సోమవారం 25 మే 2020
Sports - May 23, 2020 , 19:54:31

రాత్రికి రాత్రే మారదు: బ్రెట్‌లీ

రాత్రికి రాత్రే మారదు: బ్రెట్‌లీ


ముంబై: ఎన్నో ఏండ్లుగా బంతిపై మెరుపు కోసం ఉమ్మి (సలైవా)ను వాడిన బౌలర్లు.. ఒక్కసారిగా అలవాటు మార్చుకోవడం కష్టమే అని ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ బ్రెట్‌లీ అభిప్రాయపడ్డాడు. భారత స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే నేతృత్వంలోని క్రికెట్‌ కమిటీ.. బంతిపై ఉమ్మి రాయడాన్ని నిషేధించాలని సూచించడంతో ఐసీసీ  మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘చిన్నతనం నుంచే బంతిపై ఉమ్మి రాయడం అలవాటైన బౌలర్లు రాత్రికి రాత్రే మారడం చాలా కష్టం. చెప్పడానికి సులువుగా ఉన్నా.. ఇది అమలు చేయడం కష్టం. బౌలర్లు అలవాటులో పొరపాటుగా ఉమ్మి వాడొచ్చు. ఒకటి రెండు సార్లు వారిని హెచ్చరించాల్సిన అవసరం ఉంటుంది’అని బ్రెట్‌లీ పేర్కొన్నాడు.


ఆసీస్‌ పేసర్‌ మాటలతో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ ఏకీభవించాడు. బౌలర్ల విషయంలోనే కాదు ఫీల్డర్లకు కూడా ఇది కొత్త తలనొప్పి తీసుకురానుందని వ్యాఖ్యానించాడు. ‘సాధారణంగా నేను స్లిప్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్నప్పుడు తరచుగా బంతికి ఉమ్మి రాసి రుద్దుతూ ఉంటాను. ఏండ్లుగా అది అలవాటైపోయింది. నేనొక్కడినే కాదు ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ కూడా తరచూ ఇలాగే చేసేవాడు’అని డుప్లెసిస్‌ చెప్పుకొచ్చాడు.  


logo