రస్సెల్ విధ్వంసం.. 19 బంతుల్లో 65 పరుగులు

కొలంబో: వెస్టిండీస్ హార్డ్‌హిట్టర్ ఆండ్రూ రస్సెల్ బ్యాట్‌తో చెలరేగితే విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతడు ఫామ్‌లోకి వస్తే బౌలర్లకు చుక్కలు తప్పవు. బంతిని అలవోకగా స్టాండ్స్‌లోకి తరలించే రస్సెల్ ప్రస్తుతం లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్)లో కొలంబో కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆదివారం గాలె గ్లాడియేటర్స్, కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను 5 ఓవర్లకు కుదించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన కొలంబో జట్టు 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. రస్సెల్ 19 బంతుల్లో 9ఫోర్లు, 4సిక్సర్ల సాయంతో 65 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో లారీ ఎవాన్స్(21 నాటౌట్) రాణించడంతో కొలంబో ఊహించని స్కోరు సాధించింది.
అనంతరం లక్ష్య ఛేదనలో గాలె టీమ్ 5 ఓవర్లలో 2 వికెట్లకు 62 పరుగులు చేసింది. ధనుష్క గుణతిలక(30 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో కొలంబో టీమ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది అవార్డును రస్సెల్ అందుకున్నాడు.