మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Nov 15, 2020 , 14:56:35

క్రీడల ప్రోత్సాహానికి 500 ప్రైవేట్ అకాడమీలకు నిధుల కేటాయింపు

క్రీడల ప్రోత్సాహానికి 500 ప్రైవేట్ అకాడమీలకు నిధుల కేటాయింపు

ఢిల్లీ :దేశంలో క్రీడల అభివృద్ధి కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రైవేట్ శిక్షణా కేంద్రాల ( అకాడమీలు)కు నిధులను కేటాయించాలని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఖేలో ఇండియా పథకం కింద ఈ పథకాన్ని 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాలపాటు తొలిసారిగా క్రీడామంత్రిత్వ శాఖ అమలుచేయనున్నది. ఈ పథకం కింద ఎంపిక చేసిన అకాడమీలకు క్రీడామంత్రిత్వ శాఖ ఆర్ధిక ప్రోత్సాహకాలను అందిస్తుంది. దీనికోసం క్రీడలలో శిక్షణ ఇస్తున్న అకాడమీలను వివిధ తరగతులుగా విభజించడం జరుగుతుంది.

అకాడమీలలో శిక్షణ పొందిన క్రీడాకారులు ప్రదర్శించిన ప్రతిభ, అకాడమీలో శిక్షణ ఇస్తున్నవారి స్థాయి, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, శాస్త్రీయ సౌకర్యాలు లాంటి అంశాల ప్రాతిపదికగా ఈ అకాడమీలను ఎంపిక చేస్తారు. 2028లో జరగనున్న ఒలింపిక్స్ క్రీడల అంశాలను దృష్టిలో ఉంచుకుని తొలి దశలో 14 క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చి సహకారం కోసం ఎంపిక చేస్తారు. ' దేశంలోని మారుమూల ప్రాంతాలలో కూడా ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారిని తీర్చిదిద్దడానికి ఇటువంటి శిక్షణా సంస్థలకు ప్రభుత్వం ప్రోత్సహించవలసి ఉంటుంది.

క్రీడాకారులను గుర్తించి వారికి అవసరమైన శిక్షణను అనేక చిన్న చిన్న అకాడమీలు అందిస్తున్నాయి. ఈ పథకం ద్వారా ఇటువంటి సంస్థలను గుర్తించి వాటిలో సౌకర్యాలు, శాస్త్రీయ శిక్షణ, ఇతర సౌకర్యాలను మెరుగుపరచడానికి సహకారం అందిచడం జరుగుతుంది. దీనివల్ల క్రీడాకారులు మరింత ఉన్నత శిక్షణను పొందడానికి అవకాశం కలుగుతుంది' అని కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజీజూ వివరించారు.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.