శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Feb 12, 2020 , 13:37:02

పోరాడి ఓడిన అమ్మాయిలు

పోరాడి ఓడిన అమ్మాయిలు

కీలక సమయంలో మంధాన వికెట్‌ కోల్పోవడంతో పర్యాటక జట్టుకు పరాజయం తప్పలేదు.

మెల్‌బోర్న్‌:  ఇంగ్లాండ్‌, భారత్‌తో  జరిగిన మహిళల ముక్కోణపు టీ20  సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు  విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో భారత్‌పై 11 పరుగుల తేడాతో ఆతిథ్య ఆస్ట్రేలియా అమ్మాయిల జట్టు ఘన విజయం సాధించి  టైటిల్‌ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 156 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ 20 ఓవర్లలో 144 పరుగులు చేసి ఆలౌటైంది. అర్ధశతకంతో మెరిసిన మంధాన (66: 37 బంతుల్లో 12 ఫోర్లు) పోరాటం వృథా అయింది. కీలక సమయంలో మంధాన వికెట్‌ కోల్పోవడంతో పర్యాటక జట్టుకు పరాజయం తప్పలేదు. 

ఆఖర్లో ఆసీస్‌ బౌలర్లు ధాటిగా బంతులేయడంతో భారత్‌ బ్యాట్స్‌వుమెన్‌ వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. ఒకానొక దశలో  115/4తో పటిష్ఠంగా ఉన్న భారత్‌..అనూహ్యంగా తడబడటంతో 144 పరుగులకే కుప్పకూలింది.   ఆసీస్‌ బౌలర్లలో జెస్‌ జొనాసేన్‌ ఐదు వికెట్లు పడగొట్టి కంగారూల విజయంలో కీలక పాత్ర పోషించింది.  మొదట బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. బెత్‌ మూనీ(71 నాటౌట్‌) అర్ధశతకంతో రాణించింది. మెగ్‌లానింగ్‌(26), ఆష్లే గార్డ్‌నర్‌(26) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ, రాజేశ్వరీ గైక్వాడ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టి కంగారూలను కట్టడి చేశారు. మహిళల టీ20 వరల్డ్‌కప్‌ ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8వరకు జరగనుంది. 


logo