బుధవారం 28 అక్టోబర్ 2020
Sports - Sep 20, 2020 , 01:33:01

చిందేసిన చెన్నై

చిందేసిన చెన్నై

  • రాణించిన రాయుడు, డుప్లెసిస్‌.. ముంబైపై ధోనీసేన ఘన విజయం

కరోనా కాలంలో బయో సెక్యూర్‌ వాతావరణంలో ఆరంభమైన ఐపీఎల్‌ 13వ సీజన్‌లో తెలుగు ఆటగాడు అంబటి రాయుడు దుమ్మురేపడంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ బోణీ కొట్టింది. ఆరు నెలలుగా క్రికెట్‌ మజాకు ముఖం వాచిపోయిన అభిమానులకు ధోనీసేన ఫుల్‌ జోష్‌నిచ్చింది. బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై ముంబై ఓ మోస్తారు స్కోరు చేయగా.. లక్ష్యఛేదనలో చెన్నై ఇరగదీసింది. గత ఎనిమిది సీజన్లలో తమ తొలి మ్యాచ్‌ను గెలువని ముంబై ఇండియన్స్‌ ఈ సారి కూడా అదే తీరు కొనసాగించింది

అబుదాబి: ఎప్పుడెప్పుడా అని కండ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌కు శుభారంభం లభించింది. గత సీజన్‌ ఫైనలిస్టుల మధ్య జరిగిన తొలి పోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌దే పైచేయి అయింది. శనివారం షేక్‌ జాయేద్‌ స్టేడియంలో జరిగిన సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో ధోనీ సేన 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసి న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు చేసింది. సౌరభ్‌ తివారి (31 బంతుల్లో 42; 3 ఫోర్లు, ఒక సిక్సర్‌), క్వింట న్‌ డికాక్‌ (20 బంతుల్లో 33; 5 ఫోర్లు) రాణించగా.. మిగిలినవాళ్లు విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో ఎంగ్డీ 3, దీపక్‌ చాహర్‌, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో చెన్నై 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. రాయుడు (48 బంతుల్లో 71; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), డుప్లెసిస్‌ (55 నాటౌట్‌) అర్ధశతకాలు బాదారు. రాయుడుకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. 

ఆరంభం అదిరినా..

సీజన్‌ తొలి మ్యాచ్‌లో రోహిత్‌ సేనకు అదిరిపోయే ఆరంభం లభించింది. మొదటి బంతికే హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ (12) బౌండ్రీ బాదగా.. మరో ఓపెనర్‌ డికాక్‌ కూడా వరుస బౌండ్రీలతో చెన్నై బౌలర్లను బెదరగొట్టాడు. తొలి వికెట్‌కు 4.4 ఓవర్లలో 46 పరుగులు జతచేశాక చావ్లా బౌలింగ్‌లో రోహిత్‌ ఔటయ్యాడు. కాసేపటికే డికాక్‌ కూడా వెనుదిరగగా.. సూర్యకుమార్‌ (17) ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. ఈ దశలో హార్దిక్‌ పాండ్యా (14; 2 సిక్సర్లు)తో కలిసి సౌరవ్‌ తివారి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఇన్నింగ్స్‌ కుదురుకుంటున్న దశలో సూపర్‌ క్యాచ్‌లతో డుప్లెసిస్‌ ఈ జోడీని విడదీశాడు. ఆఖర్లో పొలార్డ్‌ (18), కృనాల్‌ (3), ప్యాటిన్‌సన్‌ (11) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 

కష్టాలను అధిగమించి..

టార్గెట్‌ ఛేజింగ్‌లో చెన్నైకి శుభారంభం దక్కలేదు. స్కోరు బోర్డుపై పట్టుమని పది పరుగులు చేరకుండానే.. ఆ జట్టు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. వాట్సన్‌ (4)ను బౌల్ట్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా.. మురళీ విజయ్‌ (1) అతడిని అనుసరించాడు. 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఆ జట్టును రాయుడు, డుప్లెసిస్‌ ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 115 పరుగులు జోడించారు.  ముఖ్యంగా రాయుడు భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 33 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.  డుప్లెసిస్‌ అతడికి చక్కటి తోడ్పాటు అందించాడు. 24 బంతుల్లో 42 పరుగులు చేయాల్సిన దశలో రాయుడు ఔటైనా.. జడేజా (10), సామ్‌ కరన్‌ (18; 1 ఫోర్‌, 2 సిక్సర్లు), ధోనీ (0 నాటౌట్‌)తో కలిసి డుప్లెసిస్‌ జట్టుకు విజయాన్నందించాడు. 

డుప్లెసిస్‌ డబుల్‌ ధమాకా 

జడేజా వేసిన 14వ ఓవర్‌ రెండో బంతికి సౌరవ్‌ తివారి కొట్టిన భారీ షాట్‌ను లాంగాన్‌లో డుప్లెసిస్‌ అద్భుతంగా అందుకున్నాడు. బౌండ్రీ రోప్‌ వద్ద గాల్లో ఎగిరి బంతిని ఒడిసిపట్టిన ఫాఫ్‌.. ఆ తర్వాత నియంత్రణ కోల్పోవడంతో బంతిని గాల్లోకి ఎగరేసి బౌండ్రీ దాటాడు. అనంతరం నింపాదిగా క్యాచ్‌ పూర్తిచేశాడు. మరో మూడు బంతుల వ్యవధిలో అచ్చం అలాంటి మరో క్యాచ్‌తో హార్దిక్‌ కథ ముగించాడు. అప్పటికే రెండు సిక్సర్లు బాది మంచి టచ్‌లో కనిపించిన పాండ్యా.. ఫాఫ్‌ పట్టిన అద్భుత క్యాచ్‌కు పెవిలియన్‌ బాట పట్టాడు. 

క్రికెట్‌ సింగం

చెన్నై అభిమానులు ముద్దుగా తలా అని పిలుచుకునే ధోనీ.. ఈ మ్యాచ్‌లో అసలైన సింగాన్ని తలపించాడు. గుబురు మీసాలు, తీక్షణమైన చూపులతో వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ను గుర్తుచేశాడు. ఆగస్టు 15, 7 గంటల 29 నిమిషాలకు అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించిన ధోనీ.. శనివారం 7.30కి పసుపు రంగు దుస్తుల్లో మైదానంలో అడుగుపెట్టడం కొసమెరుపు. 

స్కోరు బోర్డు

ముంబై: రోహిత్‌ (సి) కరన్‌ (బి) చావ్లా 12, డికాక్‌ (సి) వాట్సన్‌ (బి) కరన్‌ 33, సూర్యకుమార్‌ (సి) కరన్‌ (బి) చాహర్‌ 17, సౌరభ్‌ తివారి (సి) డుప్లెసిస్‌ (బి) జడేజా 42, హార్దిక్‌ (సి) డుప్లెసిస్‌ (బి) జడేజా 14, పొలార్డ్‌ (సి) ధోనీ (బి) ఎంగ్డీ 18, కృనాల్‌ (సి) ధోనీ (బి) ఎంగ్డీ 3, ప్యాటిన్‌సన్‌ (సి) డుప్లెసిస్‌ (బి) ఎంగ్డీ 11, రాహుల్‌ చాహర్‌ (నాటౌట్‌) 2, బౌల్ట్‌ (బి) దీపక్‌ 0, బుమ్రా (నాటౌట్‌) 5, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 20 ఓవర్లలో 162/9. వికెట్ల పతనం: 1-46, 2-48, 3-92, 4-121, 5-124, 6-136, 7-151, 8-156, 9-156, బౌలింగ్‌: దీపక్‌ 4-0-32-2, కరన్‌ 4-0-28-1, ఎంగ్డీ 4-0-38-3, చావ్లా 4-0-21-1, జడేజా  4-0-42-2. 

చెన్నై: విజయ్‌ (ఎల్బీ) ప్యాటిన్‌సన్‌ 1, వాట్సన్‌ (ఎల్బీ) బౌల్ట్‌ 4, డుప్లెసిస్‌ (నాటౌట్‌) 55, రాయుడు (సి అండ్‌ బి) రాహుల్‌ చాహర్‌ 71, జడేజా (ఎల్బీ) కృనాల్‌ 10, కరన్‌ (సి) ప్యాటిన్‌సన్‌ (బి) బుమ్రా 18, ధోనీ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 19.2 ఓవర్లలో 163/5. వికెట్ల పతనం: 1-5, 2-6, 3-121, 4-134, 5-153, బౌలింగ్‌: బౌల్ట్‌ 3.2-0-20-1, ప్యాటిన్‌సన్‌ 4-0-27-1, బుమ్రా 4-0-43-1, కృనాల్‌ 4-0-37-1, రాహుల్‌ చాహర్‌ 4-0-36-1.  logo