సోమవారం 25 జనవరి 2021
Sports - Jan 13, 2021 , 11:12:51

బ్రిస్బేన్‌లో తిరుగులేని ఆస్ట్రేలియా.. గ‌బ్బా కోట బ‌ద్ధ‌ల‌య్యేనా?

బ్రిస్బేన్‌లో తిరుగులేని ఆస్ట్రేలియా.. గ‌బ్బా కోట బ‌ద్ధ‌ల‌య్యేనా?

బ్రిస్బేన్‌: గాయ‌ప‌డిన సైన్యంతో అభేద్య‌మైన కోట‌ను బ‌ద్ధ‌లు కొట్ట‌డానికి వెళ్తోంది టీమిండియా. ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న నాలుగో టెస్ట్ బ్రిస్బేన్‌లోని గ‌బ్బా స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. ఈ స్టేడియం పేరు వింటేనే ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో రైళ్లు ప‌రుగెడ‌తాయి. ఆస్ట్రేలియా టీమ్‌కు పెట్ట‌ని కోట ఈ గ‌బ్బా స్టేడియం. గ‌త 32 ఏళ్ల‌లో ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు హోమ్ టీమ్‌. ఇలాంటి స్టేడియంలో క‌నీసం ఆడ‌టానికి పూర్తి 11 మంది ఫిట్‌గా ఉన్న ప్లేయ‌ర్స్ దొరుకుతారా లేదా అన్న సందిగ్ధంలో ర‌హానే సేన వెళ్తోంది. ఏమాత్రం అంచ‌నాలు లేని స్థితి నుంచి అసాధార‌ణ పోరాటంతో సిడ్నీ టెస్ట్‌ను డ్రాగా ముగించిన ఆత్మ‌విశ్వాసం త‌ప్ప‌.. బ్రిస్బేన్ టెస్ట్‌కు వెళ్లే ముందు టీమిండియా ద‌గ్గ‌ర ఎలాంటి సానుకూలాంశాలు లేవు. 

ఒక్కో టీమ్‌కు ఒక్కో స్టేడియం

సొంత‌గ‌డ్డ‌పై ఎలాంటి టీమ్ అయినా పులే. అందులోనూ ఒక్కో టీమ్‌కు ఒక్కో స్టేడియం పెట్ట‌ని కోట‌లా ఉంటుంది. ఇండియా విష‌యానికి వ‌స్తే మొహాలీ స్టేడియం అలాంటిదే. ఇక సౌతాఫ్రికాకు సెంచూరియ‌న్‌లోని సూప‌ర్‌స్పోర్ట్ పార్క్‌, పాకిస్థాన్‌కు కరాచీలోని నేష‌న‌ల్ స్టేడియం, ఇంగ్లండ్‌కు ఎడ్‌బాస్ట‌న్‌, శ్రీలంక‌కు గాలె స్టేడియం బాగా క‌లిసొస్తాయి. ఈ స్టేడియాల్లో ఆయా టీమ్స్‌ను ఓడించ‌డం ప్ర‌త్య‌ర్థుల‌కు ఓ క‌ల‌గానే మిగిలిపోతుంది. ఆస్ట్రేలియాలో గ‌బ్బా స్టేడియం కూడా అలాంటిదే. ఇక్క‌డ ఆ టీమ్ రికార్డు చూసే ప్ర‌త్య‌ర్థి టీమ్స్ బిక్క‌చ‌చ్చిపోతాయి. 

32 ఏళ్లుగా ఓట‌మెరుగ‌ని రికార్డు

ఈ గ‌బ్బా స్టేడియంలో చివ‌రిసారి ఆస్ట్రేలియా ఓడిపోయింది 1988, న‌వంబ‌ర్‌లో. స‌ర్ వివ్ రిచ‌ర్డ్స్ కెప్టెన్సీలోని వెస్టిండీస్ టీమ్ ఆస్ట్రేలియాను మ‌ట్టి క‌రిపించింది. ఇక అప్ప‌టి నుంచీ మ‌రే టీమ్ ఆ ప‌ని చేయ‌లేక‌పోయింది. ఈ 32 ఏళ్ల‌లో గ‌బ్బాలో 30 టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా 24 మ్యాచుల్లో గెల‌వ‌గా.. 6 డ్రాగా ముగిశాయి. ఇక ఓవ‌రాల్‌గా ఇక్క‌డ 62 మ్యాచ్‌లు ఆడిన ఆసీస్‌.. 40 గెలిచి కేవ‌లం 8 మ్యాచ్‌ల‌లో మాత్ర‌మే ఓడింది. 13 మ్యాచ్‌లు డ్రా కాగా.. 1960లో ఒక మ్యాచ్ టై అయింది. 

అన్నీ రికార్డు స్థాయి విజ‌యాలే

ఓట‌మెరుగ‌ని రికార్డే ఓ ఎత్త‌యితే.. ఆ విజ‌యాల‌న్నీ భారీవే కావ‌డం మ‌రో విశేషం. ఇక్క‌డ గెలిచిన 24 మ్యాచ్‌ల‌లో 8 ఇన్నింగ్స్ విజ‌యాలు కాగా 3 మ్యాచ్‌లలో 300 ప‌రుగుల‌కుపైగా తేడాతో, 2 మ్యాచుల్లో 200 నుంచి 300 ప‌రుగుల మ‌ధ్య‌, 4 మ్యాచ్‌ల‌లో 100 నుంచి 200 ప‌రుగుల తేడాతో ఆస్ట్రేలియా గెలిచింది. ఇక 4 మ్యాచ్‌లలో ప‌ది వికెట్ల తేడాతో, ఒక మ్యాచ్‌లో 9 వికెట్ల‌తో విజ‌యం సాధించ‌డం విశేషం. రెండు మ్యాచ్‌లు మాత్ర‌మే క‌ష్ట‌మ్మీద గెలిచింది. అందులో ఒక‌టి 2014లో ఇండియాపై కాగా.. మ‌రొక‌టి 2016లో పాకిస్థాన్‌పై. ఇండియాపై 128 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి కిందామీదా ప‌డి గెలిచింది. ఇక 2016లో అయితే పాక్ బ్యాట్స్‌మ‌న్ అస‌ద్ ష‌ఫిక్ కంగారూల‌ను తెగ కంగారుపెట్టాడు. 490 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పాక్‌.. ష‌ఫిక్ (137) సెంచ‌రీతో 450 ప‌రుగులు చేసింది. 

ఇండియాకు చెత్త రికార్డు

ఆస్ట్రేలియాకు అదిరిపోయే రికార్డు ఉన్న ఇదే స్టేడియంలో ఇండియాకు మాత్రం చెత్త రికార్డు ఉంది. ఆస్ట్రేలియాలో టీమిండియా ఒక్క టెస్ట్ కూడా గెల‌వ‌ని స్టేడియం బ్రిస్బేన్ మాత్ర‌మే. ఇక్క‌డ ఆరు మ్యాచ్‌లు ఆడ‌గా.. ఐదింట్లో ఓడింది. ఒక‌టి డ్రాగా ముగిసింది. ఆ డ్రాగా ముగిసిన మ్యాచ్‌లో గంగూలీ సెంచ‌రీ చేయ‌డం విశేషం. 2003 టూర్‌లో కెప్టెన్‌గా ఉన్న దాదా.. తొలి ఇన్నింగ్స్‌లో 144 ప‌రుగుల‌తో చెల‌రేగాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా చేసిన 323 ప‌రుగుల‌ను టీమిండియా అధిగ‌మించింది. చివ‌ర్లో 16 ఓవ‌ర్ల‌లో 199 ప‌రుగు ల‌క్ష్యం ఉండ‌గా.. మ్యాచ్‌ను డ్రా చేసుకుంది టీమిండియా. 

కోట బ‌ద్ధ‌లు కొట్ట‌డం అసాధ్యమేనా?

ఈసారి టీమిండియా ప‌రిస్థితి మ‌రీ దారుణంగా ఉంది. స్టార్ ప్లేయ‌ర్స్ గాయాల‌తో దూర‌మ‌య్యారు. ఇప్ప‌టికే కెప్టెన్ కోహ్లి పితృత్వ సెల‌వుపై వెళ్ల‌గా.. ష‌మి, ఉమేష్‌, బుమ్రా, జ‌డేజా, విహారి, రాహుల్ గాయాల పాల‌య్యారు. అశ్విన్‌, పంత్ కూడా గాయాల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో క‌నీసం 11 మందైనా అందుబాటులో ఉంటారా లేదా అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ‌బ్బా కోట‌ను బ‌ద్ధ‌లు కొట్ట‌డం టీమిండియాకు దాదాపు అసాధ్య‌మ‌నే విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. 2018-19 బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీని గెలిచిన టీమిండియా.. దానిని నిలుపుకోవాలంటే చివ‌రి టెస్ట్‌ను కనీసం డ్రాగా అయినా ముగించాల్సి ఉంటుంది. 


logo