నాటౌట్‌), జోఫ్రా ఆర్చర్‌(16 నాటౌట్‌) జోడీ ఏడో వికెట్‌కు 21 బంతుల్లో 40 పరుగులు రాబట్టి జట్టు స్కోరును 150 దాటించారు. ఆఖరి వరకు బెంగళూరు  పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేయడంతో రాజస్థాన్‌  సాధారణ స్కోరుకే పరిమితమైంది.