సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Feb 24, 2020 , 00:30:55

జితేందర్‌కు రజతం

జితేందర్‌కు రజతం
  • ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌
  • ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌కు అర్హత
  • సుశీల్‌ కుమార్‌ టోక్యో ఆశలపై నీళ్లు!

న్యూఢిల్లీ: ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించడం ద్వారా భారత రెజ్లర్‌ జితేందర్‌ కుమార్‌ (74 కేజీలు) టోక్యో ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించాడు.  దీంతో గాయం కారణంగా టోర్నీకి దూరమైన అదే విభాగానికి చెందిన స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌కు టోక్యో తలుపులు దాదాపుగా మూసుకుపోయినట్టే. ఆదివారం ఇక్కడ జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌ పురుషుల ఫ్రీస్టయిల్‌ రెండో రోజు పోటీల్లో జితేందర్‌ కుమార్‌ రజతం సాధించగా.. దీపక్‌ పునియా (86 కేజీలు), రాహుల్‌ అవారే (61 కేజీలు) కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. ఆది నుంచి అదరగొట్టి ఫైనల్‌ వరకు దూసుకెళ్లిన జితేందర్‌ తుదిపోరులో తడబడ్డాడు.


 ప్రత్యర్థి దానియార్‌ కైసనోవ్‌ (కజకిస్థాన్‌)పై మంచి డిఫెన్స్‌ కనబరిచినా దూకుడుగా పట్టుపట్టడంలో విఫలమయ్యాడు. దీంతో 1-3తో ఓటమి చెందాడు. ఈ రజతంతో మళ్లీ ట్రయల్స్‌ లేకుండానే బిష్కేక్‌లో జరిగే ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌కు భారత్‌ తరఫున అర్హత సాధించాడు. అయితే ప్రపంచ చాంపియన్‌షిప్‌ రజత పతక విజేత దీపక్‌ పునియా సెమీస్‌లో సుతారో యమద (జపాన్‌)చేతిలో ఓడి నిరాశపరిచాడు. అయితే కాంస్య పోరులో ఇసా అబ్దుల్‌ సలామ్‌ (ఇరాక్‌)పై 10-0తో సునాయాసంగా గెలిచాడు. సెమీస్‌లో ఓడిన మరో భారత రెజ్లర్‌ అవారే.. కాంస్య బౌట్‌లో మజీద్‌ అల్మాస్‌ (ఇరాన్‌)పై 5-2తో విజయం సాధించాడు.logo