శుక్రవారం 22 జనవరి 2021
Sports - Dec 15, 2020 , 13:39:03

ఆంధ్రా టీమ్‌కు ఆడ‌నున్న అంబ‌టి రాయుడు

ఆంధ్రా టీమ్‌కు ఆడ‌నున్న అంబ‌టి రాయుడు

హైద‌రాబాద్‌: స‌్టార్ బ్యాట్స్‌మ‌న్ అంబ‌టి రాయుడు దేశ‌వాళీ క్రికెట్‌లో ఆంధ్రా టీమ్ త‌ర‌ఫున ఆడ‌నున్నాడు. ఈ మ‌ధ్యే బీసీసీఐ నుంచి అత‌డు నో ఆబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్ కూడా అందుకున్న‌ట్లు బోర్డు వ‌ర్గాలు వెల్ల‌డించాయి. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 10 నుంచి ప్రారంభ‌మ‌య్యే స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టోర్నీ నుంచి అత‌డు ఆంధ్రా టీమ్‌కు అందుబాటులో ఉండ‌నున్నాడు. రాయుడుపై ఒక‌టి, రెండు రోజుల్లో ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌నుంది. ఆంధ్రా టీమ్‌కు రాయుడు ఆడ‌టం ఇది రెండోసారి. 2003-04లో తొలిసారి ఆంధ్రా టీమ్‌కు ఆడిన రాయుడు.. 2005-06 సీజ‌న్‌లో శివ్‌లాల్ యాద‌వ్ కొడుకు అర్జున్ యాద‌వ్‌తో గ్రౌండ్‌లోనే గొడ‌వ ప‌డి వార్త‌ల్లో నిలిచిన సంగ‌తి తెలిసిందే. 

టీమిండియా త‌ర‌ఫున 55 వన్డేలు. 6 టీ20లు ఆడిన రాయుడు.. గ‌తేడాది త‌న‌ రిటైర్మెంట్‌ను వెన‌క్కి తీసుకున్నాడు. త‌ర్వాత హైద‌రాబాద్ త‌ర‌ఫున టీ20లు, విజ‌య్ హ‌జారే ట్రోఫీలో ఆడాడు. ఆ త‌ర్వాత హైద‌రాబాద్ టీమ్‌లో ప‌రిస్థితులు బాగా లేవంటూ రంజీ ట్రోఫీ టీమ్ నుంచి త‌ప్పుకున్నాడు. టీమ్‌లో చాలా రాజ‌కీయాలు న‌డుస్తున్నాయ‌ని, మంచి క్రికెట్ ఆడే ప‌రిస్థితులు అక్క‌డ లేవ‌ని రాయుడు చెప్పాడు. అర్జున్ యాద‌వ్‌ను కోచ్‌గా కొన‌సాగిస్తున్న హెచ్‌సీఏపైనా విమ‌ర్శ‌లు గుప్పించాడు. అత‌డు కోచ్‌గా ప‌నికి రాడ‌ని, అత‌న్ని న‌మ్ముకుంటే రంజీ ట్రోఫీలో హైద‌రాబాద్ టీమ్ ప‌నైపోయిన‌ట్లేన‌ని అన్నాడు. 


logo