మంగళవారం 02 మార్చి 2021
Sports - Jan 20, 2021 , 11:26:47

ఆకాశానికెత్తిన‌ ఆస్ట్రేలియన్ మీడియా

ఆకాశానికెత్తిన‌ ఆస్ట్రేలియన్ మీడియా

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియా సంగ‌తి తెలుసు క‌దా. అక్క‌డి క్రికెట్ ప్లేయ‌ర్స్ అయినా.. ప్రేక్ష‌కులైనా.. మీడియా అయినా.. అంద‌రూ ప్ర‌త్య‌ర్థి టీమ్‌ను మాట‌ల‌తో వేధించే టైపే. కానీ తొలిసారి అక్క‌డి మీడియా కూడా ఇండియ‌న్ టీమ్ సాధించిన చారిత్ర‌క విజ‌యంపై ప్ర‌శంస‌లు కురిపించ‌కుండా ఉండ‌లేక‌పోయింది. అదే స‌మ‌యంలో త‌మ టీమ్ ఘోర ప‌రాభ‌వాన్నీ ఏకి పారేసింది. 1988 నుంచి ఆస్ట్రేలియ‌న్ టీమ్‌కు పెట్ట‌ని కోట‌లా ఉన్న గ‌బ్బానే టీమిండియా జ‌యించ‌డం మొత్తం ఆస్ట్రేలియా స‌మాజాన్నే షాక్‌కు గురి చేసింది. అందులోనూ పూర్తి స్థాయి జ‌ట్టుతో బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియాను.. దాదాపు ఓ ఎ టీమ్‌గా బ‌రిలోకి దిగిన టీమిండియా చిత‌క్కొట్ట‌డాన్ని అక్క‌డి అభిమానులు, మీడియా జీర్ణించుకోలేక‌పోతున్నారు. అయితే ఇండియ‌న్ టీమ్ సాధించిన ఈ చారిత్ర‌క విజ‌యానికి ఇండియ‌న్ మీడియాలో ఎంత ప్రాధాన్య‌త ద‌క్కిందో.. ఆస్ట్రేలియ‌న్ మీడియా కూడా అదే స్థాయిలో ప్రాధాన్య‌మిచ్చింది. 

ఓ అద్భుతం: ది ఆస్ట్రేలియ‌న్‌

ఆస్ట్రేలియా టీమ్ పెట్ట‌ని కోట గ‌బ్బాలో టీమిండియా సాధించిన విజ‌యం ఓ అద్భుత‌మ‌ని ది ఆస్ట్రేలియ‌న్ ప‌త్రిక ప్ర‌శంసించింది. ఓ గాయ‌ప‌డిన‌, క‌ష్టాల్లో కూరుకుపోయిన టీమ్ పూర్తి స్థాయిలో ఉన్న ఆస్ట్రేలియా టీమ్‌కు ఘోర అవ‌మానం మిగిల్చింది అని ఆ ప‌త్రిక రాసింది. 

గ్రేటెస్ట్ విక్ట‌రీ ఆఫ్ ఆల్‌టైమ్‌: ఫాక్స్ స్పోర్ట్స్‌

అక్క‌డి మ‌రో ప్ర‌ముఖ మీడియా సంస్థ ఫాక్స్ స్పోర్ట్స్ అయితే టీమిండియా సాధించిన ఈ విజ‌యాన్ని భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో అత్యున్న‌త విజయంగా అభివ‌ర్ణించింది. ఒక‌వేళ మీరు షాక్‌లో ఉంటే ఏమీ బాధ‌ప‌డ‌కండి. మీరొక్క‌రే కాదు.. అంద‌రూ అదే షాక్‌లో ఉన్నారు. ఇండియా అత్యున్న‌త టెస్ట్ విజ‌యంతో బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీని గెలుచుకుంది అని ఫాక్స్ స్పోర్ట్స్‌.కామ్‌.ఏయూలో రాసిన ఓ ఆర్టిక‌ల్‌లో అభిప్రాయ‌ప‌డింది. త‌మ టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ల్ప స్కోరు సాధించిన నెల రోజుల్లోనే సాధించిన ఈ అత్యున్న‌త విజ‌యాన్ని వాళ్లు ఎప్ప‌టికీ సెల‌బ్రేట్ చేసుకుంటూనే ఉంటారు అని స్ప‌ష్టం చేసింది. 

ఇండియ‌న్ స‌మ్మ‌ర్‌: క‌్రికెట్ ఆస్ట్రేలియా

క్రికెట్ ఆస్ట్రేలియాకు చెందిన వెబ్‌సైట్ అయితే దీనిని ఓ ఇండియ‌న్ స‌మ్మ‌ర్‌గా అభివ‌ర్ణించింది. ఇన్నాళ్లూ తిరుగులేద‌నుకున్న బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాకు గ‌ర్వ‌భంగ‌మైంద‌ని ఆ వెబ్‌సైట్ అభిప్రాయ‌ప‌డింది. ఇండియా సాధించిన అత్యున్న‌త విజ‌యం ఇదే కావ‌చ్చ‌నీ అందులో రాసింది. 

మ‌న స్టార్ల‌కు ప‌రాభ‌వం: ద డైలీ టెలిగ్రాఫ్‌

ఇండియా సాధించిన ఈ విజ‌యం మ‌న క్రికెట్ స్టార్స్‌కు ఘోర ప‌రాభ‌వ‌మ‌ని, ఆస్ట్రేలియ‌న్ క్రికెట్ చ‌రిత్ర‌లో ఇది అత్యంత చెత్త ఓట‌మ‌ని ద డైలీ టెలిగ్రాఫ్ అభిప్రాయ‌ప‌డింది. 

అశ్విన్‌ను కెలికి పేన్ త‌ప్పు చేశాడు: ఎస్ఎంహెచ్‌

సిడ్నీ టెస్ట్‌లో టీమిండియా స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్‌ను ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పేన్ కెలికి చాలా త‌ప్పు చేశాడ‌ని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ప‌త్రిక రాసింది. 33 ఏళ్లుగా ఆస్ట్రేలియ‌న్ టీమ్‌ ఓట‌మెర‌గ‌ని గ‌బ్బాలో టీమిండియా ఈ అద్భుత విజయం సాధించ‌డానికి ఆ ఘ‌ట‌న ప్ర‌ధాన కార‌ణ‌మైంద‌ని ఆ ప‌త్రిక అభిప్రాయ‌ప‌డింది. 

సాకులు, సంజాయిషీలు లేవు:  డైలీ టెలిగ్రాఫ్‌

మ‌రోవైపు డైలీ టెలిగ్రాఫ్ మాత్రం ఆస్ట్రేలియ‌న్ టీమ్‌ను చీల్చి చెండాడింది. సాకులు, సంజాయిషీలు ఏమీ లేవు.. ఆస్ట్రేలియాకు ఇది నాకౌట్ పంచ్ అని ఆ ప‌త్రిక అభిప్రాయ‌ప‌డింది. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో నెట్ బౌల‌ర్స్‌ను తుది జ‌ట్టులో ఆడించిన టీమిండియా చేతిలో పూర్తి స్థాయి ఆస్ట్రేలియా టీమ్ నాకౌట్ అయింద‌ని డైలీ టెలిగ్రాఫ్ త‌న ఆర్టిక‌ల్‌లో రాసింది. 


ఇవి కూడా చ‌ద‌వండి

డ్రెస్సింగ్ రూమ్‌లో ర‌విశాస్త్రి స్పీచ్ చూశారా.. వీడియో

హిందూ మ‌తాన్ని కించ ప‌రిచారు.. శిక్ష త‌ప్ప‌దు!

బిలియ‌నీర్ జాక్‌మా క‌నిపించారు..


VIDEOS

logo