గురువారం 28 జనవరి 2021
Sports - Dec 23, 2020 , 11:01:19

కోట్లా స్టేడియంలో జైట్లీ విగ్ర‌హ‌మా ?

కోట్లా స్టేడియంలో జైట్లీ విగ్ర‌హ‌మా ?

హైద‌రాబాద్‌:  ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో దివంగ‌త కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించాల‌ని భావిస్తున్నారు.  డీడీసీఏ అధ్య‌క్షుడిగా జైట్లీ సుమారు 14 ఏళ్ల పాటు కొన‌సాగారు. అయితే అరుణ్ జైట్లీ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించాల‌నుకున్న డీడీసీఏ ప్రణాళిక ప‌ట్ల మాజీ క్రికెట‌ర్ బిష‌న్ సింగ్ బేడీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  జైట్లీ విగ్ర‌హ ఏర్పాటుకు నిర‌స‌న తెలుపుతూ డీడీసీఏకే బేడీ లేఖ రాశారు. ఫిరోజ్ షా స్టేడియంలో ఓ స్టాండ్స్‌కు ఉన్న త‌న పేరును తొల‌గించాల‌న్నారు.  2017లో స్టేడియంలోని ఓ స్టాండ్స్‌కు బేడీ పేరును పెట్టారు. అంతుకాదు త‌న‌ను డీడీసీఏ స‌భ్య‌త్వం నుంచి తొల‌గించాల‌ని కూడా కోరారు.  డీడీసీఏలో బంధుప్రీతి పెరిగింద‌ని, క్రికెట‌ర్ల‌ను మ‌రిచి ప‌రిపాల‌కుల‌ను ప్ర‌మోట్ చేస్తున్నార‌ని బేడీ త‌న లేఖ‌లో ఆరోపించారు. డీడీసీఏ స‌భ్య‌త్వాన్ని వ‌దులుకుంటున్న‌ట్లు బేడీ చెప్పారు. 

కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గ‌త ఏడాది ప‌లు ఆరోగ్య కార‌ణాల వ‌ల్ల మ‌ర‌ణించారు. అయితే ప్ర‌స్తుతం ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా అరుణ్ జైట్లీ కుమారుడు రోహ‌న్ జైట్లీ ఉన్నారు.  త‌న‌లో ఎక్కువ స‌హ‌నం ఉంద‌ని గ‌ర్వ‌ప‌డేవాడిన‌ని, కానీ ఆ ఓర్పు ఇప్పుడు న‌శిస్తోంద‌ని బిష‌న్ సింగ్ బేడీ త‌న లేఖ‌లో పేర్కొన్నారు. డీడీసీఏ చ‌ర్య‌లు త‌నను ఈ విధంగా మారుస్తున్న‌ట్లు ఆరోపించారు.  1999 నుంచి 2013 వ‌ర‌కు డీడీసీఏ అధ్య‌క్షుడిగా అరుణ్ జైట్లీ ప‌ని చేశారు.  అయితే కోట్లా స్టేడియంలో జైట్లీ జ్ఞాప‌కార్థం ఆరు అడుగుల విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్నారు.   


logo