బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Feb 18, 2020 , 00:31:25

‘పట్టు’ పడతారా

‘పట్టు’ పడతారా
  • నేటి నుంచి ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌..
  • బజరంగ్‌, వినేశ్‌, దీపక్‌పైనే అందరి దృష్టి

 న్యూఢిల్లీ: భారత స్టార్‌ రెజ్లర్లు బజరంగ్‌ పునియా, వినేశ్‌ ఫోగట్‌ ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటేందుకు రెడీ అవుతున్నారు. దేశ రాజధానిలో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ ఆరు రోజుల పాటు సాగనుంది. రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన నలుగురు రెజ్లర్లు, ఇద్దరు అధికారులు టోర్నీలో పాల్గొనడంపై మొదట్లో కాస్త అనిశ్చితి నెలకొన్నా.. ప్రభుత్వ అనుమతి లభించడంతో వారికి మార్గం సుగమమైంది. ప్రధాన పోటీదారు అయిన చైనా ‘కరోనా’ కారణంగా చాంపియన్‌షిప్‌కు దూరంగా ఉండిపోయింది. చైనీయులకు వీసాలు ఇచ్చేందుకు భారత్‌ అంగీకరించకపోవడంతో ఆ దేశానికి చెందిన 40 మంది రెజ్లర్లు టోర్నీకి దూరమయ్యారు. కేడీ జాధవ్‌ రెజ్లింగ్‌ స్టేడియంలో తొలి రెండు రోజులు పురుషుల గ్రీకో రోమన్‌ పోటీలు, ఆ తర్వాత రెండు రోజులు మహిళల పోటీలు.. చివరి రెండు రోజులు పురుషుల ఫ్రీ స్టయిల్‌ పోటీలు నిర్వహించనున్నారు.


మనవాళ్లు 30 మంది

2017లో ఈ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన భారత్‌.. 2019లో చైనా వేదికగా జరిగిన చాంపియన్‌షిప్‌లో 16 పతకాలు సాధించింది. ప్రపంచ రెండో ర్యాంకర్‌ బజరంగ్‌ (65 కేజీలు) క్రితంసారి స్వర్ణం సాధించగా.. వినేశ్‌ (56 కేజీలు) రజతంతో సరిపెట్టుకుంది. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్న వీరిద్దరూ విశ్వ క్రీడలకు ముందు తమ దూకుడు కొనసాగించాలని భావిస్తున్నారు. ఇటీవల ఇటలీలో జరిగిన ర్యాంకింగ్‌ సిరీస్‌లో స్వర్ణం నెగ్గిన వినేశ్‌ ఈ పోటీల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. వీరితో పాటు ఇప్పటికే టోక్యో టికెట్లు దక్కించుకున్న దీపక్‌ పునియా (86 కేజీలు), రవి కుమార్‌ దహియా (57 కేజీలు) సహా మనదేశానికి చెందిన 30 మంది రెజ్లర్లు పోటీలో ఉన్నారు. ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌కు ముందు తిరిగి టచ్‌లోకి వచ్చేందుకు ఒలింపిక్‌ పతక విజేత సాక్షి మాలిక్‌ (65 కేజీలు)కు ఇది చక్కటి అవకాశం కాగా.. అన్షు మాలిక్‌ (57 కేజీలు), అశు  (60 కేజీలు), సోనమ్‌ మాలిక్‌ (65 కేజీలు) వంటి యువ రెజ్లర్లు తమ సత్తాచాటేందుకు ఇదే సరైన వేదిక. ఏడాది కాలంగా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న సాక్షి ఈ టోర్నీలోనైనా విజృంభిస్తుందా చూడాలి. గత టోర్నీలో 62 కేజీల విభాగంలో బరిలోదిగి కాంస్యం నెగ్గిన సాక్షి.. ఈ సారి 65 కిలోల కేటగిరీలో పోటీ పడనుంది.


స్టార్లకు కొదవలేదు

చైనా రెజ్లర్లు చాంపియన్‌షిప్‌కు దూరమైనా.. టోర్నీలో అంతర్జాతీయ స్టార్లకు కొదవేలేదు. జపాన్‌కు చెందిన స్టార్‌ రెజ్లర్‌, ప్రపంచ చాంపియన్‌ కెనిచిరో పుమిటా, కజకిస్థాన్‌ స్టార్‌ నూర్‌ ఇస్లామ్‌ సనాయేవ్‌ పోటీలో ఉన్నారు. వీరితో పాటు పురుషుల విభాగంలో రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌ రై హన్‌ సూ (దక్షిణ కొరియా), ఐదుసార్లు ఆసియా చాంపియన్‌ ఎల్‌మురాత్‌ తస్మురాదోవ్‌ (ఉజ్బెకిస్థాన్‌).. మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్‌ టినీబెకావో (కిర్గిస్థాన్‌) బరిలో ఉన్నారు.

పురుషుల, మహిళల విభాగాల్లో భారత బృందం బలంగా ఉంది. ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌ జరుగునున్న ఏడాది కావడంతో ప్రతి టోర్నీ ముఖ్యమే. విశ్వక్రీడలకు ముందు వీలైనన్ని ఎక్కువ విజయాలు సాధించాలనుకుంటున్నా.

- వినేశ్‌ ఫోగట్‌


మన రెజ్లర్లకు ఇది చక్కటి అవకాశం. సొంత అభిమానుల మధ్య బరిలో దిగడం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. కాస్త ఒత్తిడి ఉన్న మాట వాస్తవమే. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి మాకు ప్రోత్సాహాన్నందిస్తారని ఆశిస్తున్నా.  

- బజరంగ్‌ పునియా


logo
>>>>>>