టోక్యో: అమెరికన్ టాప్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ (Simone Biles) ఒలింపిక్స్‌లో మరో ఈవెంట్ నుంచి తప్పుకుంది. రియో గేమ్స్‌లో ఆరు గోల్డ్ మెడల్స్ గెలిచిన రికార్డును బైట్స్ టోక్యోలోనూ రిపీట్ చేస్తుందని అనుకుంటున్న సమయంలో.. ఆమె వరుసగా ఒక్కో ఈవెంట్ నుంచి తప్పుకుంటోంది. తాజాగా ఫ్లోర్ ఎక్సర్‌సైజ్‌లోనూ ఆమె పాల్గొనడం లేదని అమెరికా జిమ్నాస్టిక్స్ ప్రకటించింది. గతవారం ఈ ఈవెంట్లో నిర్వహించిన క్వాలిఫయింగ్ రౌండ్లో ఆమె రెండో స్థానంలో నిలిచింది.
ఇక మంగళవారం జరగనున్న బ్యాలెన్స్ బీమ్ ఫైనల్లో పాల్గొనాలా వద్దా అన్నదానిపై బైల్స్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని అమెరికా జిమ్నాస్టిక్స్ చెప్పింది. ఈ ఈవెంట్లో రియో గేమ్స్‌లో ఆమె బ్రాంజ్ గెలిచింది. ఆదివారం సాయంత్రం జరగబోయే అన్ఈవెన్ బార్స్, వాల్ట్ ఫైనల్స్‌లో పార్టిసిపేట్ చేయకూడదని ఇప్పటికే బైల్స్ నిర్ణయించింది. జిమ్నాస్ట్‌లు ట్విస్టీస్గా పిలిచే మెంటల్ బ్లాక్‌తో సిమోన్ బైల్స్ సతమతమవుతోంది.