హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆసియా హ్యాండ్‌బాల్ పురుషుల క్లబ్ లీగ్ చాంపియన్‌షిప్ ఐదో రోజు పోటీలు ఆద్యంతం ఉత్సాహంగా సాగాయి. గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం జరిగిన పోటీల్లో అల్ ఖద్సియా (కువైట్) 24-16తో అల్ అరబీ (ఖతార్)పై విజయం సాధించింది. ఖద్సియా తరఫున ఒసామా ఆరు గోల్స్‌తో చెలరేగాడు. హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో టీ స్పోర్ట్స్ (భారత్) 33-40తో అల్ నూర్ (సౌదీ అరేబియా) చేతిలో ఓటమి పాలైంది. సౌదీ క్లబ్ తరఫున మహమ్మద్ అజీజ్ 11 గోల్స్‌తో చెలరేగాడు. అంతకుముందు జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు, అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం ఉఫాధ్యక్షుడు బదర్ అలీ తియాబ్ పోటీలను ప్రారంభించారు.