గురువారం 16 జూలై 2020
Sports - Apr 18, 2020 , 11:09:23

టీ20 క్రికెట్​లో విప్లవం: ఐపీఎల్​కు పుష్కరం

టీ20 క్రికెట్​లో విప్లవం: ఐపీఎల్​కు పుష్కరం

న్యూఢిల్లీ: 2008 ఏప్రిల్ 18.. సరిగ్గా 12ఏండ్ల క్రితం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ టోర్నీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్​)​కు అంకురార్పణ జరిగింది. టీ20 క్రికెట్​లో అతిపెద్ద విప్లవం ఆ రోజే మొదలైంది. టోర్నీలోని ఎనిమిది జట్లలో భారత్​తో పాటు దాదాపు ఇతర దేశాలకు చెందిన స్టార్ ఆటగాళ్లందరూ ఉన్నారు. బీసీసీఐ, ఐసీసీ పెద్దల సమక్షంలో కండ్లు చెదిరే విధంగా ప్రారంభ వేడుకలు జరిగాక.. బెంగళూరు చిన్నస్వామి మైదానం వేదికగా తొలి మ్యాచ్​ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు – కోల్​కతా నైట్​రైడర్స్ మధ్య జరిగింది.

తొలి రోజే సంచలనం

2008, ఏప్రిల్ 18న జరిగిన ఐపీఎల్ తొలి మ్యాచ్​లోనే కోల్​కతా నైట్ రైడర్స్ తరఫున బరిలోకి దిగిన కివీస్ బ్యాట్స్​మన్​ బ్రెండన్ మెక్​కలమ్ విధ్వంసం సృష్టించాడు. ఆ మ్యాచ్​లో టాస్ గెలిచి  ద్రవిడ్ నేతృత్వంలోని బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. ఆ తర్వాత ఓపెనర్​గా వచ్చిన మెక్​కలమ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్స్​లు, ఫోర్లతో మోతెక్కించాడు. మొత్తంగా 13సిక్స్​లు, 10ఫోర్లతో 73 బంతుల్లోనే 158పరుగులు చేసి అసలుసిసలైన టో20 ఇన్నింగ్స్​తో ఐపీఎల్​కు శుభారంభాన్ని అందించాడు. దీంతో కోల్​కతా 3వికెట్లు మాత్రమే కోల్పోయి 222పరుగులు చేసింది. భారీ లక్ష్యఛేదనలో ప్రవీణ్ కుమార్(18నాటౌ​ట్​)  మినహా అందరూ సింగిల్ డిజిట్​కే పరిమితమవడంతో బెంగళూరు 82పరుగులకే ఆలౌటైంది. కోల్​కతా ఏకంగా 140పరుగుల తేడాతో విజయం సాధించింది.

ముంబై 4, చెన్నై 3

ఐపీఎల్ తొలి సీజన్​లో పెద్దగాస్టార్లు లేని ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ టైటిల్ దక్కించుకుంది. ఆ తర్వాతి సీజన్​లో గిల్​క్రిస్ట్ నేతృత్వంలోని మన డక్కన్ చార్జెస్ విజయం ఢంకా మోగించింది. చెన్నె సూపర్ కింగ్స్ మూడుసార్లు​(2010, 2011, 2018), కోల్​కతా నైట్ రైడర్స్​(2012, 2014) రెండుసార్లు, ముంబై ఇండియన్స్​(2013,2015,2017,2019) నాలుగుసార్లు, సన్​రైజర్స్ హైదరాబాద్​(2016)ఓ సారి ఐపీఎల్ టైటిల్​ను దక్కించుకున్నాయి.

కాగా, 12ఏండ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిన ఐపీఎల్​కు 13వ సీజన్​లో కరోనా వైరస్ దెబ్బ తగిలిగింది. ఈ ఏడాది జరగాల్సిన సీజన్​ మహమ్మారి కారఅంగా నిరవధికంగా వాయిదా పడగా.. అసలు జరుగుతుందో లేదో అనే సందిగ్ధత ఏర్పడింది. 


logo