గురువారం 21 జనవరి 2021
Sports - Dec 08, 2020 , 17:25:17

పోరాడి ఓడిన భారత్‌

పోరాడి ఓడిన భారత్‌

సిడ్నీ: ఆస్ట్రేలియా‌తో జరిగిన మూడో  టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్‌ జట్టు పోరాడి ఓడింది.  ఆస్ట్రేలియా నిర్దేశించిన  187 పరుగుల పరుగుల భారీ లక్ష్యాన్ని టీమ్‌ఇండియా  ఛేదించలేకపోయింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(85: 61 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు) ఒంటరి పోరాటం చేసినా ఓటమి తప్పలేదు. ఆరంభంలో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(28: 21 బంతుల్లో 3ఫోర్లు), చివర్లో హార్దిక్‌ పాండ్య(20: 13 బంతుల్లో 1ఫోర్‌, 2సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. ఇతర బ్యాట్స్‌మన్‌ సహకారం అందించకపోవడంతో భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 174 పరుగులకు పరిమితమైంది. దీంతో ఆసీస్‌ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.  మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 2-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 

ఓపెనర్‌ రాహుల్‌ ఔటవడంతో  తొలి ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన కోహ్లీ ఇన్నింగ్స్‌ ఆద్యంతం చక్కటి షాట్లతో అలరించాడు.  ఆఖర్లో కట్టుదిట్టంగా బంతులేసిన ఆసీస్‌ బౌలర్లు ఫామ్‌లో ఉన్న పాండ్య, కోహ్లీ వికెట్లను కీలక సమయంలో పడగొట్టింది. గత మ్యాచ్‌ తరహాలో మ్యాచ్‌ విన్నింగ్‌ ప్రదర్శన చేయాలని భావించిన పాండ్య స్పిన్నర్‌ జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌ చేరగా.. ఆండ్రూ టై వేసిన తర్వాతి ఓవర్‌లో విరాట్‌ కూడా వెనుదిరగడంతో టీమ్‌ఇండియా ఓటమి ఖాయమైంది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్(0)‌, సంజూ శాంసన్‌(10) మరోసారి నిరాశపరిచారు. తొలి ఓవర్‌లోనే కేఎల్‌ రాహుల్‌ డకౌటయ్యాడు. ఆసీస్‌ బౌలర్లలో మిచెల్‌ స్వెప్సన్‌ మూడు వికెట్లు తీయగా.. మాక్స్‌వెల్‌, సీన్‌ అబాట్‌, జంపా, టై తలో వికెట్‌ పడగొట్టారు.    

అంతకుముందు మొదట బ్యాటింగ్‌ చేసిన  ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5  వికెట్లకు 186 పరుగులు చేసింది.  ఓపెనర్‌ మాథ్యూ వేడ్‌(80: 53 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు), స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌(54: 36 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు)  మెరుపు అర్ధసెంచరీలతో విజృంభించారు. వేడ్‌, మాక్సీ   53 బంతుల్లో 90 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వాషింగ్టన్‌ సుందర్‌(2/34) మినహా ఇతర బౌలర్లు ఆతిథ్య జట్టును కట్టడి చేయలేకపోయారు. కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌(0)ను  రెండో ఓవర్‌లోనే పెవిలియన్‌ పంపిన సుందర్‌ ..స్టీవ్‌ స్మిత్‌(24: 23 బంతుల్లో 1ఫోర్‌)ను కూడా  పెవిలియన్‌ పంపాడు.


logo