ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Sports - Jan 16, 2021 , 02:07:25

తొలిరోజు చెరి సగం

తొలిరోజు చెరి సగం

  • ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌ 274/5
  • లబుషేన్‌ సెంచరీ
  • నటరాజన్‌కు రెండు వికెట్లు

59 శతకాల అనుభవం ఉన్న బ్యాటింగ్‌ లైనప్‌ ఒకవైపు.. 3 టెస్టుల 10 బంతుల అనుభవం గల బౌలింగ్‌ మరోవైపు.. సొంతగడ్డ సానుకూలత  ఓ వైపు.. పరిమిత వనరుల ప్రతిబంధకం మరోవైపు.. బలం, బలగంతో జంబో జట్టుగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీమ్‌ఇండియా చివరి మ్యాచ్‌కు వచ్చేసరికి తుదిజట్టులో ఆడేందుకు పదకొండు మంది ప్లేయర్లు లేని పరిస్థితికి చేరింది. గాయాలతో సతమతమవుతూనే గబ్బా బరిలోకి దిగిన భారత జట్టు తొలి రోజు ఫర్వాలేదనిపించింది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఆస్ట్రేలియాను మరింత భారీ స్కోరు చేయకుండా అడ్డుకోగలిగింది. ఇక శనివారం ప్రత్యర్థిని ఎన్ని పరుగులకు కట్టడి చేస్తుందో చూడాలి!

బ్రిస్బేన్‌: హోరాహోరీగా సాగుతున్న బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌ చివరి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇరుజట్లు సమంగా నిలిచాయి. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఆస్ట్రేలియా భారీ స్కోరుకు బాటలు వేసుకుంటే.. బౌలింగ్‌లో అనుభవలేమితో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా ఐదు వికెట్లు పడగొట్టింది. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ మార్నస్‌ లబుషేన్‌ (108; 9 ఫోర్లు) సెంచరీకి.. మాథ్యూ వేడ్‌ (45), స్టీవ్‌ స్మిత్‌ (36) సహకారం తోడవడంతో శుక్రవారం ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. అరంగేట్ర పేసర్‌ తంగరసు నటరాజన్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌, శార్దుల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్‌ సుందర్‌కు తలా ఒక వికెట్‌ దక్కింది. గాయాల కారణంగా బుమ్రా, అశ్విన్‌, జడేజా, హనుమ విహారి జట్టుకు దూరం కావడంతో వారి స్థానాల్లో నటరాజన్‌, సుందర్‌, శార్దుల్‌ ఠాకూర్‌, మయాంక్‌ అగర్వాల్‌ బరిలో దిగారు. వీరిలో నటరాజన్‌, సుందర్‌కు ఇదే తొలి టెస్టు కాగా.. శార్దుల్‌కు రెండోది. తొలి రెండు టెస్టుల్లో ఓపెనర్‌గా ఆకట్టుకోలేకపోయిన మయాంక్‌ను మిడిలార్డర్‌లో హనుమ విహారి స్థానంలో ఎంపిక చేయడం గమనార్హం. ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ విల్‌ పకోస్కీ గాయపడటంతో అతడి స్థానంలో మార్కస్‌ హరీస్‌కు ఆసీస్‌ జట్టులో చోటు దక్కింది. 

ఆరంభం మనదే..

సీనియర్లు అందుబాటులో లేకున్నా.. టీమ్‌ఇండియా బౌలర్లు ఆరంభం నుంచి ఆసీస్‌ను కట్టిపడేశారు. కెరీర్‌లో మూడో టెస్టు ఆడుతున్న సిరాజ్‌ తొలి ఓవర్‌ చివరి బంతికే డేవిడ్‌ వార్నర్‌ (1) వికెట్‌ పడగొట్టి భారత శిబిరంలో ఆనందం నింపాడు. సిరాజ్‌ వేసిన గుడ్‌లెంగ్త్‌ బంతికి వార్నర్‌ స్లిప్‌లో రోహిత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కాసేపటికే మరో ఓపెనర్‌ హరీస్‌ (5) అతడిని అనుసరించాడు. శార్దుల్‌ ఠాకూర్‌ వేసిన తొలి బంతికే సుందర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాటపట్టాడు. ఫలితంగా 17/2తో కష్టాల్లో పడ్డట్లు కనిపించిన ఆసీస్‌ను.. స్మిత్‌తో కలిసి లబుషేన్‌ ఆదుకున్నాడు. ఆరంభంలో క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యతనిచ్చిన ఈ జోడీ.. కుదురుకున్నాక ధాటిగా ఆడింది. మూడో వికెట్‌కు 70 పరుగులు జోడించాక స్మిత్‌ ఔటయ్యాడు. 

భారీ భాగస్వామ్యం

భారత కెప్టెన్‌ రహానే క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన లబుషేన్‌ చూస్తుండగానే సెంచరీకి సమీపించగా.. వేడ్‌ అతడికి చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరు భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ముఖ్యంగా శార్దుల్‌ ఠాకూర్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ జోడీ బౌండ్రీల వర్షం కురిపించింది. ఈ క్రమంలో లబుషేన్‌ టెస్టుల్లో ఐదో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి 82 బంతుల్లో 19 పరుగులు చేసిన లబుషేన్‌.. ఆ తర్వాత 113 బంతుల్లో 82 పరుగులు రాబట్టి శతకం నమోదు చేయడం విశేషం. మూడో సెషన్‌లో నటరాజన్‌ వరుస ఓవర్లలో వీరిద్దరినీ ఔట్‌ చేసి భారత జట్టును తిరిగి పోటీలోకి తెచ్చాడు. నాలుగో వికెట్‌కు 113 పరుగులు జోడించాక వేడ్‌ ఔట్‌ కాగా.. లబుషేన్‌ కీపర్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఈ దశలో భారత బౌలర్లు ఒత్తిడి పెంచినా.. కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ (38 బ్యాటింగ్‌), కామెరూన్‌ గ్రీన్‌ (28 బ్యాటింగ్‌) మరో వికెట్‌ పడకుండా తొలిరోజును ముగించారు.

సైనీకి గాయం

టీమ్‌ఇండియాను గాయాలు వీడేలా లేవు. ఇప్పటికే ప్రధాన ఆటగాళ్లంతా గాయాల బారినపడి సిరీస్‌కు దూరంకాగా.. తాజా మ్యాచ్‌లో 36వ ఓవర్‌ వేస్తూ నవ్‌దీప్‌ సైనీ గాయపడ్డాడు. గజ్జల్లో నొప్పి అధికమవడంతో అతడు ఓవర్‌ పూర్తి చేయకుండానే పెవిలియన్‌ చేరాడు. సైనీ ఆరోగ్య పరిస్థితిపై ‘స్కానింగ్‌ తర్వాతే స్పష్టత వస్తుంది’అని బీసీసీఐ ట్వీట్‌ చేయడంతో మిగిలిన నాలుగు రోజుల ఆటకు అతడు అందుబాటులో ఉంటాడా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. 

అరంగేట్ర ఆటగాళ్లు ఐదుగురు

ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియా తరఫున ఐదుగురు ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. మెల్‌బోర్న్‌లో మహమ్మద్‌ సిరాజ్‌, శుభ్‌మన్‌ గిల్‌ తొలి టెస్టు ఆడగా.. సిడ్నీలో నవ్‌దీప్‌ సైనీ అరంగేట్రం చేశాడు. ఇక నాలుగో టెస్టులో నటరాజన్‌, వాషింగ్టన్‌ సుందర్‌ సుదీర్ఘ ఫార్మాట్‌లో తొలిసారి బరిలో దిగారు. 1996 ఇంగ్లండ్‌ పర్యటనలో భారత్‌ తరఫున ఆరుగురు అరంగేట్రం చేశారు. సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌, విక్రమ్‌ రాథోడ్‌, పారస్‌ మాంబ్రే, సునీల్‌ జోషి  ఆ పర్యటనలో తొలి మ్యాచ్‌లు ఆడారు.

నటరాజన్‌@ 300

సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత జట్టు తరఫున బరిలో దిగిన 300వ ఆటగాడిగా నటరాజన్‌ నిలిచాడు. భారత బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ అతడికి టెస్టు క్యాప్‌ ఇచ్చి జట్టులోకి స్వాగతం పలికాడు. 

సుందర్‌ నాలుగేండ్ల తర్వాత

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నాలుగేండ్ల క్రితమే టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేసిన ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ భారత జట్టు తరఫున టెస్టు ఆడిన 301వ ఆటగాడిగా నిలిచాడు. మ్యాచ్‌ ఆరంభానికి ముందు అశ్విన్‌ అతడికి టెస్టు క్యాప్‌ అందించాడు. 

సిరాజ్‌పై మళ్లీ  జాత్యహంకార వ్యాఖ్యలు

సిడ్నీ టెస్టులో భారత ఆటగాళ్లపై జరిగిన జాత్యహంకార వ్యాఖ్యల దుమారం చల్లారకముందే.. బ్రిస్బేన్‌లోనూ అలాంటి సంఘటనలే వెలుగులోకి వచ్చా యి. నాలుగో టెస్టులో సిరాజ్‌, సుందర్‌లపై కొందరు ఆసీస్‌ అభిమానులు నోరు పారేసుకున్నారు. ఈ విషయాన్ని సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌ పత్రిక వెల్లడించడం     కొసమెరుపు. 

సెంచరీ చేసినా బాధగా ఉంది..

శతకం సాధించినా.. జట్టుకు భారీ స్కోరు అందించలేకపోయినందుకు బాధగా ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే మెరుగైన స్థితిలో ఉన్నామనుకుంటున్నా. గ్రీన్‌, పైన్‌ ఇన్నింగ్స్‌ను నడిపించిన తీరు బాగుంది. ఈ రోజు వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తాం.

- లబుషేన్‌ 

 ఎన్ని ఓవైర్లెనా వేస్తా..

ఎర్ర బంతితో బౌలింగ్‌ చేసేందుకు నేనెప్పుడూ సిద్ధంగా ఉంటా. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో చాలా మ్యాచ్‌లు ఆడా. సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. 40-50 ఓవర్లు వేసేందుకు కూడా నేను రెడీ. టెస్టుల్లో తొలి వికెట్‌ ఇచ్చే కిక్‌ వేరు.

- వాషింగ్టన్‌ సుందర్‌

20 మంది ఆటగాళ్లతో..

ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియా 20 మంది ఆటగాళ్లను బరిలో దించింది. 1961-62 సీజన్‌ తర్వాత భారత జట్టు ఇంతమందితో ఒక సిరీస్‌ ఆడటం ఇదే ప్రథమం. 

స్కోరు బోర్డు

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) రోహిత్‌ (బి) సిరాజ్‌ 1, హరీస్‌ (సి) సుందర్‌ (బి) శార్దుల్‌ 5, లబుషేన్‌ (సి) పంత్‌ (బి) నటరాజన్‌ 108, స్మిత్‌ (సి) రోహిత్‌ (బి) సుందర్‌ 36, వేడ్‌ (సి) శార్దుల్‌ (బి) నటరాజన్‌ 45, గ్రీన్‌ (నాటౌట్‌) 28, పైన్‌ (నాటౌట్‌) 38, ఎక్స్‌ట్రాలు: 13, మొత్తం: 274/5. వికెట్ల పతనం: 1-4, 2-17, 3-87, 4-200, 5-213,

బౌలింగ్‌: సిరాజ్‌ 19-8-51-1, నటరాజన్‌ 20-2-63-2, శార్దుల్‌ 18-5-67-1, సైనీ 7.5-2-21-0, సుందర్‌ 22-4-63-1, రోహిత్‌ 0.1-0-1-0.

VIDEOS

logo