ఆస్ర్టేలియన్ ఓపెన్‌లో స్టార్ల హవా

- ఆస్ట్రేలియన్ ఓపెన్
- బార్టీ, స్వితోలినా, గాఫ్ ముందడుగు
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సమరంలో టాప్-10 ప్లేయర్ల జోరు కొనసాగింది. తొలి రౌండ్లో అలవోక విజయాలతో స్టార్లు ముందడుగు వేశారు. ఏడాది తర్వాత మేజర్ టోర్నీ బరిలోకి దిగిన ఆస్ట్రేలియా అమ్మాయి బార్టీ ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా సత్తాచాటితే.. అమెరికా టీనేజీ సంచలనం కోకో గాఫ్ వరుస సెట్లలో గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో నాదల్, మెద్వెదెవ్ప్రత్యర్థులను చిత్తుచేయగా.. భారత ఆటగాడు నాగల్‌కు నిరాశే ఎదురైంది.
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రోజు కూడా స్టార్ ప్లేయర్ల హవా సాగింది. మంగళవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 20 గ్రాండ్‌స్లామ్‌ల వీరుడు రఫేల్ నాదల్ 6-3, 6-4, 6-1తో లాసో జెరే (సెర్బియా)పై వరుస సెట్లలో అలవోకగా గెలిచాడు. వెన్నునొప్పి ఇంకా పూర్తిగా నయం కాలేదని చెప్పిన రెండో సీడ్ రఫా మ్యాచ్‌లో ఏ మాత్రం తడబడకుండా విజయం సాధించాడు. రెండో రౌండ్లో అమెరికా క్వాలిఫయర్ మైకేల్ మోతో నాదల్ తలపడనున్నాడు. నాలుగో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6-2, 6-2, 6-4తో వాసెక్ పోస్పిసిల్ (కెనడా)పై వరుస సెట్లలో గెలిచాడు. మెద్వెదెవ్కు ఇది వరుసగా 15వ మ్యాచ్ విజయం కావడం విశేషం. ఇక ఏడో సీడ్ ఆండీ రుబ్లేవ్ 6-3, 6-3, 6-4తో యానిక్ హన్ఫ్మన్పై సునాయాసంగా గెలువగా.. ఐదో సీడ్ స్టెఫనోస్ సిట్సిపాస్ (గ్రీస్) 6-1, 6-2, 6-1 తేడాతో గ్రిల్స్ సిమన్స్ (ఫ్రాన్స్)ను గంటా 32 నిమిషాల్లో చిత్తుచేశాడు. కాగా 12, 13 సీడ్ ప్లేయర్లు బటిస్టా అగట్, డేవిడ్ గాఫిన్‌కు షాక్ ఎదురైంది. 85వ ర్యాంకర్ రాడు అల్బోట్ (మాల్దోవా) 6-7 (7/1), 6-0, 6-4, 7-6 (7/5) అగట్పై గెలిచాడు. ఐదు సెట్ల పాటు పోరాడిన గాఫిన్ 6-3, 4-6, 7-6 (7/4), 6-7 (6/8), 3-6 తేడాతో వైల్డ్‌కార్డ్ ప్లేయర్ అలెక్సె పొపిరిన్ చేతిలో ఓడాడు. మెట్టో బ్రెటిని, కాస్పెర్ రూడ్, ఫ్యాబినో ఫాగిని రెండో రౌండ్ చేరారు.
బార్టీ ఏకపక్షంగా..
మహిళల సింగిల్స్ టాప్ ర్యాంకర్ ఆష్లే బార్టీ ఆరంభమే అదరగొట్టింది. ఏడాది తర్వాత గ్రాండ్‌స్లామ్‌లో తలపడుతున్న లోకల్ ప్లేయర్ ఆష్లే తొలి రౌండ్లో 6-0, 6-0తో డంకా కొవిక్పై కేవలం 44 నిమిషాల్లోనే గెలుపొందింది. మ్యాచ్ మొత్తం బార్టీ కేవలం 10 పాయింట్లనే ప్రత్యర్థికి ఇవ్వడం విశేషం. మరో మ్యాచ్‌లో 16 ఏండ్ల అమెరికా సంచలనం కోకో గాఫ్ 6-3, 6-2తో జిల్ టెచ్మాన్ ( స్విట్జర్లాండ్)పై వరుస సెట్లలో సత్తాచాటింది. రెండో రౌండ్లో ఐదో సీడ్ ఎలినా స్వితోలినాతో గాఫ్ తలపడనుంది. డిఫెండింగ్ చాంపియన్, నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) 7-5, 6-4తో 133వ ర్యాంకర్ మాడిసన్ ఇంగ్లిస్ (ఆస్ట్రేలియా)పై గెలిచింది. తొలిసెట్లో ఓ దశలో 4-5తో వెనుకబడ్డా సోఫియా ఆ తర్వాత పుంజుకుంది. ఐదో సీడ్ స్వితోలినా 6-3, 7-6(7/5)తో మారీ బోజ్కోవా (చెక్ రిపబ్లిక్)ను చిత్తుచేసి ముందడుగేసింది. ఆరో సీడ్ కరోలినా ప్లిస్కోవా సహా ముచోవా, అలెగ్జాండ్రోవా, గాబ్రిన్ ముగురుజ, ఎలీస్ మెర్టెన్స్ తొలి రౌండ్లో ప్రత్యర్థులపై గెలిచి ముందడుగేశారు.
నాగల్ ఔట్
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత అగ్రశ్రేణి ఆటగాడు సుమీత్ నాగల్ పోరాటం ఆదిలోనే ముగిసింది. వైల్డ్‌కార్డ్ ద్వారా పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో అడుగుపెట్టిన నాగల్ 2-6, 5-7, 3-6తో బెరాకిన్స్ (లిథువేనియా) చేతిలో వరుససెట్లలో ఓడిపోయాడు. రెండో సెట్లో ఓ దశలో పుంజుకున్న నాగల్ 5-5తో స్కోరు సమం చేసినా తర్వాత ఆ జోరు కొనసాగించలేకపోయాడు.
తాజావార్తలు
- పిల్లల ఆస్పత్రి నిర్మాణానికి స్థలం గుర్తించండి: టీటీడీ ఈవో
- అనసూయ స్టెప్పులు అదరహో..'పైన పటారం' లిరికల్ వీడియో
- మహారాష్ట్రలో కొత్తగా 6,397 కరోనా కేసులు.. 30 మరణాలు
- శృంగారానికి ముందు వీటిని అస్సలు తినకండి..!
- అభివృద్ధిని చూసే టీఆర్ఎస్లో చేరికలు
- ఏపీలో తగ్గిన కరోనా కేసులు
- పలువురు సిట్టింగులను తప్పించనున్న మమతా బెనర్జీ..?
- అమిత్ షాకు నారాయణ స్వామి సవాల్
- హైదరాబాద్‌కు చంద్రబాబు తిరుగు ప్రయాణం
- నాగార్జున 'బంగార్రాజు' అప్డేట్