ఆదివారం 07 మార్చి 2021
Sports - Jan 22, 2021 , 10:15:57

అర్ధ‌రాత్రి కోహ్లి మీటింగ్‌.. మెల్‌బోర్న్ టెస్ట్‌కు ముందు ఏం జ‌రిగింది?

అర్ధ‌రాత్రి కోహ్లి మీటింగ్‌.. మెల్‌బోర్న్ టెస్ట్‌కు ముందు ఏం జ‌రిగింది?

ముంబై: ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా దారుణంగా ఓడిన సంగ‌తి తెలుసు క‌దా. అడిలైడ్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 36 ప‌రుగుల‌కే ఆలౌటై ప‌రువు తీసుకుంది. ఆ వెంట‌నే కెప్టెన్ కోహ్లి టీమిండియాకు తిరిగొచ్చేశాడు. ఎలా చూసినా.. అది టీమిండియాకు ఏం చేయాలో అర్థం కాని ప‌రిస్థితే. కానీ ఆ త‌ర్వాత జ‌రిగిన మెల్‌బోర్న్ టెస్ట్‌లో టీమ్ అనూహ్య విజ‌యం సాధించింది. కెప్టెన్ ర‌హానే సెంచ‌రీతో ముందుండి న‌డిపించాడు. అయితే ఈ విజ‌యం గాలివాటంగా వ‌చ్చింది కాదు. అడిలైడ్ టెస్ట్‌, మెల్‌బోర్న్ టెస్ట్‌కు మ‌ధ్య చాలా పెద్ద  మేధోమ‌థ‌న‌మే న‌డిచింది. ఈ విష‌యాన్ని స్పిన్న‌ర్ అశ్విన్‌, ఫీల్డింగ్ కోచ్ శ్రీధ‌ర్ తాజాగా వెల్ల‌డించారు. 

కోహ్లి.. ప్లీజ్ వెళ్లొద్దు

అడిలైడ్ టెస్ట్ ఓడిపోయిన త‌ర్వాత ఏం జ‌రిగిందో అశ్విన్ త‌న యూట్యూబ్ చానెల్‌లో చెప్పాడు. ఇదే షోలో శ్రీధ‌ర్ కూడా ఉన్నాడు.  అడిలైడ్ టెస్ట్ త‌ర్వాత కోహ్లి టీమ్ ద‌గ్గ‌రికి వ‌చ్చాడు. బాయ్స్‌, నేను ఇంటికి వెళ్లిపోతున్నాను అని చెప్పాడు. అదొక కాలేజ్ ఫేర్‌వెల్‌లాగా అనిపించింది. ఆ స‌మ‌యంలో బ్రో, వెళ్లొద్దు. మ‌నం కొద్దిసేప‌టి కింద‌టే 36 ప‌రుగుల‌కే ఆలౌట‌య్యాం అని నా మ‌న‌సులో అనుకున్నాన‌ని అశ్విన్ చెప్పాడు. 

అర్ధ‌రాత్రి మీటింగ్‌

ఆ వెంట‌నే ఆ రోజు అర్ధ‌రాత్రి జ‌రిగిన ఘ‌ట‌న గురించి శ్రీధ‌ర్ వెల్ల‌డించాడు. అడిలైడ్ టెస్ట్ ఓడిపోయిన రోజు అర్ధ‌రాత్రి 12.30 గంట‌లు అయింది. ఏం చేస్తున్నావ్ అంటూ విరాట్ నాకు మెసేజ్ చేశాడు. ఈ స‌మ‌యంలో ఎందుకు మెసేజ్ చేశాడో అని నేను అనుకున్నాను. హెడ్ కోచ్‌, నేను, భ‌ర‌త్ అరుణ్‌, విక్ర‌మ్ రాథోడ్ క‌లిసి ఉన్నామ‌ని చెప్పాను. నేను కూడా వ‌స్తాన‌ని అత‌న‌న్నాడు. ఆ వెంట‌నే కోహ్లి కూడా వ‌చ్చాడు. అంద‌రం క‌లిసి మాట్లాడుకున్నాం. అప్పుడే మిష‌న్ మెల్‌బోర్న్ మొద‌లైంది అని శ్రీధర్ వెల్ల‌డించాడు. 

36 ఆలౌట్‌.. ఓ బ్యాడ్జ్‌లా పెట్టుకోండి

ఆ స‌మ‌యంలో ఈ 36ను ఓ బ్యాడ్జ్‌లా పెట్టుకోండి.. ఈ 36 టీమ్‌ను మ‌ళ్లీ గొప్ప‌గా చేస్తుంది అని ర‌విశాస్త్రి అన్నాడ‌ని శ్రీధ‌ర్ చెప్పాడు. ఆ త‌ర్వాత మెల్‌బోర్న్ టెస్ట్‌లో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై మాట్లాడుకున్నాం. సాధార‌ణంగా ఆ స‌మ‌యంలో ఎవ‌రైనా బ్యాటింగ్ బ‌లాన్ని పెంచాల‌ని అనుకుంటారు. కానీ కోహ్లి, ర‌విశాస్త్రి, ర‌హానే మాత్రం బౌలింగ్ విభాగాన్ని బ‌లోపేతం చేయాల‌ని నిర్ణ‌యించారు. అందుకే కోహ్లి స్థానంలో జ‌డేజాను తీసుకున్నాం. ఆ ప్లాన్ వ‌ర్క‌వుటైంది అని శ్రీధ‌ర్ చెప్పాడు. టీమ్‌లో టెఫ్ట్ హ్యాండ‌ర్స్ ఎక్కువ‌గా ఉండాల‌ని ర‌విశాస్త్రి సూచించాడు. దీనివ‌ల్ల ఆస్ట్రేలియా బౌల‌ర్లు త‌మ లైన్ అండ్ లెంత్ త‌ప్పే అవ‌కాశం ఉంటుంద‌న్న‌ది అత‌ని ఆలోచ‌న‌. అప్పుడే టీమ్‌లోని ఐదుగురు బెస్ట్ బౌల‌ర్ల‌తో మెల్‌బోర్న్ ఆడాల‌ని నిర్ణ‌యించాం అని శ్రీధ‌ర్ వెల్ల‌డించాడు. ప్లేయ‌ర్స్‌ను నెగ‌టివ్ ఆలోచ‌న‌ల నుంచి దూరం చేయ‌డానికి ఓ రోజు ప్రాక్టీస్‌కు సెల‌వ‌చ్చి.. ఆట‌పాట‌ల‌తో వాళ్లు గ‌డిపేలా చేశామ‌ని కూడా చెప్పాడు. మొత్తంగా ఈ వ్యూహాల‌న్నీ ఫ‌లించి.. మెల్‌బోర్న్‌తోపాటు ఆ త‌ర్వాత సిడ్నీ, బ్రిస్బేన్‌ల‌లోనూ టీమిండియా సంచ‌ల‌న ఆట‌తీరుతో సిరీస్‌నే ఎగ‌రేసుకుపోయింది. 

VIDEOS

logo