ఆదివారం 24 జనవరి 2021
Sports - Jan 07, 2021 , 00:26:02

సిడ్నీలో సై

సిడ్నీలో సై

  • ఆధిక్యంపై ఇరు జట్ల గురి 
  • రోహిత్‌ రీఎంట్రీ, సైనీ అరంగేట్రం .. నేటి నుంచి భారత్‌, ఆస్ట్రేలియా మూడో టెస్టు 
  • ఉదయం 5 గంటల నుంచి సోనీ నెట్‌వర్క్‌లో..

బాక్సింగ్‌ డే టెస్టులో ఆస్ట్రేలియాను చిత్తుచేసిన భారత్‌.. సిరీస్‌ ఆధిక్యంపై కన్నేసింది. అడిలైడ్‌ ఓటమి తర్వాత చరిత్రలో నిలిచి పోయేలా అనూహ్యంగా పుంజుకున్న రహానే సేన.. సిడ్నీలో నేటి నుంచి జరిగే మూడో టెస్టులో సంచలనం సృష్టించాలని సమాయత్తమైంది. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని నిలబెట్టుకొని కంగారూల ఆధిపత్యానికి కళ్లెం వేయాలని తహతహలాడుతున్నది. రోహిత్‌ శర్మ జట్టులోకి రావడంతో భారత్‌ మరింత బలోపేతం కాగా.. సైనీ అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. ఫిట్‌నెస్‌ లేని వార్నర్‌ రాకతో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చేసిన ఆస్ట్రేలియా మెరుగైన ప్రదర్శన కోసం వేచిచూస్తున్నది.  

సిడ్నీ: ఆతిథ్య ఆస్ట్రేలియాపై ఆధిక్యం సాధించడమే లక్ష్యంగా సిడ్నీ షోకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. గురువారం నుంచి ఇక్కడ జరిగే మూడో టెస్టులో సత్తాచాటి 2-1తో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ముందంజ వేయాలని పట్టుదలగా ఉంది. ప్రతిష్టాత్మక ఈ బోర్డర్‌ - గవాస్కర్‌ ట్రోఫీలో తొలి మ్యాచ్‌ ఓడినా.. మెల్‌బోర్న్‌లో ఆసీస్‌ను చిత్తుచేసి కొండంత ఆత్మవిశ్వాసంతో టీమ్‌ఇండియా ఉంది. గాయాలతో సతమతమవుతున్న భారత జట్టులోకి స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ రావడం పెద్ద ఊరట కలిగించగా.. ఈ మ్యాచ్‌తో ఎక్స్‌ప్రెస్‌ పేసర్‌ నవ్‌దీప్‌ సైనీ సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగేట్రం చేయనున్నాడు. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌పై వేటు పడగా.. గాయంతో పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ సిరీస్‌కు దూరమయ్యాడు. మరోవైపు గత్యంతరం లేని పరిస్థితుల్లో 70 శాతం మాత్రమే ఫిట్‌గా ఉన్నా.. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ను ఆస్ట్రేలియా తీసుకుంది. అలాగే బ్యాట్స్‌మన్‌ పకోస్కి అరంగేట్రం చేయనున్నాడు.

వరుసగా విఫలమవుతున్న సీనియర్‌  బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌  స్మిత్‌ గాడిలో పడతాడని ఆస్ట్రేలియా ఆశిస్తున్నది. కమిన్స్‌,  హజిల్‌వుడ్‌, స్టార్క్‌, లియాన్‌తో బౌలింగ్‌లో ఆసీస్‌  బలంగానే ఉన్నా బ్యాటింగ్‌లో రాణించలేకపోతున్నది. కాగా ఈ మ్యాచ్‌ గెలిచి బోర్డర్‌ - గవాస్కర్‌ ట్రోఫీని రహానేసేన నిలబెట్టుకుంటే భారత క్రికెట్‌ చరిత్రలో ఇదో సువర్ణాధ్యాయంగా మిగిలిపోతుంది. గత పర్యటనలో సత్తాచాటి తొలిసారి ఆసీస్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ దక్కించుకున్న భారత్‌..  అదే మ్యాజిక్‌ రిపీట్‌ చేస్తే కంగారూల ఆధిపత్యం అటకెక్కినట్టే అవుతుంది. అలాగే సరిగ్గా 12 ఏండ్ల క్రితం మంకీగేట్‌తో రచ్చరేపిన ఆస్ట్రేలియాకు అదే సిడ్నీలో బుద్ధి చెప్పినట్టు ఉంటుంది. 

రోహిత్‌ రాకతో.. 

స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ దాదాపు ఏడాది తర్వాత టీమ్‌ఇండియా తరఫున బరిలోకి దిగనున్నాడు. దీంతో అతడిపైనే అందరి దృష్టి ఉంది. యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌తో ఓపెనింగ్‌ చేయనున్న హిట్‌మ్యాన్‌ ఆసీస్‌ పేస్‌ త్రయం కమిన్స్‌, హజిల్‌వుడ్‌, స్టార్క్‌ను కుమ్మేస్తే భారత్‌కు తిరుగే ఉండదు.  స్థాయికి తగ్గట్టు ఆకట్టుకోలేకపోతున్న పుజార గాడిలో పడాలి.  మెల్‌బోర్న్‌ టెస్టులో సెంచరీతో జట్టును గెలిపించిన కెప్టెన్‌ రహానే అదే ఊపును కొనసాగించాలని భారత్‌ కోరుకుంటున్నది. గత పర్యటనలో సిడ్నీలో శతకం చేసిన పంత్‌ రాణిస్తే భారీ స్కోరు ఖాయం. జడేజా సైతం  మంచి ఊపుమీద ఉన్నాడు. బౌలింగ్‌ లో సీనియర్‌  స్పిన్నర్‌ అశ్విన్‌   ఫామ్‌లో ఉం డగా.. పేసర్లు బుమ్రా, సిరాజ్‌, సైనీ  రాణిస్తే ఒత్తిడిలో ఉన్న ఆసీస్‌ను కూల్చడం పెద్ద సమస్యేం కాదు. 

  • 42 సిడ్నీ మైదానంలో టీమ్‌ఇండియా టెస్టు గెలిచి 42 ఏండ్లు అయింది.  అయితే 1986, 1992, 2004, 2019ల్లో విజయానికి దగ్గరైనా డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అందులో కొన్ని మ్యాచ్‌లకు వర్షం అడ్డుతగిలింది. 
  • 97టెస్టుల్లో 6వేల పరుగుల మార్క్‌కు పుజార 97 రన్స్‌ దూరంలో ఉన్నాడు. 

వాతావరణం

సిడ్నీ టెస్టుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. పిచ్‌పై  పచ్చిక ఉండనుంది. సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలించే సిడ్నీ పిచ్‌పై ఈసారి పచ్చిక కూడా ఎక్కువే ఉండనుంది. స్పిన్‌కు ఈ మైదానం సహకరించనుంది. 

జట్లు

భారత్‌: రోహిత్‌, గిల్‌, పుజార, రహానే (కెప్టెన్‌), విహారి, రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), జడేజా, అశ్విన్‌, సిరాజ్‌, బుమ్రా, సైనీ 

ఆస్ట్రేలియా (అంచనా): డేవిడ్‌ వార్నర్‌,  పకోస్కి, లబుషేన్‌, స్మిత్‌, వేడ్‌ (వికెట్‌ కీపర్‌), గ్రీన్‌, పైన్‌ (కెప్టెన్‌), కమిన్స్‌, స్టార్క్‌, లియాన్‌, హజిల్‌వుడ్‌logo