జాతీయ ఫుట్‌బాల్ టీమ్‌కు ఎంపికైన ఇందూరు సౌమ్య

- భారత సీనియర్ మహిళల జట్టుకు తెలంగాణ అమ్మాయి ఎంపిక
- రాష్ట్రం నుంచి తొలి ప్లేయర్‌గా రికార్డు
క్రీడా యవనికపై మరో తెలంగాణ తార తళుక్కుమంది. సాధించాలన్న పట్టుదలకు ప్రతిభ తోడైతే అద్భుతాలు చేయవచ్చని నిరూపితమైంది. అథ్లెట్‌గా కెరీర్‌ను ఆరంభించి అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ అనతికాలంలో అందరి మన్ననలు పొందుతున్నది తెలంగాణ ఫుట్‌బాల్ ప్లేయర్ గుగులోతు సౌమ్య.
ఇందూరు, ఫిబ్రవరి 10: అవకాశాలను అందిపుచ్చుకుంటూ బరిలోకి దిగిన ప్రతి టోర్నీలో సత్తాచాటిన యువ స్ట్రైకర్ సౌమ్య తాజాగా భారత మహిళల సీనియర్ ఫుట్‌బాల్ జట్టులో చోటు దక్కించుకుంది. ఈనెల 14 నుంచి 24 తేదీ వరకు టర్కీలో జరిగే అంతర్జాతీయ టోర్నీలో భారత్ తరఫున సౌమ్య బరిలోకి దిగనుంది. జాతీయ సీనియర్ టీమ్‌లో చోటు దక్కించుకున్న తొలి తెలంగాణ ప్లేయర్‌గా మహిళా ప్లేయర్‌గా ఈ ఇందూరు బిడ్డ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. రెంజల్ మండలం కూనేపల్లి కృష్ణతండాకు చెందిన గుగులోతు గోపీ, ధనలక్ష్మి దంపతుల కూతురైన సౌమ్య..భారత జట్టుకు ఎంపికైన సందర్భంగా జిల్లా కేంద్రంలో క్రీడాభిమానులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : జాతీయ స్థాయిలో తెలంగాణ సత్తా ఏంటో మరోమారు తెలిసొచ్చింది. గిరిజన బిడ్డ గుగులోతు సౌమ్య ప్రతిభకు సరైన గుర్తింపు లభించింది. తాను ఎంచుకున్న ఫుట్‌బాల్ క్రీడలో అంచెలంచెలుగాఎదుగుతూ అనతికాలంలోనే అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. పువ్వు పుట్టగానే
పరిమళిస్తుందన్నట్లు పసి వయసు నుంచే ఫుట్‌బాల్‌లో సంచనాలు సృష్టిస్తూ దూసుకెళుతున్నది. మైదానంలోపాదరసంలా కదులుతూ సాకర్‌లో ప్రత్యర్థులకు సవాలు విసురుతున్నది. అవకాశాలను అంది పుచ్చుకుంటూ బరిలోకి దిగిన ప్రతి టోర్నీలో అదరగొట్టిన సౌమ్య తన స్వప్నాన్ని నెరవేర్చుకుంది. భారత మహిళలఫుట్బాల్ జట్టుకు ఎంపికైన తొలి తెలంగాణ ప్లేయర్‌గా నిలిచిన సౌమ్య ప్రస్థానం ఇలా సాగింది.
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కూనేపల్లి కృష్ణ తండాలో 2001లో జన్మించిన సౌమ్య..గోపీ, ధనలక్ష్మి దంపతులకు మూడో కూతురు. పాఠశాల స్థాయిలో జరిగిన పరుగు పోటీల్లో సౌమ్య ఔరా అనిపించింది. చిరుతను తలపిస్తూ పరుగు లంఘించే ఈ అమ్మాయి ప్రతిభను కోచ్ నాగరాజు ఆదిలోనే గుర్తించాడు. అప్పటి వరకు గ్రామీణ ప్రాంతానికే పరిమితమైన సౌమ్య మెరుగైన విద్య కోసం జిల్లా కేంద్రానికి వలస వచ్చింది. సౌమ్య ఫుట్‌బాల్ ఆడేందుకు ఆమె తల్లిదండ్రులు గోపి, ధనలక్ష్మి తొలుత నిరాకరించారు. అమ్మాయిలు ఫుట్‌బాల్ ఆడటం ఏంటంటూ ససేమిరా అన్నారు. అయితే సరైన రీతిలో తర్ఫీదు ఇస్తే మెరికలాగా తీర్చిదిద్దవచ్చు అంటూ ఆమె తల్లిదండ్రులకు నచ్చచెప్పడంలో కోచ్ నాగరాజు సఫలీకృతమయ్యాడు. ఇక అక్కణ్నుంచి సౌమ్య వెనుదిరిగి చూసుకోలేదు.అబ్బాయిలతో కలిసి ప్రాక్టీస్ చేస్తూ కోచ్ అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ వచ్చింది. కర్నూలులో 2012లో జరిగిన అండర్-14 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ద్వారా ఫుట్‌బాల్ కెరీర్ ప్రారంభించిన ఈ యువ స్ట్రైకర్ గోల్స్ చేయడమే లక్ష్యంగా ఎంచుకుంది.
2015లో ఖట్మాండులో జరిగిన ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫడరేషన్ టోర్నీలో భారత అండర్-14 బాలికల జట్టుకు ఈ అమ్మాయి ఎంపికైంది. అయితే భారీ భూకంపం కారణంగా టోర్నీ నుంచి భారత్ అర్ధాంతరంగా వైదొలుగాల్సి వచ్చింది. తృటిలో గాయాల నుంచి బయటపడ్డ సౌమ్య..ఆ మరుసటి ఏడాదే అండర్-16 ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున అత్యధిక గోల్స్(4)చేసింది. 2018లో జొహాన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన బ్రిక్స్ అండర్-17 చాంపియన్‌షిప్‌లో భారత్ జట్టుకు సౌమ్య సారథ్యం వహించింది.
వియత్నాం అండర్-19 టోర్నీతో సహా పలు జాతీయ స్థాయి టోర్నీల్లో మెరిసిన సౌమ్య తాను ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. ఇటీవలే గోవాలో జరిగిన భారత సీనియర్ మహిళల ఫుట్‌బాల్ టీమ్ క్యాంప్‌నకు ఎంపికైన సౌమ్య ప్రతిభకు సెలెక్టర్లు పట్టం కట్టారు. టర్కీలో జరిగే టోర్నీలో పోటీపడే భారత్ తరఫున సౌమ్యను ఎంపిక చేశారు.
తెలంగాణ నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్న తొలి తెలంగణ అమ్మాయిగా ‘ఇందూరు ఎక్స్‌ప్రెస్' సౌమ్య అరుదైన రికార్డును అందుకుంది.
- అండర్-16 ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున అత్యధిక గోల్స్(4)చేసింది.
- బ్రిక్స్ అండర్-17 చాంపియన్‌షిప్‌లో భారత్‌కు సౌమ్య సారథ్యం వహించింది.
- అండర్-18 ఎస్ఏఎఫ్ఎఫ్ కప్‌లో భారత్ కాంస్యం సాధించడంలో సౌమ్య కీలక భూమిక పోషించింది.
తాజావార్తలు
- తమిళనాడులో మార్చి 31వరకు లాక్డౌన్ పొడిగింపు
- వీడియో లింక్ ద్వారా కోర్టుకు హాజరైన ఆంగ్ సాన్ సూకీ
- పార్టీ పెట్టే ఆలోచన లేదని సంకేతాలిచ్చిన ట్రంప్
- కార్లతో కిక్కిరిసిన ఎన్‌హెచ్ 44
- భారత విద్యుత్ వ్యవస్థపై చైనా సైబర్ దాడి
- ఏనుగు దాడిలో ఇద్దరు దుర్మరణం
- కోవిడ్ టీకా తీసుకున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్
- హీరోను అన్నా అనేసి నాలుక కరుచుకున్న లావణ్య
- వింగ్ కమాండర్ అభినందన్ విడుదల.. చరిత్రలో ఈరోజు
- చెప్పుతో కొట్టిందనే కోపంతో మహిళకు కత్తిపోట్లు!