శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Sep 12, 2020 , 00:42:22

అయ్యో సెరెనా..!

అయ్యో సెరెనా..!

  • సెమీస్‌లో అజరెంకా చేతిలో ఓటమి
  • బ్రాడిని ఓడించి ఫైనల్‌ చేరిన ఒసాక
  • గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో అజరెంకా..ఫైనల్‌ చేరడం 2013 తర్వాత ఇదే తొలిసారి 

ఏడేండ్ల తర్వాత ఇలా ఆడటం సంతోషంగా ఉంది. ఇది నా అదృష్ట సంఖ్య. ఫైనల్లో అడుగుపెట్టడం గొప్పగా ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని టైటిల్‌ సాధిస్తా. 

- అజరెంకా

 న్యూయార్క్‌: అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన ప్లేయర్‌గా నిలువాలని కలలు కంటున్న అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌కు మరోసారి చుక్కెదురైంది. యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో సెరెనా పోరాటం ముగిసింది. గురువారం అర్ధరాత్రి జరిగిన సెమీఫైనల్లో సెరెనా 6-1, 3-6, 3-6తో విక్టోరియా అజరెంకా (బెలారస్‌) చేతిలో ఓటమి పాలైంది. తొలి సెట్‌లో అద్భుతంగా ఆడిన అమెరికా స్టార్‌.. మ్యాచ్‌ మధ్యలో గాయపడటం ఫలితంపై ప్రభావం చూపింది. ఎడమకాలి చిలమండకు గాయంకావడంతో.. చికిత్స తీసుకున్న అనంతరం కట్టుతో బరిలో దిగిన సెరెనా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రత్యర్థి నెమ్మదించడం గుర్తించిన అజరెంకా రెండో సెట్‌లో చెలరేగిపోయింది. గ్రాండ్‌స్లామ్‌ చరిత్రలో తొలిసారి ఇద్దరు ‘అమ్మ’లు తలపడ్డ ఈ పోరులో చివరకు బెలారస్‌ బ్యూటీదే పైచేయి అయింది. 2013 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ చేరడం అజరెంకాకు ఇదే తొలిసారి. గతంలో రెండుసార్లు తుదిమెట్టుపై బోల్తాకొట్టిన అజరెంకా యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌ చేరడం ఇది మూడోసారి.   ఆస్ట్రేలియా దిగ్గజ క్రీడాకారిణి మార్గరెట్‌ కోర్ట్‌ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ (24) టైటిల్స్‌ రికార్డును సమం చేయాలని ఉవ్విళ్లూరుతున్న సెరెనా తొలి సెట్‌లో విజృంభించింది. గత రెండు సీజన్‌లలోనూ ఫైనల్‌ చేరిన సెరెనా.. ఈ సారి కూడా సునాయాసంగా తుదిపోరుకు అర్హత సాధించేలా కనిపించింది. తొలి సెట్‌ను ఖాతాలో వేసుకున్న సెరెనా రెండో సెట్‌లో 3-0తో ముందంజలో ఉన్న సమయంలో అజరెంకా వరుసగా ఐదు గేమ్‌లు నెగ్గి పోటీలోకొచ్చింది. ఇప్పటి వరకు గ్రాండ్‌స్లామ్‌ వేదికగా వీరిద్దరూ 11 సార్లు తలపడగా.. సెరెనాపై అజరెంకాకు ఇదే తొలి విజయం కావడం విశేషం. 

ఒసాక సూపర్‌..

మరో సెమీఫైనల్లో నవోమి ఒసాక 7-6 (7/1), 3-6, 6-3 జెన్నిఫర్‌ బ్రాడి (అమెరికా)పై గెలుపొందింది. గంటకు 120 మైళ్ల వేగంతో సర్వీస్‌లతో రెచ్చిపోయిన ఒసాక 9 ఏస్‌లు సంధించి ఒక డబుల్‌ ఫాల్ట్‌ చేయగా.. బ్రాడి 10 ఏస్‌లు సంధించి 2 డబుల్‌ ఫాల్ట్స్‌ చేసింది. 70 విన్నర్లు కొట్టిన ఒసాక.. గంటా 45 నిమిషాల్లో ప్రత్యర్థి ఆటకట్టించింది.    


logo