ఆదివారం 24 జనవరి 2021
Sports - Dec 04, 2020 , 16:35:20

మ్యాచ్ రిఫరీపై ఆస్ట్రేలియా కోచ్ సీరియ‌స్‌

మ్యాచ్ రిఫరీపై ఆస్ట్రేలియా కోచ్ సీరియ‌స్‌

క్యాన్‌బెరా: ఇండియా, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌లో ఓ వివాదం త‌లెత్తింది. జ‌డేజా స్థానంలో కాంక‌ష‌న్ స‌బ్‌స్టిట్యూట్‌గా య‌జువేంద్ర చాహ‌ల్‌ను టీమిండియా తీసుకోవ‌డం వివాదానికి కార‌ణ‌మైంది. దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసినా ఆస్ట్రేలియా కోచ్ జ‌స్టిన్ లాంగ‌ర్‌.. ఆసీస్ ఇన్నింగ్స్ ప్రారంభ‌మ‌య్యే ముందు రిఫ‌రీ డేవిడ్ బూన్‌తో గొడ‌వ‌కు దిగాడు. జ‌డేజాకు కాంక‌ష‌న్ స‌బ్‌స్టిట్యూట్ ఎలా ఇస్తారంటూ అత‌డు చాలా ఆగ్ర‌హంగా అడుగుతుండ‌టం వీడియోలో క‌నిపించింది. టీమిండియా ఇన్నింగ్స్ చివ‌రి ఓవ‌ర్‌లో బ్యాటింగ్ చేస్తూ ర‌వీంద్ర జ‌డేజా గాయ‌ప‌డ్డాడు. బంతి అత‌ని హెల్మెట్‌కు బ‌లంగా త‌గిలింది. త‌ల‌కు బంతి త‌గిలిన స‌మ‌యంలో స‌ద‌రు బ్యాట్స్‌మ‌న్‌కు కాంక‌ష‌న్ టెస్ట్ నిర్వ‌హించి.. అతనికి స‌బ్‌స్టిట్యూట్‌ను తీసుకునే అవ‌కాశం ఉంటుంది. అయితే జ‌డేజాకు మాత్రం గాయ‌మైన స‌మ‌యంలో కాంక‌ష‌న్ టెస్ట్ నిర్వ‌హించ‌లేదు. ఆ త‌ర్వాత కూడా అత‌ను బ్యాటింగ్ కొన‌సాగించి 3 బంతుల్లో 9 ప‌రుగులు చేశాడు.

కానీ టీమిండియా మాత్రం అత‌ని స్థానంలో కాంక‌ష‌న్ స‌బ్‌స్టిట్యూట్‌గా చాహ‌ల్‌ను టీమ్‌లోకి తీసుకుంది. కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం కాంక‌ష‌న్ స‌బ్‌స్టిట్యూట్‌కు బ్యాటింగ్‌, బౌలింగ్ చేసే అవ‌కాశం ఉంటుంద‌న్న విష‌యం తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా కోచ్ లాంగ‌ర్ దీనికి అభ్యంత‌రం వ్య‌క్తం చేశాడు. అయితే జ‌డేజాను త‌మ మెడిక‌ల్ టీమ్ ప‌ర్య‌వేక్షిస్తోంద‌ని, అత‌ని స్థానంలో చాహ‌ల్ ఆడ‌తాడ‌ని బీసీసీఐ చెప్పింది. ఓ ప్లేయ‌ర్‌కు కాంక‌ష‌న్ స‌బ్‌స్టిట్యూట్‌ను ఇవ్వాలంటే అత‌నికి వెంట‌నే టెస్ట్ నిర్వ‌హించాలి. ఆ త‌ర్వాత అత‌డు ఆడకూడ‌దు. ఇవే అంశాల‌ను ఆసీస్ మాజీ ప్లేయ‌ర్స్ మార్క్ వా, గిల్‌క్రిస్ట్ లేవ‌నెత్తారు. ఆ త‌ర్వాత కాంక‌ష‌న్ స‌బ్‌స్టిట్యూట్‌గా వ‌చ్చిన చాహ‌ల్ బౌలింగ్ చేయ‌డ‌మే కాదు.. త‌న తొలి రెండు ఓవ‌ర్ల‌లోనే ఫించ్‌, స్మిత్ వికెట్లు తీసుకోవ‌డం విశేషం.


logo