ఇప్పటి వరకు మేజర్ టోర్నీల్లో కనీసం రెండో రౌండ్ కూడా దాటని తమార జిదాన్చెక్.. అదిరిపోయే ఆటతో ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌కు చేరింది. స్లొవేనియా నుంచి ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన జిదాన్చెక్.. సెమీస్‌లో అనస్తసియా పవ్ల్యూచెంకోవాతో అమీతుమీ తేల్చుకోనుంది. పురుషుల విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్, స్టార్ ఆటగాడు రఫెల్ నాదల్ నేడు క్వార్టర్స్ మ్యాచ్‌లు ఆడనున్నారు.
పారిస్: ప్రపంచ 85వ ర్యాంకర్ తమార జిదాన్చెక్ ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గ్రాండ్‌స్లామ్‌తో పాటు డబ్ల్యూటీఏ మేజర్ టోర్నీల్లోనూ ఇప్పటి వరకు రెండో రౌండ్ దాటలేకపోయిన ఈ స్లొవేనియా భామ.. మట్టి కోర్టులో అద్భుత ప్రదర్శనతో ‘ఫైనల్ ఫోర్’లో అడుగుపెట్టింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో జిదాన్చెక్ 7-5, 4-6, 8-6తో పౌలా బడోసా (స్పెయిన్)పై విజయం సాధించింది. సెమీస్ చేరడం చాలా ఆనందంగా ఉందన్న ఈ స్లొవేనియా స్టార్.. ఇదే జోరులో ముందుకు సాగుతానని పేర్కొంది. మరో క్వార్టర్స్‌లో 31వ సీడ్ అనస్తసియా పవ్ల్యూచెంకోవా (రష్యా) 6-7 (2/7), 6-2, 9-7తో 21వ సీడ్ ఎలెనా రిబాకినా (కజకిస్థాన్)పై గెలుపొందింది. తొలి సెట్ కోల్పోయాక జూలు విదిల్చిన పవ్ల్యూచెంకోవా వరుస సెట్లలో విజయం సాధించింది. గురువారం జరుగనున్న సెమీఫైనల్లో పవ్ల్యూచెంకోవాతో జిదాన్చెక్ తలపడనుంది.
ఆధిక్యం చేతులు మారుతూ 2 గంటలా 26 నిమిషాల పాటు సాగిన ఉత్కంఠ పోరులో తొలి సెట్ చేజిక్కించుకున్న జిదాన్చెక్.. రెండో సెట్ ఓడిన తర్వాత నిర్ణయాత్మక మూడో సెట్లో విజృంభించింది. ఒక దశలో 6-6తో స్కోర్లు సమమైన సమయంలో వరుసగా రెండు మ్యాచ్ పాయింట్లు కాచుకొని చరిత్ర సృష్టించింది. మరోవైపు ఈ సీజన్లో మట్టి కోర్టులో అత్యధిక విజయాలు (17) సాధించిన 33వ సీడ్ బడోసా ఒత్తిడికి లోనై తప్పిదాలు చేసింది. ఓవరాల్‌గా జిదాన్చెక్ 48 విన్నర్లు కొడితే.. బడోసా 31కే పరిమితమైంది. స్లొవేనియా భామ 39 అనవసర తప్పిదాలు చేస్తే.. 47 తప్పిదాలతో బడోసా మూల్యం చెల్లించుకుంది.
పురుషుల విభాగంలో ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) సెమీస్‌లో అడుగుపెట్టాడు. క్వార్టర్ ఫైనల్లో జ్వెరెవ్ 6-4,6-1,6-1తో డావిడోవిచ్ ఫొకినా (స్పెయిన్)పై విజయం సాధించాడు. గంటా 36 నిమిషాల్లో ముగిసిన ఏకపక్ష క్వార్టర్ ఫైనల్లో జ్వెరెవ్.. 24 విన్నర్లతో సత్తాచాటితే.. ఫొకినా 37 అనవసర తప్పిదాలతో పరాజయం వైపు నిలిచాడు. మరో ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో సిట్సిపస్ 6-3,6-2,7-5తో కారెనో బుస్టా (స్పెయిన్)పై గెలుపొందాడు. నేడు జరుగనున్న పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో స్వార్ట్మన్తో నాదల్, బెరెట్టినితో జొకోవిచ్ అమీతుమీ తేల్చుకోనున్నారు.