శుక్రవారం 23 అక్టోబర్ 2020
Sports - Oct 18, 2020 , 00:50:33

డివిలియర్స్‌ ధమాకా

డివిలియర్స్‌ ధమాకా

  • సిక్సర్లతో ఏబీ వీరవిహారం 
  • రాజస్థాన్‌పై బెంగళూరు గెలుపు 
  • స్మిత్‌ అర్ధశతకం వృథా

ఏబీ డివిలియర్స్‌ మరోసారి అద్భుతం చేశాడు. గెలుపుపై ఆశలు సన్నగిల్లిన తరుణంలో సిక్సర్లతో తన మార్క్‌ విధ్వంసం సృష్టించి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును విజేతగా నిలిపాడు. మిస్టర్‌ 360 పేరుకు తగ్గట్లు రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. 22 బంతుల్లో ఆరు భారీ సిక్సర్లతో ఆర్‌సీబీకి అద్భుత విజయాన్ని కట్టబెట్టాడు. ఈ సీజన్‌లో తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరో విజయంతో ప్లేఆఫ్స్‌కు కోహ్లీసేన దగ్గరైతే... ఇందుకు భిన్నంగా ఆరో ఓటమితో రాయల్స్‌ ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి కొనితెచ్చుకుంది. 

దుబాయ్‌: స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ ఏబీ డివిలియర్స్‌ విజృంభణ, క్రిస్‌ మోరిస్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) ఈ ఏడాది ఐపీఎల్‌లో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆదివారం ఇక్కడి దుబాయ్‌ అంతర్జాతీయ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌పై గెలిచింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులతో మిడిలార్డర్‌లో వచ్చిన కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌(36 బంతుల్లో 57; 6ఫోర్లు, ఓ సిక్స్‌), ఓపెనర్‌ రాబిన్‌ ఊతప్ప(22 బంతుల్లో 41; 7ఫోర్లు, ఓ సిక్స్‌) రాణించారు. బెంగళూరు బౌలర్లలో క్రిస్‌ మోరిస్‌(4/26) నాలుగు వికెట్లతో కట్టడి చేయగా.. చాహల్‌ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. లక్ష్యఛేదనలో ఏబీ డివిలియర్స్‌(22 బంతుల్లో 55 నాటౌట్‌; ఓ ఫోర్‌, 6 సిక్స్‌లు) మెరుపులతో బెంగళూరు 19.4 ఓవర్లలో 3 వికెట్లకు 179 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్‌ కోహ్లీ(32 బంతుల్లో 43; ఓ ఫోర్‌, 2 సిక్స్‌లు) రాణించాడు. రాజస్థాన్‌ బౌలర్లలో శ్రేయస్‌ గోపాల్‌, కార్తీక్‌ త్యాగి, రాహుల్‌ తెవాటియా తలో వికెట్‌ తీసుకోగా.. జోఫ్రా ఆర్చర్‌, ఉనాద్కత్‌ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. డివిలియర్స్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' దక్కింది. 

ఆరంభం నెమ్మదిగా.. 

లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు ఓపెనర్లు ఫించ్‌(14), పడిక్కల్‌(35) తొలుత ఆచితూచి ఆడారు. అయితే ఆర్చర్‌ వేసిన మూడో ఓవర్లో రెండు సిక్సర్లతో జోరు చూపిన ఫించ్‌.. తర్వాతి ఓవర్లో వెనుదిరిగాడు. అనంతరం కెప్టెన్‌ కోహ్లీ, పడిక్కల్‌ స్ట్రైక్‌ రొటేట్‌ చేసేందుకే ప్రాధాన్యమివ్వడంతో బెంగళూరు 10 ఓవర్లకు 77 పరుగులు చేసింది. 13వ ఓవర్‌ చివరి బంతికి తెవాటియా పడిక్కల్‌ను ఔట్‌ చేయడం.. ఆ తర్వాతి ఓవర్‌ తొలి బంతికే తెవాటియా అద్భుత క్యాచ్‌కు కోహ్లీ వెనుదిరగడంతో బెంగళూరు కష్టాల్లో పడగా.. క్రీజులోకి డివిలియర్స్‌ అడుగుపెట్టాడు. 

ఏబీ దూకుడు

చివరి ఐదు ఓవర్లలో 64 పరుగులు చేయాల్సిరాగా.. తదుపరి రెండు ఓవర్లలో ఒక్కో సిక్స్‌కే పరిమితమైన డివిలియర్స్‌ ఆ తర్వాత జూలు విదిల్చాడు. 12 బంతుల్లో 35 రన్స్‌ అవసరమైన స్థితిలో ఉనాద్కత్‌ వేసిన 19వ ఓవర్లో తొలి మూడు బంతులకు వరుసగా మూడు భారీ సిక్సర్లు బాదాడు. దీంతో మ్యాచ్‌ ఒక్కసారిగా బెంగళూరు వైపునకు తిరిగింది. గుర్‌కీరత్‌(19 నాటౌట్‌) ఓ బౌండరీ బాదగా.. చివరి ఓవర్లో భారీ సిక్సర్‌తో డివిలియర్స్‌ మ్యాచ్‌ను ముగించాడు. ఈ క్రమంలో 22 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 


ప్రయోగం ఫలించినా.. 

బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు రాజస్థాన్‌ రాయల్స్‌కు ఫలితాన్నిచ్చినా బెంగళూరు పేసర్‌ మోరిస్‌ అద్భుత బౌలింగ్‌తో 180 పరుగులలోపే నిలిచిపోయింది. చాలా మ్యాచ్‌ల తర్వాత ఓపెనర్‌గా వచ్చిన  ఊతప్ప.. సుందర్‌ వేసిన మూడో ఓవర్లో నాలుగు ఫోర్లతో బాదుడు మొదలుపెట్టి రెచ్చిపోయాడు. దీంతో ఐదు ఓవర్లకు రాజస్థాన్‌ 47 పరుగులు చేసింది. ఆ తర్వాతి ఓవర్లో స్టోక్స్‌ ఔటైనా.. దూకుడు కనబరిచిన ఊతప్పను చాహల్‌ 8వ ఓవర్లో పెవిలియన్‌కు పంపాడు. మలి బంతికే శాంసన్‌ కూడా ఔటవడంతో రాజస్థాన్‌కు పరుగుల రాక మందగించింది. కెప్టెన్‌ స్మిత్‌ బౌండరీలు బాదుతూ ముందుకు సాగినా బట్లర్‌ స్లో బ్యాటింగ్‌తో నిరాశపరిచి 16వ ఓవర్లో ఔటయ్యాడు. జోరు తగ్గించని స్మిత్‌ 30 బంతుల్లో అర్ధశతకాన్ని చేరాడు. చివర్లో రాహుల్‌ తెవాటియా(19 నాటౌట్‌) దూకుడుగా ఆడాడు.

శభాష్‌  షహబాజ్‌  

బెంగళూరు యువ ఆల్‌రౌండర్‌ షహబాజ్‌ అహ్మద్‌ ఈ మ్యాచ్‌లో కండ్లు చెదిరే క్యాచ్‌ పట్టాడు. మోరిస్‌ వేసిన చివరి ఓవర్‌లో రాజస్థాన్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ షాట్‌ కొట్టగా స్వీపర్‌ కవర్‌ నుంచి పరుగెత్తుకొచ్చి ఫుల్‌డైవ్‌తో బంతిని ఒడిసిపట్టాడు. మరోవైపు తెవాటియా సైతం  కోహ్లీ క్యాచ్‌ను బౌండరీ దగ్గర దాదాపు సిక్సర్‌ వెళ్లే బంతిని అద్భుతంగా పట్టాడు. 

స్కోరు బోర్డు: 

రాజస్థాన్‌: ఊతప్ప (సి) ఫించ్‌ (బి) చాహల్‌ 41, స్టోక్స్‌ (సి) డివిలియర్స్‌ (బి) మోరిస్‌ 15, శాంసన్‌ (సి) మోరిస్‌ (బి) చాహల్‌ 9, స్మిత్‌ (సి) షహబాజ్‌ (బి) మోరిస్‌ 57, బట్లర్‌ (సి) సైనీ (సి) మోరిస్‌ 24, తెవాటియా (నాటౌట్‌) 19, ఆర్చర్‌ (ఎల్బీడబ్ల్యూ) మోరిస్‌ 2. ఎక్స్‌ట్రాలు: 10. మొత్తం: 20 ఓవర్లలో 177/6. వికెట్ల పతనం: 1-50, 2-69, 3-69, 4-127, 5-173, 6-177. బౌలింగ్‌: సుందర్‌ 3-0-25-0, మోరిస్‌ 4-0-26-4, ఉదాన 3-0-43-0, సైనీ 4-0-30-0, చాహల్‌ 4-0-34-2, షహబాజ్‌ 2-0-18-0. 

బెంగళూరు: పడిక్కల్‌ (సి) స్టోక్స్‌ (బి) తెవాతియా 35, ఫించ్‌ (సి) ఊతప్ప (బి) గోపాల్‌ 14, కోహ్లీ (సి) తెవాటియా (బి) త్యాగి 43, డివిలియర్స్‌ (నాటౌట్‌) 55, గుర్‌కీరత్‌ (నాటౌట్‌) 19, ఎక్స్‌ట్రాలు: 13, మొత్తం: 19.4 ఓవర్లలో 179/3. వికెట్ల పతనం: 1-23, 2-102, 3-102, బౌలింగ్‌: ఆర్చర్‌ 3.4-0-38-0, 4-0-32-1, గోపాల్‌ 4-0-32-1, త్యాగి  4-0-32-1, ఉనాద్కత్‌ 4-0-46-0, తెవాటియా 4-0-30-1. 


logo