శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Feb 01, 2020 , 02:18:57

సూపర్‌ హిట్‌

సూపర్‌ హిట్‌
  • పాండే అజేయ అర్ధ సెంచరీ.. శార్దుల్‌ అద్భుత ప్రదర్శన
  • కివీస్‌పై సూపర్‌ ఓవర్లో భారత్‌దే విజయం

29-1-2020, 31-1-2020 తేదీలు మారాయేమో గానీ ఫలితం మాత్రం సేమ్‌ టు సేమ్‌! అచ్చుగుద్దినట్లు, అంతా అప్పుడు జరిగినట్లే భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య నాలుగో టీ20 జరిగింది.  క్రికెట్‌లో అద్భుతాలకు లెక్కలేదు. కానీ ఇలాంటివి అరుదని చెప్పకతప్పదు. రెండు జట్ల స్కోర్లు సమం కావడం నుంచి.. సూపర్‌ ఓవర్లో తిరిగి టీమ్‌ఇండియా విజయదుందుభి మోగించడం వరకు అన్నీ మూడో మ్యాచ్‌ను పోలినట్లు జరిగాయి. మనీశ్‌పాండే ఒంటరిపోరాటంతో పోరాడే స్కోరు అందుకున్న టీమ్‌ఇండియా..కివీస్‌ రెక్కలు విరిచింది. విజయానికి 6 బంతుల్లో 7 పరుగులు అవసరమైన తరుణంలో శార్దుల్‌ ఠాకూర్‌ అద్భుతమే చేశాడు. షమీ ప్రదర్శనను పునరావృతం చేస్తూ ఒకే ఓవర్లో నలుగురిని పెవిలియన్‌కు పంపి  మ్యాచ్‌ ‘టై’ కావడంలో కీలకమయ్యాడు. ఆ తర్వాత సూపర్‌ ఓవర్లో కివీస్‌ విసిరిన లక్ష్యాన్ని భారత్‌ అలవోక ఛేదించి సూపర్‌ హిట్టు.. మ్యాచ్‌ హిట్టు..అంటూ ఎగిరి గంతేసింది. కివీస్‌కు తీరని పరాభవాన్ని మిగిల్చిన కోహ్లీసేన క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. 

వెల్లింగ్టన్‌: మనిషి పోలిన మనుషులు ప్రపంచంలోనే ఏడుగురు ఉంటారంటారు. అలా ఉంటారో లేదో తెలియదు కానీ మ్యాచ్‌ను పోలిన మ్యాచ్‌ జరుగడం మాత్రం ఇదే తొలిసారి అనిపిస్తున్నది. అవును శుక్రవారం భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య నాలుగో టీ20 మ్యాచ్‌ అభిమానుల మదిలో కలకాలం గుర్తిండిపోవడం మాత్రం ఖాయం. లేకపోతే భారత్‌ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యఛేదనలో చేతిలో ఏడు వికెట్లు ఉండి 12 బంతుల్లో 11 పరుగులు చేయలేక ఒత్తిడికి చిత్తవ్వడం కివీస్‌కే చెల్లింది. ఇరు జట్ల స్కోర్లు సమమైన మ్యాచ్‌లో విజేతను నిర్ణయించే సూపర్‌ ఓవర్‌లో టీమ్‌ఇండియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 4-0తో ముందంజ వేసింది. తొలుత మనీశ్‌ పాండే(36 బంతుల్లో 50 నాటౌట్‌, 3ఫోర్లు), రాహుల్‌(39) రాణింపుతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్‌ 165/8 స్కోరు చేసింది. సోధీ(3/26), బెన్నెట్‌(2/41) ఆకట్టుకున్నారు. లక్ష్యఛేదనకు దిగిన కివీస్‌ మున్రో(47 బంతుల్లో 64, 6ఫోర్లు, 3సిక్స్‌లు), సిఫెర్ట్‌(39 బంతుల్లో 57, 4ఫోర్లు, 3సిక్స్‌లు) అర్ధసెంచరీలతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 165 స్కోరు చేసింది.శార్దుల్‌ ఠాకూర్‌(2/33) రెండు వికెట్లు తీశాడు. సూపర్‌ బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలకమైన శార్దుల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దక్కింది. ఇరు జట్ల మధ్య ఆఖరి టీ20 ఆదివారం జరుగుతుంది. 

పాండే ఒంటరి పోరాటం

రోహిత్‌శర్మ, షమీతో పాటు జడేజాకు విశ్రాంతినిచ్చిన టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సుందర్‌, సైనీ, శాంసన్‌కు అవకాశమిచ్చింది. ఓపెనర్‌గా వచ్చిన శాంసన్‌ కండ్లు చెదిరే సిక్స్‌తో ఊపుతో కనిపించినా...క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. కుగెల్జిన్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో భారీ షాట్‌ ఆడబోయిన శాంసన్‌(8) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు సూపర్‌ ఫామ్‌మీదున్న రాహుల్‌ తన జోరు కొనసాగించాడు. సాంట్నర్‌ను వరుసగా సిక్స్‌, ఫోర్‌ బాదిన రాహుల్‌ తన బ్యాట్‌ పవరేంటో చూపించాడు.  వరుస ఫోర్లతో దూకుడు మీద కనిపించిన కెప్టెన్‌ కోహ్లీని బెన్నెట్‌ పెవిలియన్‌ పంపాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి భారత్‌ 2 వికెట్లకు 51 పరుగులు చేసింది. క్రీజులోకి వచ్చిన అయ్యర్‌(1) స్వల్ప స్కోరుకే నిరాశపరుచగా, మరోమారు శివమ్‌ దూబే(12) వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు.  ఓవైపు సహచరులు నిష్క్రమిస్తున్నా..ఆదుకుంటాడనుకున్న రాహుల్‌ కూడా వెనుదిరుగడంతో భారత్‌కు ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న సుందర్‌(0) పరుగుల ఖాతా తెరువకుండానే ఔట్‌ కావడంతో 40 పరుగుల తేడాతో  నాలుగు కీలక వికెట్లు చేజార్చుకోవడంతో  టీమ్‌ఇండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.88 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన తరుణంలో స్వల్ప స్కోరుకే పరిమితమవుందనుకున్న జట్టును మనీశ్‌ పాండే గట్టెక్కించాడు. శార్దుల్‌(20) సహకారంతో కివీస్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. శార్దుల్‌ కూడా చేయి వేయడంతో స్కోరుబోర్డు ఊపందుకుంది. శార్దుల్‌, చాహల్‌ వెంటవెంటనే ఔటైనా ఆఖర్లో సైనీతో కలిసి ఆడిన పాండే అర్ధసెంచరీతో జట్టుకు పోరాడే స్కోరు కట్టబెట్టాడు. 

మున్రో, సిఫెర్ట్‌ రాణించినా..

లక్ష్యఛేదనలో కివీస్‌కు అనుకున్న శుభారంభం దక్కలేదు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్లో ఓపెనర్‌ గప్టిల్‌(4) తొలి వికెట్‌గా నిష్క్రమించాడు. మున్రో వరుస బౌండరీలతో కివీస్‌ పవర్‌ప్లే ముగిసే సరికి వికెట్‌ కోల్పోయి 39 పరుగులు చేసింది. సిఫెర్ట్‌ సహకారంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను భుజాలకెత్తుకున్నాడు. మరో ఎండ్‌లో సిఫెర్ట్‌ కూడా టచ్‌లోకి రావడంతో పరుగుల రాక సులువైంది. వీరిద్దరిని విడగొట్టేందుకు కెప్టెన్‌ కోహ్లీ ప్రయత్నాలు నెరవేరలేదు. ఈ క్రమంలో మున్రో 38 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. లక్ష్యం వైపు సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్‌ను మున్రో రనౌట్‌ ములుపు తిప్పింది. దూబే బౌలింగ్‌లో రెండో పరుగు కోసం ప్రయత్నించిన మున్రో..కోహ్లీ సూపర్‌ త్రోతో పెవిలియన్‌ చేరాడు. దీంతో రెండో వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్‌ పడింది. క్రీజులోకొచ్చిన బ్రూస్‌ను రెండు బంతుల తేడాతో చాహల్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. కానీ ఆఖరి ఓవర్లో శార్దుల్‌ మాయాజాలం కివీస్‌ కొంపముంచింది. నాలుగు వికెట్లు కోల్పోయి గెలుపు వాకిట బొక్కాబోర్లా పడింది.  

 శార్దుల్‌ వారెవ్వా  


మూడో టీ20లో మహ్మద్‌ షమీ అద్భుతం చేశాడనుకుంటే నాలుగో దాంట్లో శార్దుల్‌ ఠాకూర్‌ వారెవ్వా అనిపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అంతగా అనుభవం లేకున్నా.. కివీస్‌ బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టించాడు. విజయానికి ఆరు బంతుల్లో ఏడు పరుగులు అవసరమైన దశలో బౌలింగ్‌కు దిగిన శార్దుల్‌..తొలి బంతికే టేలర్‌ను ఔట్‌ చేశాడు. భారీ షాట్‌కొట్టిన టేలర్‌ మిడ్‌వికెట్‌లో అయ్యర్‌ అద్భుత క్యాచ్‌తో నిష్క్రమించాడు. వచ్చి రావడంతోనే మిచెల్‌ ఫోర్‌ బాదగా మరుసటి బంతికే రాహుల్‌ త్రోతో సిఫెర్ట్‌ రనౌటయ్యాడు. సమీకరణం కాస్తా మూడు బంతుల్లో మూడు పరుగులకు మారింది. శార్దుల్‌ నకుల్‌ బంతిని ఆడబోయిన మిచెల్‌..దూబేకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన దశలో శాంసన్‌ త్రోతో సాంట్నర్‌ రనౌట్‌ కావడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది. మొత్తంగా ఆరు పరుగులిచ్చుకున్న నాలుగు వికెట్లు పడగొట్టడంలో భాగమయ్యాడు. 


స్కోరుబోర్డు

భారత్‌: రాహుల్‌(సి)సాంట్నర్‌(బి)సోధీ 39, శాంసన్‌ (సి)సాంటర్న్‌(బి)కుగెల్జిన్‌ 8, కోహ్లీ(సి)సాంట్నర్‌(బి)బెన్నెట్‌ 11, అయ్యర్‌(సి)బ్రూస్‌(బి)సోధీ 12, పాండే 50 నాటౌట్‌, సుందర్‌(బి)సాంట్నర్‌ 0, శార్దుల్‌ (సి)సౌథీ(బి)బెన్నెట్‌ 20, చాహల్‌(సి)సిఫెర్ట్‌(బి)సౌథీ 1, సైనీ 11 నాటౌట్‌; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 165/8; వికెట్ల పతనం: 1-14, 2-48, 3-52, 4-75, 5-84, 6-88, 7-131, 8-143; బౌలింగ్‌: సౌథీ 4-0-28-1, కుగెల్జిన్‌ 4-0-39-1, సాంట్నర్‌ 4-0-26-1, బెన్నెట్‌ 4-0-41-2, సోధీ 4-0-26-3. 

న్యూజిలాండ్‌: గప్టిల్‌(సి)రాహుల్‌(బి)బుమ్రా 4, మున్రో(రనౌట్‌/శార్దుల్‌, కోహ్లీ) 64, స్టిఫెర్ట్‌ (రనౌట్‌/రాహుల్‌) 57, బ్రూస్‌(బి) చాహల్‌ 0, టేలర్‌(సి)అయ్యర్‌(బి)శార్దుల్‌ 24, మిచెల్‌(సి)దూబే(బి)శార్దుల్‌ 4, సాంట్నర్‌(రనౌట్‌, శాంసన్‌/రాహుల్‌) 2, కుగెల్జిన్‌ 0 నాటౌట్‌; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 165/7; వికెట్ల పతనం: 1-22, 2-96, 3-97, 4-159, 5-163, 6-164, 7-165; బౌలింగ్‌: శార్దుల్‌ 4-0-33-2, సైనీ 4-0-29-0, బుమ్రా 4-0-20-1, చాహల్‌ 4-0-38-1, సుందర్‌ 2-0-24-0, దూబే 2-0-14-0. 


సూపర్‌ ఓవర్‌ సాగిందిలా 

న్యూజిలాండ్‌
బంతులు
భారత్‌ 
216
424
23ఔట్‌(రాహుల్‌)
ఔట్‌(సిఫెర్ట్‌)
42
454
16-
13/1
మొత్తం
16/1   
బౌలర్‌(బుమ్రా)   

బౌలర్‌(సౌథీ) 

3అంతర్జాతీయ టీ20ల్లో మనీశ్‌పాండేకు ఇది మూడో అర్ధసెంచరీ.
1న్యూజిలాండ్‌పై టీ20ల్లో శార్దుల్‌ ఠాకూర్‌కు ఇది మొదటి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌-శ్రీలంకపై రెండు సార్లు అవార్డు అందుకున్నాడు. 
117
టీ20ల్లో నాలుగు వేల పరుగుల మార్క్‌ అందుకోవడానికి రాహుల్‌కు అవసరమైన ఇన్నింగ్స్‌లు.కోహ్లీ (138)ని అధిగమిస్తూ రాహుల్‌ వేగంగా ఈ ఫీట్‌ అందుకున్నాడు.
1న్యూజిలాండ్‌పై వరుసగా నాలుగు టీ20 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించడం  భారత్‌కు ఇదే తొలిసారి. 
1వెస్ట్‌ప్యాక్‌ స్టేడియంలో టీ20 మ్యాచ్‌ గెలువడం టీమ్‌ఇండియాకు ఇదే మొదటిది.
2టీ20ల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ రనౌట్‌ కావడం ఇది రెండోసారి. గతం(2007)లో భారత్‌తో మ్యాచ్‌లో నాలుగు రనౌట్లు నమోదయ్యాయి.
logo