గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Mar 10, 2020 , 23:54:27

కల తీరేనా!

కల తీరేనా!

ప్రతిష్ఠాత్మక ఆల్‌ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో టైటిల్‌ కల భారత షట్లర్లను ఊరిస్తూనే ఉంది. రెండు దశాబ్దాలుగా అందని ద్రాక్షగా మారిన టైటిల్‌ను ఈసారైనా ఒడిసిపట్టుకునేందుకు మన షట్లర్లు సిద్ధమయ్యారు. ఫామ్‌లేమితో సతమతమవుతున్న సింధుతో పాటు గాయాలతో ఇబ్బంది పడుతున్న సైనా తిరిగి పుంజుకోవాలన్న పట్టుదలతో ఉంది. టోక్యో ఒలింపిక్స్‌ అర్హతకు ఈ టోర్నీకి కీలకం కావడంతో పోరు రసవత్తరంగా సాగే అవకాశముంది.

  • నేటి నుంచి ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌
  • టైటిల్‌ లక్ష్యంగా బరిలో సింధు, సైనా
  • ఒలింపిక్స్‌ అర్హతకు కీలకంగా టోర్నీ

బర్మింగ్‌హామ్‌: గతేడాది ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన తర్వాత ఒక్క టైటిల్‌ కూడా గెలువలేకపోయిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటాలని పట్టుదలగా ఉంది. ఒలింపిక్స్‌ అర్హత కోసం శ్రమిస్తున్న సైనా నెహ్వాల్‌,  శ్రీకాంత్‌ ఈ టోర్నీలో అదరగొట్టాలని ఆశిస్తున్నారు. ఈ సీజన్‌లో తొలి బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-1000 టోర్నీ అయిన  ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ ఓపెన్‌ బుధవారం ఇక్కడ ప్రారంభం కానుంది. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ను దాదాపు పక్కా చేసుకున్న తెలుగమ్మాయి సింధు ఆల్‌ ఇంగ్లండ్‌ టైటిల్‌ గెలిచిన తొలి భారత మహిళా షట్లర్‌గా నిలువాలని ఉవ్విళ్లూరుతున్నది. 2018లో ఈ టోర్నీలో సెమీస్‌ చేరిన ప్రపంచ ఆరో ర్యాంకర్‌ సింధు.. ఈసారి  మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో  బివాన్‌ జెంగ్‌(అమెరికా)తో పోటీని ఆరంభించనుంది. 


శ్రీకాంత్‌కు కఠిన పోటీ 

పురుషుల విభాగంలో టోక్యో టికెట్‌ దక్కించుకోవాలని పట్టుదలగా ఉన్న భారత షట్లర్‌ శ్రీకాంత్‌... ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ ఆదిలోనే తన కంటే మెరుగైన ర్యాంకు ప్రత్యర్థిని ఎదుర్కోనున్నాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో శ్రీకాంత్‌.. ఒలింపిక్‌ చాంపియన్‌, మూడో సీడ్‌ చెన్‌ లాంగ్‌(చైనా)ను ఢీకొననున్నాడు. ఇప్పటికే ఒలింపిక్స్‌లో చోటు దాదాపు ఖరారు చేసుకున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత సాయి ప్రణీత్‌ తొలి రౌండ్‌లో జ్వాజున్‌ పెంగ్‌(చైనా)తో తలపడనుండగా... హిరెన్‌ రుస్టావిటో(ఇండోనేషియా)తో  కశ్యప్‌ పోటీ పడనున్నాడు. భారత యువ కెరటం లక్ష్యసేన్‌ తొలిసారి ఈ టోర్నీలో అడుగు పెడు తున్నాడు. పురుషుల డ బుల్స్‌లో  సాత్విక్‌ సా యిరాజ్‌ - చిరాగ్‌ శెట్టి జోడీ తొలి రౌండ్లో టాప్‌ సీడ్‌ మార్కస్‌ గిడిన్‌ - సంజయ సుకముల్జో(ఇండోనేషియా) ద్వయంతో తలపడనుంది. మహిళల డబుల్స్‌లో ఎన్‌.సిక్కిరెడ్డి - అశ్వినీ పొన్నప్ప  జోడీ పోటీలో ఉంది.  


ఇప్పటి వరకు ఇద్దరే..

ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఇప్పటి వరకు ఇద్దరు భారత షట్లర్లు మాత్రమే విజేతలుగా నిలిచారు. 1980లో పురుషుల సింగిల్స్‌లో దిగ్గజ ప్లేయర్‌ ప్రకాశ్‌ పదుకొనే టైటిల్‌ సాధించాడు. ఆ తర్వాత ప్రస్తుత జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ 2001లో విజేతగా నిలిచాడు. 2015 టోర్నీ మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్‌ ఫైనల్‌ చేరినా మారిన్‌(స్పెయిన్‌) చేతిలో ఓడింది. 

 

కరోనా ఆందోళన

బ్రిటన్‌లోనూ కరోనా  వైరస్‌ వ్యాపిస్తుండటంతో తొలుత టోర్నీ నిర్వహణే సంది గ్ధంలో పడిం ది. అయితే ఒలిం పిక్స్‌  క్వాలిఫి కేషన్‌లో ముఖ్యం కావడ ంతో టోర్నీ   జరిపేందుకే నిర్వాహకులు మొగ్గు చూపారు. 


ఒలింపిక్స్‌ లక్ష్యంగా..

మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడాన్నే లక్ష్యంగా నిర్దేశించుకున్న హైదరాబాదీ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ కీలకమైన ఈ టోర్నీలో తప్పక రాణించాలని భావిస్తున్నది. అయితే మూడో సీడ్‌ అకానే యమగూచి(జపాన్‌) రూపంలో తొలి రౌండ్‌లోనే 2015 రన్నరప్‌ సైనాకు కఠిన ప్రత్యర్థి ఎదురైంది. ఈ ఏడాది జరిగే విశ్వక్రీడల్లో చోటు దక్కించుకోవాలంటే అర్హత వ్యవధి ఏప్రిల్‌ 28వ తేదీ ముగిసేలోగా టాప్‌-16లో షట్లర్లు ఉండాల్సిందే. ఇంగ్లండ్‌ పోటీలో విజేతగా నిలిస్తే 12వేల ర్యాంకింగ్‌ పాయింట్లు రానున్న నేపథ్యంలో ప్లేయర్లందరూ ఈ టోర్నీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ప్రస్తుతం ఒలింపిక్‌ క్వాలిఫికేషన్‌లో సైనా 22వ ర్యాంకులో ఉంది. 


logo