బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Jan 21, 2020 , 01:52:31

స్టార్ల హవా

స్టార్ల  హవా
  • జొకోవిచ్‌, ఫెదరర్‌, సెరెనా ముందడుగు..
  • వీనస్‌కు షాకిచ్చిన 15 ఏండ్ల గాఫ్‌
  • భారీ వర్షంతో 32 మ్యాచ్‌లు వాయిదా.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

తొలి టోర్నీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు భారీ వర్షం స్వాగతం పలికింది. కార్చిచ్చు వల్ల ఏర్పడిన కాలుష్యానికి తోడు వాన సైతం దంచికొట్టడంతో తొలి రోజు జరగాల్సిన చాలా మ్యాచ్‌లు నేటికి వాయిదా పడగా.. జరిగిన కొన్ని పోటీల్లో స్టార్‌ ప్లేయర్ల హవా సాగింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ చెమటోడ్చి తొలి రౌండ్‌ దాటగా.. స్విస్‌ స్టార్‌ ఫెదరర్‌ అలవోక విజయంతో ముందడుగేశాడు. మహిళల సింగిల్స్‌లో వీనస్‌కు టీనేజర్‌ గాఫ్‌ చేతిలో పరాజయం ఎదురవగా..సెరెనా విలియమ్స్‌, ఒసాకా, బార్టీ విజయాలు సాధించారు.

సెరెనా అలవోకగా.. 

మార్గరెట్‌ కోర్ట్‌(24) అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల రికార్డును సమం చేయడమే లక్ష్యంగా ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్‌ పోరాటాన్ని అద్భుతంగా ఆరంభించింది. తొలి రౌండ్‌లో సెరెనా 6-0, 6-3తో అనస్టాసియా పొటపోవా(రష్యా)పై సునాయాసంగా విజయం సాధించింది. 58 నిమిషాల్లోనే ప్రత్యర్థిని మట్టికరిపించి ఏకపక్షంగా గెలిచింది. మొత్తం తొమ్మిది ఏస్‌లు, 24 విన్నర్లతో విరుచుకుపడిన విలియమ్స్‌.. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఐదుసార్లు సర్వీస్‌ను సైతం బ్రేక్‌ చేసింది. రెండో రౌండ్లో సెరెనా... జిడాన్‌సెక్‌(స్లోవేనియా)తో తలపడనుంది. తల్లి కాకముందు మూడేండ్ల క్రితం చివరిసారిగా గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించిన సెరెనా.. ఈ టోర్నీతో ఎప్పటి నుంచో ఊరిస్తున్న మార్గరెట్‌ కోర్ట్‌ రికార్డును అందుకోవాలని పట్టుదలగా ఉన్నది.

మెల్‌బోర్న్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌, స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ముందడుగేశారు. మహిళల సింగిల్స్‌లో సెరెనా విలియమ్స్‌, నవోమీ ఒసాకా తొలి రౌండ్లో సునాయాస విజయాలు సాధించగా.. ఏడు గ్రాండ్‌స్లామ్‌ల విజేత వీనస్‌కు 15ఏండ్ల కోరి గాఫ్‌ షాకిచ్చింది. సోమవారం ఇక్కడ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో రెండో సీడ్‌, సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ 7-6(7/5), 6-2, 2-6, 6-1తేడాతో జె.స్టఫ్‌(జర్మనీ)పై చెమటోడ్చి గెలిచాడు. మొత్తం 2గంటల 16 నిమిషాల పాటు మ్యాచ్‌ సాగగా...తొలి సెట్‌ను టైబ్రేకర్‌లో కైవసం చేసుకున్న జొకో.. రెండో సెట్లో పూర్తి ఆధిపత్యం చూపాడు. ఆ తర్వాత అన్‌సీడెడ్‌ స్టఫ్‌ రెచ్చిపోయి జొకోకు చెమటలు పట్టించాడు. 

సునాయాసంగా మూడో సెట్‌ కైవసం చేసుకొని ఉత్కంఠ రేపాడు. దీంతో ఒక్కసారిగా తేరుకున్న నొవాక్‌ తనదైన శైలిలో రెచ్చిపోయి తదుపరి సెట్‌లో ఏ మాత్రం తప్పిదాలకు చోటివ్వకుండా పూర్తి పైచేయి సాధించాడు.  జొకోవిచ్‌ 14ఏస్‌లు సంధించగా.. స్టఫ్‌ 13సాధించడంతో పాటు నాలుగుసార్లు సర్వీస్‌ను బ్రేక్‌ చేశాడు. 2006 తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్‌ తొలి రౌండ్‌లో ఓ సెట్‌ కోల్పోవడం జొకోవిచ్‌కు ఇదే తొలిసారి కాగా, కెరీర్‌లో అతడికి ఇది 900వ విజయం కావడం విశేషం. మరో మ్యాచ్‌లో మూడో సీడ్‌ రోజర్‌ ఫెదరర్‌ 6-3, 6-2, 6-2 తేడాతో జాన్సన్‌(అమెరికా)పై అలవోకగా గెలిచాడు. 11ఏస్‌లు బాదిన ఫెడ్‌.. ఐదుసార్లు జాన్సన్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేశాడు. 34విన్నర్లతో స్విస్‌ దిగ్గజం ముందడుగేస్తే.. ప్రత్యర్థి 16కే పరిమితమయ్యాడు. ఆరో సీడ్‌ సిట్సిపాస్‌(గ్రీస్‌) 6-0, 6-2, 6-3తో కరూసో(ఇటలీ)పై గెలిచాడు. 

గాఫ్‌ చేతిలో వీనస్‌ ఓటమి

ఏడు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత వీనస్‌ విలియమ్స్‌(అమెరికా)కు 15ఏండ్ల కోరీ గాఫ్‌ మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో షాకిచ్చింది. అమెరికాకే చెందిన యువ సంచలనం గాఫ్‌ 7-6(7/5), 6-3తేడాతో వరుస సెట్లలో వీనస్‌ను ఓడించింది. టెన్నిస్‌లో గ్రేటెస్ట్‌ కావడమే తన లక్ష్యమని మ్యాచ్‌ అనంతరం గాఫ్‌ చెప్పింది. కాగా, డిఫెండింగ్‌ చాంపియన్‌ నవోమీ ఒసాకా(జపాన్‌) 6-2, 6-4తేడాతో మరే బౌజ్‌కోవాపై గెలిచింది. టాప్‌ సీడ్‌ ఆష్లే బార్టీ(ఆస్ట్రేలియా) 5-7, 6-1, 6-1తేడాతో సురెంకో(ఉక్రెయిన్‌)పై గెలిచింది. 


కాలుష్యం.. భారీ వర్షం

కార్చిచ్చు వల్ల నెలకొన్న కాలుష్యానికి తోడు భారీ వర్షం ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తొలి రోజు పోటీలకు తీవ్ర ఆటంకం కలిగించింది. రూఫ్‌లను మూసి కొన్ని మ్యాచ్‌లను నిర్వహించారు. వాన కారణంగా చాలా మ్యాచ్‌లు అర్ధాంతరంగా నిలిచిపోగా.. మరిన్ని మ్యాచ్‌లు మంగళవారానికి వాయిదా పడ్డాయి. 


నేడు బరిలోకి గుణేశ్వరన్‌

భారత అగ్రశ్రేణి టెన్నిస్‌ ఆటగాడు ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ సోమవారం జరగాల్సి ఉన్నా.. వర్షం కారణంగా వాయిదా పడింది. టాసుమా ఇట్లో(జపాన్‌)తో ప్రజ్నేశ్‌  మంగళవారం తలపడనున్నాడు. ఈ మ్యాచ్‌ లో అతడు గెలిస్తే.. తదుపరి రౌండ్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌తో తలపడాల్సి ఉంటుంది. గ్రాండ్‌స్లామ్‌ ఈవెంట్‌లో ప్రజ్నేశ్‌కు ఇది ఐదో మెయిన్‌ డ్రా మ్యాచ్‌. టాప్‌ సీడ్‌ రఫెల్‌ నాదల్‌, మద్వెదెవ్‌ కూడా టైటిల్‌ వేటను మంగళవారం ప్రారంభించనున్నారు. 


ఆరోగ్య సమస్యలొస్తాయేమో : సెరెనా 

కార్చిచ్చు కారణంగా నెలకొన్న వాయు కాలుష్యం వల్ల తనకు ఊపిరితిత్తులకు సంబంధిత సమస్య మళ్లీ వస్తుందేమోనని అమెరికా స్టార్‌ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ ఆందోళన వ్యక్తం చేసింది. 2017లో  బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడంతో  ఆమె తీవ్రంగా ఇబ్బందులు పడింది. ఇప్పడు పొగ వల్ల సమస్య మళ్లీ  తలెత్తుతుందేమోనని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ‘పొగ చాలా ఆందోళన కలిగిస్తున్నది. నాకే కాదు చాలా మందికి ఇలాగే ఉంది’ అని తొలి రౌండ్‌ గెలిచాక సెరెనా చెప్పింది. 


logo
>>>>>>